తప్పు ఒకరిది... శిక్ష మరొకరికి
హైద్రాబాద్, ఏప్రిల్ 25, (way2newstv.com)
తప్పెవరిది? శిక్ష ఎవరికి అంటే తెలంగాణ సర్కారు తెలివిగా కప్పి పుచ్చుతోంది. జరిగిన అన్యాయాన్ని రాజకీయం సాకుతో దాచిపెడుతోంది. ఇంటర్మీడియట్ అంటే కౌమారం వికసించే వయసు . పిల్లలు తీవ్రంగా స్పందించే దశ. అందుకే తల్లిదండ్రులు సైతం ఆ దశలో పిల్లల విద్యపై చాలా శ్రద్ధ పెడుతుంటారు. కానీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చేసిన పొరపాట్లు, నిర్లక్ష్యం, ఉదాసీనతకు రాష్ట్రమంతా భగ్గుమంటోంది. ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దోషులను శిక్షించడానికి బదులుగా వారిని రక్షించే విధంగా మంత్రులే ప్రకటనలు చేయడం అనుమానాలు రేకెత్తిస్తోంది. జరిగిన తప్పును దాచిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం ఆరోపణలకు తావిస్తోంది. నిలదీసేందుకు వచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థులపై నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం బాధ్యతాయుతమైన వైఖరిని కనబరచడం లేదు. ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యపై కార్పొరేట్ కళాశాలలు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. ర్యాంకుల తాపత్రయంలో విద్యార్థులను బలిపెడుతున్నాయి. ఇప్పుడు సాంతం బోర్డే తప్పుడు వాల్యుయేషన్ కి కారణమై వారి ప్రాణాలను బలిగొనడం విషాదకరం. 16 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా సాంకేతిక కమిటీల విచారణకే పరిమితం అవుతోంది.
ఇంటర్ బోర్డు వ్యవహారం..
నామమాత్రపు చర్యలతో సరిపుచ్చాలనుకుంటోంది సర్కారు. సమూలంగా బోర్డును ప్రక్షాళన చేసే దిశలో చర్యలకు పూనుకోవడం లేదు.రాజకీయ పెద్దల సిపారసులతో, బోర్డు అధికారుల అవినీతితో అనుభవం లేని సంస్థకు అత్యంత కీలకమైన బాధ్యత అప్పగించారనేది ఆరోపణ. విద్యార్థుల డేటా కాప్చరింగ్, ఎవాల్యుయేషన్ ప్రాసెసింగ్, మార్కుల టాబ్యులేషన్ వంటి బాధ్యతలను గ్లోబరినా టెక్నాలజీస్ అనే సంస్థకు అప్పగించారు. నిజానికి ఉపాధ్యాయులు సక్రమంగానే విద్యార్థుల ప్రతిభను అంచనా వేసినప్పటికీ ఆయా మార్కులను పద్ధతి ప్రకారం కంప్యూటర్ కు ఎక్కించే చోట తప్పు జరిగితే విద్యార్థి ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరే. మొదటి సంవత్సరం నూటికి 90కి పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు తాము అత్యంత ప్రతిభ కనబరిచే విషయాల్లోనే రెండో ఏడాది ఫెయిల్ అయినట్లుగా ఫలితాలొచ్చేశాయి. వేలాది విద్యార్థులపై ఈ ప్రభావం పడింది. కొందరు విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక ఊపిరి తీసుకున్నారు. ఇదంతా ఒక పార్శ్యం. అసలు తాము అనుసరించిన విధానంలో తప్పు ఉందని ఒప్పుకోవడానికే ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాంట్రాక్టు పొందిన సంస్థ పై వెంటనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అది కనీస ఉపశమన చర్యగా తల్లిదండ్రులు భావిస్తారు. గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి సంస్థలు బాధ్యతాయుతంగా ఇంటర్మీడియట్ కు సంబంధించిన సాంకేతిక బాధ్యతలు చూస్తుండేవి. దీనివల్ల తప్పులకు చాలా వరకూ ఆస్కారం ఉండేది కాదు. ఎటువంటి కారణం లేకుండా బోర్డు సీజీజీ ని పక్కనపెట్టడంతో మొదటికే మోసం వచ్చింది.తప్పులు జరిగాయా? లేదా అన్న అంశం పై నిర్ధారణ చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటినీ నియమించింది ప్రభుత్వం. అయితే ఈ కమిటీలో స్వచ్ఛంద విద్యావేత్తలు, పేరెంట్స్ కమిటీ నేతల కు చోటు కల్పించలేదనే విమర్శ వస్తోంది. ఎక్కడ లోపం జరిగింది? దానికి విద్యార్థులు ఎంతగా క్రుంగిపోతారనేది అంచనా వేయాలంటే అధ్యాపకులు, తల్లిదండ్రులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకర్నో, ఇద్దరినో మానవత్వంతో ఆలోచించేవారిని కూడా వేసి ఉండాల్సిందని ఉపాధ్యాయసంఘాలు చెబుతున్నాయి. కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఎవరో కొందరిపై చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈలోపు విద్యార్థులకు న్యాయం చేయడంపై ద్రుష్టి పెట్టాలి. టాబ్యులేషన్ లో జరిగిన లోపాలపై మరోసారి నిశితంగా పరిశీలించాలి. రీవాల్యుయేషన్ ఫీజులను రద్దు చేసి అడిగినవారికి చేసి పెట్టడం తప్పుకాదు. కోరినవారికి తమ తప్పులేమున్నాయో తెలుసుకునేందుకు పరీక్షల జిరాక్స్ ఆన్సర్ స్క్రిప్టులు ఇస్తే మంచిది. నిజానికి ఇంటర్మీడియట్ బోర్డు విశ్వసనీయత కోల్పోతోంది. దీనిని సరిదిద్దాలంటే విద్యార్థుల స్క్రిప్టులు తగిన మొత్తం వసూలు చేసి అందచేస్తే తప్పేమీ కాదు. దానివల్ల కొంత క్రెడిబిలిటీ పెరుగుతుంది. తీవ్రస్థాయి గందరగోళాలకు తెరపడుతుంది.గందరగోళంలో ప్రభుత్వానికి ఏమీ పాత్ర లేదనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. విశ్వవిద్యాలయాలు మాత్రమే స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తాయి. వాటి పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనల్లో లోపాలకు అవి బాధ్యత వహిస్తాయి. ఇంటర్మీడియట్ విద్య ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. బోర్డు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేత్రుత్వంలోనే ఉంటుంది. అందువల్ల ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కప్పిపుచ్చే కార్యక్రమాలు, కప్పదాట్ల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరే తప్ప కలిసొచ్చేదేమీ లేదు. ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులపై నిర్బంధాన్ని అమలు చేయడాన్ని రాజకీయ పార్టీలతోపాటు విద్యావేత్తలు తప్పు పడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ నుంచి బయటపడుతున్న దశలో చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అందువల్లనే ఫెయిల్ అయ్యామని తెలియగానే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. అసలే ఇంటర్మీడియట్ చదువు ఒత్తిడితో నలిగిపోతున్నారు చాలామంది విద్యార్థులు. రిజల్ట్స్ లో తేడా వస్తే జీవితం మలుపులో తీవ్రంగా మానసికంగా దెబ్బతింటారు. ఆ స్థితే ఆత్మహత్యలకు పురిగొలుపుతోంది. అందువల్ల ప్రభుత్వాలు కేవలం దీనిని ఒక ఆందోళనగా మాత్రమే చూడకుండా తీవ్రతను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటేనే మేలు జరుగుతుంది.