ఐపీఎల్ ను మించిపోయిన బెట్టింగ్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐపీఎల్ ను మించిపోయిన బెట్టింగ్స్

విజయవాడ, హైద్రాబాద్, ఏప్రిల్ 2 (way2newstv.com)
తెలుగు రాష్ట్రాల్లో బెటింగ్‌కి కేరాఫ్ అడ్రెస్ అవుతోంది హైదరాబాద్. మొదటి నుంచీ ఇక్కడ బెట్టింగ్స్ జరుగుతుండటం... పాత నేరస్థులు చాలా మంది బెట్టింగులకు పాల్పడటంతో... కొన్నేళ్లుగా పందేలకు ఈ నగరం కేంద్రం అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో్ టీఆర్ఎస్ గెలుస్తుందని ముందుగానే చాలా మంది ఊహించడంతో... పంటర్లకు పెద్దగా బెట్టింగ్ కలిసిరాలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం రంజుగా ఉన్నాయి. అటు అధికార టీడీపీ, ఇటు ప్రతిపక్ష వైసీపీ నువ్వా, నేనా అన్నట్లు తలపడుతున్నాయి. వాటికి మధ్యలో నేనూ పోటీలో ఉన్నానంటూ జనసేన దూకుతోంది. ఈ ట్రయాంగిల్ వార్‌ని క్యాష్ చేసుకుంటున్న పంటర్లు... పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో, మొబైల్ ఫోన్లతో... కోడ్ భాషలో ఈ పందేలు జోరుగా సాగుతున్నాయిఒకప్పుడు బెట్టింగ్ అనేది వందలు, వేలల్లో సాగేది. ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్లు... చిన్న పందేలు కాయట్లేదు. రూ.3 లక్షల నుంచి బెట్టింగ్‌ ప్రారంభమవుతోంది. వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ లాంటి నగరాల్లో లక్ష నుంచి మొదలవుతోంది. సీటును బట్టీ రేటు మారుతోంది. కొన్ని స్థానాల్లో ఫలానా అభ్యర్థి గెలిస్తే రూ.లక్ష ఇస్తామని, ఓడితే రూ.3 లక్షలు తీసుకుంటామని డీల్ కుదుర్చుకుంటున్నారు.ఏపీలో మంగళగిరి, గుడివాడ, నగరి, గాజువాక, భీమవరం, సత్తెనపల్లి, హిందుపురం, పులివెందుల, కుప్పం, భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నర్సాపురం, కడప పార్లమెంట్‌ స్థానాల గెలుపోటముపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. 


 ఐపీఎల్ ను మించిపోయిన బెట్టింగ్స్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌, బాలకృష్ణ మెజారిటీలపై కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారు.ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారన్న అంశంపై బుకీలలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమంది వైసీపీ వస్తుందని అంటున్నారు. మరికొంత మంది టీడీపీకి మొగ్గు చూపుతున్నారు. కొందరరు పంటర్లు మాత్రం ఏ పార్టీకీ మెజార్టీ రాదనీ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరివైపు ఉంటారన్నదానిపై అధికారం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా పందేలు నిర్వహిస్తున్నారని తెలిసింది.ఆరు నెలల కిందటి వరకూ... ప్రజలు వైసీపీకి మొగ్గు చూపారనీ... పాదయాత్రల వల్ల వైసీపీకి ఎక్కువ క్రేజ్ పెరిగిందనీ పంటర్లు అభిప్రాయపడుతున్నారు. ఐతే... టీడీపీ ఆరు నెలల కిందట ప్రకటించిన పసుపు కుంకుమ, డ్వాక్రా రుణాలు, నిరుద్యోగ భృతి, పింఛన్లు, అన్నదాత సుఖీభవ వంటి స్కీములు... ప్రజల్లో టీడీపీ పట్ల సానుకూల భావన ఏర్పరిచాయని పంటర్లు చెబుతున్నారు. అలాగని పూర్తిగా టీడీపీకి తిరిగి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని అంటున్నారు. ఇలా స్పష్టమైన అభిప్రాయం పంటర్ల నుంచీ వ్యక్తం కావట్లేదు.జనసేన అధినేత పవన్ కల్యాణ్... గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచీ పోటీ చేస్తున్నారు. ఈ విషయంలో కుకీలకు ఓ స్పష్టత ఉంది. పవన్ గాజువాకలో గెలుస్తారనీ, భీమవరంలో ఓడిపోతారనీ అంచనాకొస్తున్నారు. అందుకు తగినట్లుగా పందేలు కాస్తున్నారు.తెలంగాణలోని సికింద్రాబాద్‌ చేవెళ్ల (కొండా విశ్వేశ్వర్‌రెడ్డి), ఖమ్మం (టీఆర్‌ఎస్ - నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ - రేణుకాచౌదరి) నల్గొండ (ఉత్తమ్‌కుమార్‌రెడ్డి), మల్కాజిగిరి (రేవంత్‌రెడ్డి), మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానాలపై బెట్టింగ్‌ రాయుళ్లు ఎక్కువ పందేలు కాస్తున్నారు. ఇక్కడ కూడా లక్షల్లో పందేలు నడుస్తున్నాయి.సహజంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎక్కువ పందేలు కాస్తారు. అలాంటిది ఈసారి ఆ మ్యాచ్‌ల కంటే ఎన్నికల పైనే ఎక్కువ పందేలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న పంటర్లు... ఆ దిశగా ఎక్కువ పందేలు నిర్వహించట్లేదు. ఏపీ రాజకీయాల చుట్టూ పందేలు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులతో... పందేల రేట్లు కూడా మారుతున్నాయి.