కాకినాడ, ఏప్రిల్ 25, (way2newstv.com)
ఒకపక్క వేసవి ఎండలు మండిపోతుంటే, మరోపక్క ఈదురు గాలులు గోదావరి జిల్లాలను హడలెత్తిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈదురు గాలులు, అక్కడక్కడా భారీ వర్షాలతో రైతాంగం బెంబేలెత్తిపోతోంది. ఈదురు గాలులకు పలుచోట్ల వరి పంట నేలనంటుతోంది. అలాగే మామిడి, జీడిమామిడి, మిర్చి, మొక్కజొన్న, అరటి, కోకో తదితర పంటలకు నష్టం వాటిల్లుతోందని రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఇక అక్కడక్కడా కురస్తున్న భారీ వర్షాలకు ధాన్యం తడిచిపోతోంది. రేయింబవళ్లు శ్రమించి సాగుచేసిన దాళ్వా పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
హడలెత్తిస్తున్న ఈదురు గాలులు
తూర్పు గోదావరి జిల్లాలో గత మూడు రోజులుగా చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో దాళ్వా పంట మాసూళ్ల దశలో ఉంది. కొన్ని చోట్ల పనలపై ఉండగా, మరికొన్ని చోట్ల ధాన్యం రాశులుగా ఉండటంతో అకాల వర్షాలకు తడిసిపోతోంది. ఈదురు గాలుల కారణంగా కోత దశలోని పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కోతలు పూర్తయి పనలపై ఉన్న పంట తడిస్తే గింజలు రాలిపోతాయని, ధాన్యం రంగు మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.కాగా ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈదురు గాలులకు తూర్పు గోదావరి జిల్లాలో గొల్లప్రోలు-పిఠాపురం వెళ్లే రహదారిపై బైపాస్ రోడ్డు సమీపంలో చెట్లుకూలి రహదారికి అడ్డంగా పడిపోవడంతో గంటల తరబడి ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి