ఎవరికి దక్కేనో..? (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎవరికి దక్కేనో..? (కరీంనగర్)

కరీంనగర్, ఏప్రిల్ 3 (way2newstv.com):
మూడు పార్టీల రణరంగానికి నెలవైన కరీంనగర్‌  పార్లమెంట్‌ ఎన్నికల్లో కీలక స్థానంగానే పేరొందుతోంది.  తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు ఈ స్థానాన్ని కైవసం చేసుకునేలా పావులు కదుపుతుండటంతో ఆసక్తికర పరిణామాలు  కనిపిస్తున్నాయి. మూడు నెలల కిందట జరిగిన శాసనసమరంతో పోలిస్తే ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల సమయానికి రాజకీయ రంగులతోపాటు ప్రచార హంగులు మారాయి. అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అనేలా ఆధిపత్య పోరు సాగుతోంది. ఇదే తరుణంలో గతంలో వచ్చిన ఓట్లను తారుమారు చేసేలా తమ బలాన్ని చూపించాలని ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో తరహాలో ప్రజలకు హామీలను గుప్పిస్తున్నాయి. తమని గెలిపిస్తే ప్రగతిని దరిచేరుస్తామనే తీరుని తెలియపరుస్తున్న అభ్యర్థులు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో సాధించే ఓట్ల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. ఓట్లను లెక్కిస్తూ వాటిని తమ ఖాతాలో వేసుకునేలా వ్యూహాల్ని పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని గత పరిస్థితులు, తాజా ఎత్తుగడలను ఇప్పుడు పరిశీలిద్దాంనియోజకవర్గాల పరంగా చూస్తే తక్కువ ఓట్లున్న నియోజకవర్గమే అయినా పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చూపేలా వేమువాడ ఓటర్లు విభిన్నమైన తీర్పుని అందించనున్నారు. తెరాస గత అసెంబ్లీ ఎన్నికల్లో 84,050ఓట్లను పొందింది. ఇక్కడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు 31వేలకుపైగా ఆధిక్యం పొందారు. అక్కడి కాంగ్రెస్‌ పార్టీకి 55,864ఓట్లు వచ్చాయి. ఇదే తరహాలో భాజపా అభ్యర్థి 6569ఓట్లను పొంది అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచే కమలనాథులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆపార్టీ ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లను కైవసం చేసుకోవాలనే జోష్‌ను చూపిస్తోంది. అదే తరహాలో కాంగ్రెస్‌ పార్టీ పలు సమావేశాల్ని నిర్వహిస్తూ ఓట్లు పొందాలనే ఎత్తుగడల్ని చూపిస్తుండగా తెరాస మాత్రం అందరికన్నా ముందుండేలా అగ్రనాయకుల రోడ్‌షోలతో ప్రజల మనసుల్ని గెలిచే ప్రయత్నాల్లో ముందువరుసలో ఉంటోంది. ప్రచారంలోనూ వైవిధ్యతను చూపిస్తూ అందరిని ఆకర్షించుకోవాలని మూడు పార్టీల పోటీదారులు భావిస్తున్నారు.

ఎవరికి దక్కేనో..? (కరీంనగర్)

పార్లమెంట్‌ పరిధిలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం కరీంనగర్. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గంగుల కమలాకర్‌కు 14,974 ఆధిక్యత వచ్చింది. సుమారుగా 2లక్షల ఓట్లు పోలవగా ఇందులో తెరాసకు 80,983ఓట్లు పడ్డాయి. నియోజకవర్గంలో తెరాస పైచేయిని సాధించినప్పటికీ ఆ పార్టీకి సమీపంలోనే నిలబడేలా భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కి కూడా 66 వేలకుపైగా ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ 39,500 మంది ఆదరణను అందుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చూపించిన అభిమానాన్ని మరింతగా పెంచుకునేలా మూడు పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రయత్నాల్ని సల్పుతున్నారు. ముఖ్యంగా తెరాస గతానికి భిన్నంగా కరీంనగర్‌ పట్టణంలో ఆధిక్యతను పొందాలని భావిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లపై  తెరాస నేతలు ఆకర్ష వల విసిరారు. తమ పార్టీలో చేర్చుకున్నారు. తెరాస బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్ని సాగిస్తుండగా.. భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లను అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
చొప్పదండి నియోజకవర్గ పరిధిలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మొన్నటి శాసనసమరం సమయంలోనే మారిపోయాయి. అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శోభకు తెరాస టికెట్‌ను నిరాకరించడం, సుంకె రవిశంకర్‌ గులాబీ పార్టీ అభ్యర్థిగా మారిపోవడం..భాజపా నుంచి శోభ పోటీ చేయడం.. సుంకె రవిశంకర్‌ 42,127ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.  తెరాస  అభ్యర్థి గెలుపొందడంతో ఇక్కడ పార్టీ శ్రేణులు ఉత్సాహంగానే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో గత ఓట్ల రికార్డును (91,090) పదిలపర్చుకునేలా తెరాస సమాయత్తమవుతుండగా.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తమకు వచ్చిన 48,963ఓట్లను రెండింతలుగా మార్చుకునేలా లోలోపల పార్టీ శ్రేణులతో ప్రజల్ని కలుస్తోంది. భాజపా అభ్యర్థికి కూడా ఈ నియోజకవర్గ పరిధిలోని యువజన సంఘాల మద్దతు క్రమక్రమంగా పెరుగుతుండటంతో పోటీ త్రిముఖమనే  వినిపిస్తోంది. అధికార పార్టీలోకి ఆయా మండల స్థాయి నాయకులు చేరడంతో కాంగ్రెస్‌కు ఒకింత కలవరం తప్పడంలేదు. భాజపా మాత్రం జోరును చూపించేలా అడుగులేస్తోంది.
ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గం అవడంతో ఇక్కడ గులాబీ పార్టీకి వచ్చే ఓట్ల అంచనాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఓట్లు పెరిగినట్లే ఈ స్థానంలో లోక్‌సభకు తెరాస అభ్యర్థికి వీలైనన్ని ఎక్కువ ఓట్లను అందించేలా మంత్రి వ్యూహాత్మకంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. పైగా పార్లమెంట్‌ స్థానంలో ప్రచార బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే సొంత నియోజకవర్గం ఆధిక్యతపై కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 1,03,764 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి 60,509 ఓట్లు రాగా 43వేలకుపైగా ఎక్కువ ఓట్లను ప్రత్యర్థిపై సాధించారు. ఇక్కడ భాజపా అనుకున్న తరహాలో కనీసం డిపాజిట్‌కు సరిపడ ఓట్లను కూడా పొందలేక 1662తో సరిపెట్టుకుంది. దీంతో ఈ నియోజకవర్గంలో మిగతా రెండు పార్టీలకన్నా జోరుని చూపించాలంటే కమలనాథులకు కష్టమైన ప్రక్రియనే. ఇక గత ఎన్నికల్లో గెలుపు ఆశతో పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో గత ఫలితాల్ని తారుమారు చేసేలా ఓట్ల జోరుని పెంచుకావాలని చూస్తోంది. గ్రామస్థాయిలో ఓటర్లతోపాటు జమ్మికుంట, హుజురాబాద్‌ పురపాలికల్లోని ఓటర్లు ఎవరిని కరుణిస్తారనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
మానకొండూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌పై మూడు పార్టీల నాయకులు కన్నేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆరెపల్లి మోహన్‌ అనూహ్యంగా తన అనుచరులతో తెరాస గూటిని చేరడంతో రాజకీయ వర్గాల్లో ఇది చర్చకు తావిచ్చింది. దీంతో చాలా మండలాల్లో మండలస్థాయి నాయకులు కూడా పార్టీని విడిచే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పార్టీ బాధ్యతల్ని మోస్తున్న కవ్వంపల్లి సత్యనారాయణ తనవంతు ప్రయత్నాల్ని చేస్తున్నారు. కాంగ్రెస్‌కు తగిలిన గాయాన్ని రూపుమాపేలా ఊరూర సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కేవలం 4,335 ఓట్లను మాత్రమే పొందిన భాజపా ఇప్పటి సమరంలో అందుకు పదింతల ఆధిక్యతను మూటగట్టుకునేలా ఊరూర ఓటర్లను కలిసే పనిలో నిమగ్నమైంది. తెరాసకు ఈ నియోజకవర్గంలో 88,890 ఓట్లురాగా.. 57,209 ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్థికి వచ్చాయి. దీంతో ఇక్కడ ఇప్పుడు తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తోపాటు ఆయనపై పోటీ చేసి ఓటమి చెందిన ఆరెపల్లి మోహన్‌ ఇద్దరు  కలిసి తమబలాన్ని చాటాలని చూస్తున్నారు.
సిరిసిల్ల..ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే అత్యధికంగా గులాబీ పార్టీకి ఓట్లను గంపగుత్తగా అందించిన నియోజకవర్గమిది. ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గెలిచిన స్థానమవడంతో ఇక్కడితీరు మిగతా నియోజకవర్గాలకు భిన్నంగానే ఉంటోంది. తెరాసకు 1,25,213 ఓట్లు రాగా కాంగ్రెస్‌ 36,204ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కేటీఆర్‌ 89,009ఓట్ల పైచేయిని కాంగ్రెస్‌పై సాధించారు. ఇక్కడ భాజపా అభ్యర్థి 3,243ఓట్లు మాత్రమే లభించాయి. కేటీఆర్‌ నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి పర్చడం సహా ఇక్కడినుంచి గెలిచిన ఆయన రాష్ట్రస్థాయిలో కీలక హోదాలో ఉంటారని ఇక్కడి ఓటర్లు ఈ తరహాలో పట్టం కట్టారు. ఇప్పుడు అదే పంథాని కొనసాగించేలా గులాబీ సేనాని ముందుకు పరుగెత్తుతుండగా.. నేరెళ్ల ఘటనలో బాధితులకు మద్దతును తెలిపిన భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ దండిగానే సానుభూతి ఓట్లు వస్తాయనే విశ్వాసంతో ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కూడా ఎట్టిపరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు రెట్టింపుగా ప్రజల విశ్వాసాన్ని అందుకోవాలనే తపనను ప్రచారంలో చూపిస్తున్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్‌ నుంచి ప్రత్యేక స్థానంగా గుర్తింపును పొందిన హుస్నాబాద్‌పైనే అన్ని పార్టీల దృష్టి పడుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తెరాసకు ఎక్కువగానే ఇక్కడ ఓట్లు పడ్డాయి. తెరాస తరపున పోటీ చేసిన వొడితెల సతీష్‌కుమార్‌ ఏకంగా 1,17,083 ఓట్లను సంపాదించుకున్నారు. ఇక్కడ ప్రజా కూటమి అభ్యర్థికి 46,553ఓట్లు వచ్చాయి. ఇక భాజపా అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. కేవలం 4వేలకుపైగా ఓట్లను పొందింది. దీంతో ఇక్కడి ఓట్లను ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అన్ని గ్రామాల్లో తిరుగుతున్నారు. అత్యధికంగా మండలాలున్న నియోజకవర్గం అవడంతో ఇక్కడనే ప్రచారం జోరుగా అందరు అభ్యర్థులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కొత్త కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఉన్న చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల్లో ఉన్న పట్టును మరింతగా పెంచుకునేలా పార్టీల ముఖ్య నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.