ఖమ్మం, ఏప్రిల్ 3 (way2newstv.com):
మొక్కజొన్నలకు ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. గతంలో ఎన్నిడూలేని విధంగా మద్దతు ధరకు మించి వ్యాపారులు కొనుగోలు చేయటం విశేషం. చాలా మంది రైతులు వాణిజ్య పంటలు వేసి తీవ్రంగా నష్టపోయారు. ఈపరిస్థితుల్లో సన్న, చిన్నకారు రైతులు గత మూడేళ్ల నుంచి మొక్కజొన్నసాగుపై మక్కువ చూపించారు. గత రెండేళ్లలో రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించలేదు. ఈసంవత్సరం మాత్రం డిమాండ్ బాగా పెరిగింది. అయితే దిగుబడి మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రధానంగా కత్తెర పురుగు ఆశించటం వల్ల దిగుబడులు సగానికి పైగా తగ్గిపోయాయి. ధర మాత్రం ఆశాజనకంగా ఉంది. అయితే అమ్ముకునేందుకు సరకే లేదు.
గత ఏప్రిల్ నెలలో చూస్తే క్వింటా మొక్కజొన్నల గరిష్ఠధర రూ.1190లు పలికింది. ఇదే ధర మే నెలలో రూ.1110కి తగ్గింది. ఆ తర్వాత జూన్, జులై, ఆగస్టు నెలల్లో రూ.1225లుగా ధర నిలకడగా ఉంది. ఇక సెప్టెంబరు నెల నుంచి పెరుగుదల ప్రారంభమైంది. అంటే ఖరీఫ్‌లో సాగు చేసిన మొక్కజొన్నల సీజన్ ప్రారంభం నుంచి పెరుగుదల కన్పిస్తోంది. సెప్టెంబరులో రూ.1354, అక్టోబరులో రూ.1450, నవంబరులో రూ.1540, డిసెంబరులో రూ.1700, జనవరిలో రూ.1740, ఫిబ్రవరిలో రూ.2000ల రికార్డు ధరకు చేరింది. మొక్కజొన్నలకు ఇంత పెద్ద ఎత్తున ధర లభించటం ఇదే తొలిసారి కావటం విశేషం.
మక్కలకు మరింత డిమాండ్ (ఖమ్మం)
ప్రస్తుతం మార్కెట్లో రూ.1800 పలుకుతోంది. ప్రభుత్వం మొక్కజొన్నలకు గత సంవత్సరం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) రూ.1425. ఈసంవత్సరం మాత్రం దాన్ని రూ.1700లకు పెంచింది. రైతులకు మాత్రం ఇంతకు మించే ధర వస్తోంది. దీంతో మక్కల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కత్తెర పురుగు పంటను ఆశించి నష్టం చేసింది. కొంత మంది రైతులు పంటలను పీకేశారు. బోనకల్లు, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, తల్లాడ మండలాల్లో రైతులు దారుణంగా నష్టపోయారు. కత్తెర పురుగు యాసంగి దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపింది. ఎకరానికి 40క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా అందులో సగం మాత్రమే వచ్చింది. తెగుళ్ల దిగుబడి తగ్గింది. వానా కాలంలో మాత్రం ఎలాంటి తెగుళ్లు రాకుండా ఉంటే 30క్వింటాళ్లు వస్తుంది. అది కూడా ఈసారి దెబ్బతిన్నది. గతంలో ఎకరానికి రూ.13వేల నుంచి రూ.16వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి రాగా ఇప్పుడు అది రూ.21వేల నుంచి రూ.26వేల వరకు పెరిగింది. తెగుళ్లు, చీడపీడల బెడద వల్ల పెట్టుబళ్లు కూడా పెరిగాయి. కొద్దోగొప్పో పంట చేతికొచ్చిన తర్వాత మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు, సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌తో పాటు ప్రైవేటు వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లిక్కర్ తయారీలో, ఫౌల్ట్రీ పరిశ్రమకు మొక్కజొన్నలను ఎక్కువగా ఉపయోగిస్తారు. గతంలో ఇతర దేశాలకు కూడా ఎక్కువగా ఎగుమతి చేసేవారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేసే వారు. ఖమ్మం జిల్లా నుంచి కాకినాడ, విశాఖపట్నం, చైన్నై ఓడరేవుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే వారు. ప్రస్తుతం తమిళనాడులో మొక్కజొన్నలకు డిమాండ్ ఏర్పడింది. అక్కడ మొక్కజొన్నల సాగు ఎక్కువగా లేదు. ఈరోడ్, సేలంలలో మక్కలపై ఆధారపడిన ఫీడ్ కంపెనీలు, పౌల్ట్రీపరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎక్కువ సరుకు తమిళనాడుకు వెళ్తోంది. ఆ తర్వాత మహారాష్ట్రకు కూడా ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌తో పాటు మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, నర్సంపేట మార్కెట్లకు అత్యధికంగా మొక్కజొన్నలు వస్తాయి. తెలంగాణలో ఖమ్మం జిల్లా మొక్కజొన్నల వ్యాపారంలో మూడో స్థానంలో ఉంది. ఖమ్మం జిల్లా నుంచి ప్రతి సంవత్సరం సుమారు 5లక్షల టన్నుల మొక్కజొన్నలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.