అంతా నిశ్శబ్దం....
హైద్రాబాద్, ఏప్రిల్ 10 (way2newstv.com)
ఎలక్షన్ సీన్ క్లైమాక్స్‌కు చేరింది. ఇప్పటివరకు హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు హామీల వర్షం కురిపించిన ఆయా పార్టీల అభ్యర్థులు... ఇప్పుడు ‘ఆపరేషన్ ఆకర్ష్’కు శ్రీకారం చుట్టారు. ఆయా వర్గాలఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తాయిలాల పర్వానికి తెరతీశారు. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో కాకపోయినా గ్రేటర్‌లోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లలోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, ద్వితీయశ్రేణి నాయకుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మహిళలకు కుట్టు మెషిన్లు, కుక్కర్లు, యువతకు క్రికెట్ కిట్లు, జిమ్ పరికరాలు, టీషర్టులు, మందుబాబులకు చీర్స్ చెబుతూ మద్యం పంచేందుకు ప్రణాళికలు రూపొందించారు.
మరి కొద్ది గంటల్లో ఎన్నికలు
వృద్ధులు, కూలీల కు నగదు పంపిణీ, అవసరమైన వారికి పనులు చేస్తామంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓటరు స్లిప్పులతో పాటే ‘మీ ఓటుకు.. మా నోటు’ అంటూ నగదు పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ప్రాంతం, ఓటరు స్థాయిని బట్టి ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు పంచేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులు ఈ పనులు చేసేందుకు ఎక్కడకక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, వారికి ఇప్పటికే అధినేతలు, అభ్యర్థుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే వారి ప్రాంతంలోని పోలింగ్‌బూత్‌లు, ఓటర్ల సంఖ్యను బట్టి నగదు నిల్వలు అందినట్లు తెలుస్తోంది. ఇక పోల్ మేనేజ్‌మెంట్‌లో లిక్కర్ కిక్కుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నది మన నేతలకు తెలిసిందే. దీంతో అభ్యర్థులు ముందుజాగ్రత్తగా లిక్కర్‌ను పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు. ఐఎంఎల్ మద్యాన్ని పెద్ద ఎత్తున ఓటర్లకు పంపిణీ చేసేందుకు వేలాది కాటన్లను ఎక్కడికక్కడే నిల్వ చేశారు. నగరంలో మద్యాన్ని ఏరులుగా పారించేందుకు ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్నీ ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. ఇక కాలనీల్లో నేరుగా మద్యం పంపిణీ చేస్తే ఎవరూ స్వీకరించరనే కారణంతో ఆయా కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో మందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు.