చంద్రబాబు లెక్కంటీ..... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబు లెక్కంటీ.....

విజయవాడ, ఏప్రిల్ 30, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరి కొద్దిరోజుల సమయం ఉంది. అయితే ఈలోగా అధికార తెలుగుదేశం పార్టీలో కొంత అయోమయం నెలకొంది. ఖచ్చితంగా వెయ్యిశాతం అధికారంలోకి వస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్ల సిట్టింగ్ స్థానాలను కోల్పోవాల్సి వస్తుందని మంత్రులు అంటున్నారు. గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ ఇప్పుడు సీనియర్ నేతల్లో చర్చ జరుగుతుంది. ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకే దక్కుతుంది. ఒక వేళ దురదృష్టవశాత్తూ ఓటమి పాలయితే ఆ నెపం ఎవరిపై పడుతుంది? అన్న చర్చ పార్టీలో సీనియర్ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు.అయితే రాయలసీమకు చెందిన సీనియర్ మంత్రి అభిప్రాయం మేరకు గెలిచినా ఓడినా..ఆ ఫలితం చంద్రబాబు ఖాతాలో మాత్రమే పడుతుందని చెబుతుండటం విశేషం. ఈ సీనియర్ మంత్రి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీకి దిగలేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం మొత్తం తానే అంతా అయి వ్యవహరించారు. 


చంద్రబాబు లెక్కంటీ.....

గతంలో మాదిరిగా తెలుగుదేశం పార్టీకి ఎవరూ స్టార్ క్యాంపెయినర్లు లేరు. ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగడంతో చంద్రబాబు ఒక్కరే ప్రచారం మొత్తాన్ని నిర్వహించారు. ఈ సారి ప్రచారంలో సినీగ్లామర్ కూడా తెలుగుదేశం పార్టీలో పెద్దగా కన్పించలేదు.మొదట్నుంచి అనుకుంటున్నట్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నదివాస్తవం. ఈసారి ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు చంద్రబాబు బాగానే ఇచ్చారు. కొందరికి పోటీ చేసే స్థానాలు మార్చారు కాని టిక్కెట్లు ఇచ్చారు. తొలినుంచి చంద్రబాబు భయపడుతున్నది కూడా అదే. జేసీ దివాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు సయితం 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తేనే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఎప్పుడో చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టలేకపోయారు.కానీ ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చేసరికి చంద్రబాబుకు ఎమ్మెల్యేలపైనా, మంత్రులపైనా ఉన్న వ్యతిరేకత అర్థమయింది. అందుకోసమే తనను చూసి ఓట్లేయ్యాలని ప్రజలను పదే పదే అభ్యర్థించారు. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సభల్లోనూ, రోడ్ షోలలోనూ వంగి వంగి దండాలు పెట్టారు. దీంతో ఇప్పుడు తెలుగుతమ్ముళ్లు ఒకవేళ ఓడిపోయినా అది చంద్రబాబు సమర్థత కిందే లెక్కేసు కోవాలంటున్నారట. ఆ సీనియర్ మంత్రి కూడా ఇదే రకమైన వాదన కొందరు మీడియా మిత్రుల ముందు విన్పించడం విశేషం. ఓడిపోయినా చంద్రబాబు వల్లనే అనుకోవాల్సి ఉంటుందని మంత్రులు సయితం అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఏది జరిగినా ఆ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలో పడుతుందన్నది పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.