విజయవాడ, ఏప్రిల్ 15, (way2newstv.com)
ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టుగా సార్వత్రిక ఎన్నికల సమరం ఏపీలో ముగిసింది. అయితే, ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు చేసిన ప్రయత్నాలు ఎన్నికల రోజు కూడా స్పష్టంగా కనిపించాయి. ఏ పార్టీకి ఆ పార్టీ దూకుడు ప్రదర్శించింది. ఎక్కడికక్కడ తమ హవాను ప్రదర్శించేం దుకు శత విధాల ప్రయత్నించాయి. ఇక, ఓటరు దేవుళ్ళు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసేశారు. అయితే, ప్రజలు ఎవరికి పట్టం కట్టారు? ఎవరిని అందలం ఎక్కించారు? అనే విషయాలు తెలుసుకునేందుకు మాత్రం దాదాపు 40 రోజుల నిరీక్షణ తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.ఇక, ఎన్నికలు ముగియగానే వచ్చే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఈ దఫా ఎన్నికల సంఘం చాలా దూరాన్ని నెట్టేసింది.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మే 19న తుది ఎన్నికల సమరం ముగిసే వరకు కూడా ఎవరూ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించరాదనే షరతు విధించింది. మొత్తంగా చూసుకుంటే.. ఎవరి విశ్లేషణ అయినా కూడా మే 19 సాయంత్రం 6 తర్వాతే విడుదల కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీలో అధికారం ఎవరిది? అనే ఆసక్తికర విషయం కోసం దాదాపు నెలకు పైగా వెయిట్ చేయక తప్పనిపరిస్థితి ఏర్పడింది. అయితే, పార్టీలు మాత్రం చాలా ఉత్సాహంగా, చాలా జోష్‌గా కనిపిస్తుండడం గమనార్హం.ఎన్నికలకు పోటెత్తిన మహిళలు, వృద్ధులు, యువతను అంచనా వేసుకుంటున్న ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు గెలుపు తమదంటే తమదేనని చెబుతున్నారు. అంతేకాదు, మహిళా ఓట్లు మాకేనని టీడీపీ అంటే.. లేదు ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించిన కసిగా వైసీపీ పేర్కొంటోంది. దీంతో రెండు శిబిరాల్లో ఎన్నడూ లేని విధంగా ఆనందం తాండవిస్తోంది. ఇక, ఎన్నికల సంఘం నిర్వర్తించిన తీరుపై సగటు ఓటరు విస్మయం , ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ విజయవాడ, విశాఖ పట్నం వంటి అతి పెద్ద నగరాల్లోనూ ఉదయం 10 గంటల వరకు కూడా ప్రారంభం కాకపోవడం, ఈవీఎంలు పనిచేయక పోవడం వీవీ ప్యాట్‌లలో తలెత్తిన లోపాలు వంటివి కూడా ఎన్నికల సంఘాన్ని బోనెక్కించాయి. మొత్తంగా చూసుకుంటే.. ముగ్గురు మరణాలతో ముగిసిన ఈ ఎన్నికలు చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోనున్నాయనేది వాస్తవం.