విజయవాడ, ఏప్రిల్ 25, (way2newstv.com)
ఒకవైపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై విరుచుకుపడుతోంది. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలకు అధికారులు హాజరు కాకుండా ప్రధాన కార్యదర్శి నియంత్రించారనేది అభియోగం. సీఎం సమీక్షలు చేసి తమ అనుకూల కాంట్రాక్టర్లకు నిధుల విడుదల చేస్తారనేది వైసీపీ ఆరోపణ. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్టు అమల్లో ఉంది. అందువల్ల సీఎం ప్రభుత్వ సమీక్షలే వద్దని ప్రతిపక్షం డిమాండు చేసింది. కొంతమేరకు ఈ విషయంలో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యంత్రాంగాన్ని కట్టడి చేస్తున్నారనే వాదన వినవస్తోంది. దానికి ప్రభుత్వంలోని మిగిలిన ఉన్నతాధికారుల నుంచీ మద్దతు లభిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు కొన్ని అనుచిత నిర్ణయాలు తీసుకుంది. వాటన్నిటి లోగుట్టు ఇప్పుడు ప్రధాన కార్యదర్శి చేతిలోకి వచ్చింది. అందుకే అధికారయంత్రాంగాన్ని కాపాడుకునే క్రమంలో భాగంగానే ఆయన రాజకీయ కార్యనిర్వాహక వర్గమైన మంత్రిమండలి, ముఖ్యమంత్రిని దూరంగా పెట్టి లోతుగా విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. బడ్జెట్ పద్దును పక్కనపెట్టి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమవుతున్నాయి. భవిష్యత్తులో ఏదేని విచారణ జరిగితే అధికారులే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.నాలుగో విడత రైతు రుణమాఫీ నిధులు ఇచ్చేశాం. ఓట్లు వచ్చేస్తాయి. ఎన్నికల ఫలితాల లోపు అయిదో విడతతో పూర్తిగా మాఫీ చేసేస్తాం.’అంటూ సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు తెలుగుదేశం నాయకులు ప్రకటనలు గుప్పించారు. హడావిడి చేశారు. నిజానికి బ్యాంకుల్లో నిధులు జమ కాలేదు. నాలుగోవిడత కింద 3900 కోట్లు అవసరమైతే బయానా తరహాలో అయిదువందల కోట్లు మాత్రమే ప్రభుత్వం జమ చేసింది.
ఏపీలో నిలిచిపోయిన 15 వేల కోట్ల చెల్లింపులు
ఎన్నికల హడావిడిలో దీనినెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఉపశమన పత్రాలతో బ్యాంకులకు వెళ్లిన రైతులకు ప్రస్తుతం చుక్కెదురవుతోంది. 18 లక్షలమంది రైతులు ఈ విడత రుణమాఫీలో లబ్ధిదారులుగా ఉన్నారు. వారెవరికీ ప్రయోజనం లభించకపోవడంతో గందరగోళం మొదలైంది. నిజానికి సర్కారు రుణమాఫీకి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేసింది. కానీ బడ్జెట్ లో చూపని పథకాలకు నిధుల సర్దుబాటు కారణంగా రైతుల పద్దు పెండింగులో పడిపోయింది. ప్రధాన కార్యదర్శి ఆర్థికశాఖతో జరిపిన సమీక్షలో ఈవిషయం వెల్లడి కావడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. అన్నదాతా సుఖీభవ, పసుపు కుంకుమ, వృద్దాప్య పింఛన్ల మొత్తం పెంపుదల వంటి వాటికి బడ్జెట్ లో వెసులుబాటు లేదు. అయినా వాటికి డబ్బులొచ్చేశాయి. బడ్జెట్ లో చూపించిన రైతు ఖాతాకు మాత్రం నిధులు జమ కాలేదు. దీనికే సమాధానం వెదకాల్సి ఉంది.వివిధ పనులకు సంబంధించి దాదాపు 15వేల కోట్ల రూపాయల వరకూ ప్రభుత్వ చెల్లింపులు నిలిచిపోయాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ గడచిన ఆర్థిక సంవత్సరం చివరి లోపు చెల్లించాల్సిన మొత్తాలుగా పేర్కొంటున్నారు. ఎన్నికలకు అవసరమైన నిధులు సమకూర్చే క్రమంలో భాగంగా సాధారణంగా జరగాల్సిన చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు ఎలక్షన్ స్కీములపైనే పూర్తిగా ద్రుష్టి పెట్టింది. బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా కట్టు తప్పింది. ఇతర పనుల నిమిత్తం బడ్జెట్ లో పెట్టిన నిధులు సైతం దారి మళ్లించారు. అదే ఇప్పుడు అధికారుల తలకు చుట్టుకుంటోంది. ప్రధానంగా ఆర్థిక శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుంది. రైతు రుణమాఫీ వంటి పథకాలకు తక్షణం డబ్బులు సమకూర్చే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి జీఎస్టీ పద్దు కింద వచ్చిన సొమ్ములను కూడా వాడేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఖజానా మొత్తం వట్టిపోయి కనిపిస్తోంది. అత్యవసర చెల్లింపుల కింద మే ఒకటి నాటికి అయిదువేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా. అలాగే జీతభత్యాలు, ఖర్చులకు ఎనిమిదివేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. వీటిని సర్దుబాటు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగానే చెప్పాలి. నిజానికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మొత్తం వ్యవహారాలను సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.నిధుల కేటాయింపు, సర్దుబాట్లలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారవర్గాలు పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. ఈ అవకతవకల మొత్తం ఎంతమేరకు ఉంటుందనే అంచనా వేస్తున్నారు. పూర్తిగా నిబంధనల ఉల్లంఘన సాగినట్లు రుజువైతే ఆర్థికశాఖ అధికారులు భవిష్యత్తులో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రిమండలి ఆమోదంతోపాటు లిఖితపూర్వక ఆదేశాలు ఉంటే కొంతమేరకు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ నేతల మౌఖిక ఆదేశాలతో అమలు చేసి ఉంటే అధికారులే పూర్తిగా జవాబుదారీ అవుతారు. ప్రభుత్వ పెద్దల వద్ద మంచి మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అదే ఇప్పుడు కొంపలు ముంచేస్తుందేమోనని భయపడుతున్నారు. కేబినెట్ ఆమోదం ఉన్నప్పటికీ నిధుల వినియోగం విషయంలో బడ్జెట్ మద్దతు కూడా అవసరం. ఆర్థిక శాఖ అధికారులు నిదుల వినియోగంలోని అవకతవలపై తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా నమోదు చేయవచ్చు. అటువంటి అవకాశాలను వేటినీ వినియోగించుకోకుండా పెద్దలు చెప్పినదానికి తందానా అన్నట్లుగా వ్యవహరించిన అధికారులకు మాత్రం కొత్త ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి. అయితే పాత ప్రభుత్వమే తిరిగి ఎన్నికైతే అన్నీ సర్దుబాటు అయిపోతాయి. ఎన్నికల తొందరలో చేసిన పొరపాట్లను , అవకతవకలను దిద్దుబాటు చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది.