కరీంనగర్, ఏప్రిల్ 10, (way2newstv.com)
తెలంగాణలో తెగించి కొట్లాడిన యువతలో అసంతృప్తి జ్వాలలు మెల్లగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం పూట కోచింగ్ సెంటర్లకు శిక్షణ నిమిత్తం వచ్చిన వేలాది మంది యువతతో నిండిపోతున్న బస్టాండు ప్రాంతం నిరుద్యోగ సమస్యను ఎత్తిచూపుతున్నది. వేములవాడ రాజన్న సన్నిధిలో గతంతో పోల్చి చూసుకుంటే నీటి కొరత సమస్య కొంత తగ్గినప్పటికీ ప్రజల ఇక్కట్లు మాత్రం పూర్తిస్థాయిలో తొలగిపోలేదు. చాలా కాలనీల్లో రెండు మూడు రోజులకోసారి నీళ్లు వస్తున్న పరిస్థితి ఉంది. వేములవాడలో ఆకాశ గంగ పథకం కింద ఇంటి పై నుంచి పైపులు వేసి నీళ్లను సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెగ్యులర్‌గా నీళ్లు వస్తున్నప్పటికీ కొన్ని కాలనీల్లో ఆకాశ గంగ పైపు లైను ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నీళ్లు రాకపోవడంతో ఇండ్ల ముందు పెట్టుకున్న డ్రమ్ములను మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నింపుతున్నారు. వేములవాడలోని మూలవాగు 20 ఏండ్లుగా ఒట్టిపోయిందని స్థానికుడు తెలిపాడు. మరోవైపు రాజన్న గుడి అభివృద్ధి పేరుతో 35 ఎకరాల చెరువును పూడ్చేశారు. దీంతో పట్టణంలో భూగర్భజలాలు పూర్తిగా పడిపోయాయి. భగీరథ పథకం మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా పైపులు కూడా వేయని పరిస్థితి. బస్టాండు, రోడ్ల పక్కల భగీరథ మెయిన్ పైపులు దర్శనమిస్తున్నాయి. దీంతో వేములవాడకు భగీరథ నీళ్ల అందేందుకు మరో రెండు, మూడేండ్లు పట్టే అవకాశముంది. వేములవాడ రాజన్న ఆలయానికి ప్రతి ఏటా రూ.100 కోట్లను ఇస్తామని, యాదాద్రి స్థాయిలో అభివృద్ధి చేస్తామని సీఎం పదే పదే చెబుతున్నప్పటికీ అరకొర నిధులే అందుతున్న పరిస్థితి ఉంది'నాలుగేండ్ల నుంచి కోచింగ్ సెంటర్ల చుట్టు తిరుగుతున్నం.
కరీంనగరంలో కనిపించని స్మార్ట్
ఏం సక్కదనం. నోటిఫికేషన్లే లేకపాయే. ఉద్యోగాలు రాకపాయే. ఒక్కసారి ఓడగొడితే బుద్ధి వస్తుంది' అని వేములవాడకు చెందిన ఎంబీఏ పూర్తిచేసిన మనోజ్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. కరీంనగర్‌కు వచ్చిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తరలించడంపైనా, చొప్పదండికి కేటాయించిన లెదర్ పార్కును సిరిసిల్లకు తరలించడంపైనా యువత ఆగ్రహంగా ఉన్నది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించింది. కరీంనగర్ సిటీ శివారు కాలనీల్లో ప్రత్యేకత ఏమీ కనిపించడంలేదు. శివారు కాలనీల్లో రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయి. గుంతలల్లో కనీసం మట్టిని కూడా పోయించలేని స్థితిలో కరీంనగర్ నగర పాలక మండలి ఉన్నది. బైపాస్ రోడ్డుని ఆనుకుని ఉన్న హౌజింగ్ బోర్డు కాలనీలో బైకుపై కనీసం 20 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్లలేని పరిస్థితి ఉందంటే గుంతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హౌజింగ్ బోర్డు కాలనీ పార్కు చూద్దామన్న గడ్డి కనిపించని పరిస్థితి. నగరంలోని చాలా పార్కుల్లో ఇదే పరిస్థితి. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ అలాట్మెంట్ మార్చడంతో భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. గతంలో ప్రతిపాదిత రైల్వే లైను ప్రాంతంలో ఎంపీ వినోద్‌కుమార్, ఆయన బంధువులకు సంబంధించిన భూముల నుంచి వెళ్లిందని, వారి భూములు పోతాయని అలాట్మెంట్ మార్చారని మిడ్‌మానేరు ముంపు బాధితులు వాపోతున్నారు. మిడ్‌మానేరు కోసం గతంలోనే భూమి ఇచ్చి సర్వం కోల్పోయామని, మళ్లీ తమ భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు తేల్చి చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లక్షకుపైగా జనాభా ఉండగా అందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సగం మందికి పవర్‌లూమ్, బీడీ పరిశ్రమలే ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ రెండు రంగాలు బాగుంటేనే వ్యాపారాలు బాగా సాగుతాయి. అలాంటి సిరిసిల్లలో పవర్‌లూమ్ కార్మికులు బతుకులు ధైన్యంగా ఉన్నాయి. బతుకమ్మ చీరల ఆర్డర్ వచ్చిన తర్వాత కొంత ఉపాధి దొరుకుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ...8 నెలలు వారికి సరిగ్గా పని దొరకని పరిస్థితి. బతుకమ్మ చీరల ఆర్డర్ ఉన్నప్పుడు ఒక్కో కార్మికునికి 14 నుంచి 16 వేల వరకు జీతం లభిస్తున్నది. మిగతా నెలల్లో నెలకు కనీసం పది వేల కూడా దక్కని దుస్థితి. టెక్స్‌టైల్ పార్కులో పనిచేసే కార్మికుల జీతమైతే ఎనిమిది వేల లోపే ఉన్నది. దీంతో చేనేత కార్మికుల కుటుంబాలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. దీంతో పవర్ లూమ్ కార్మికుల కుటుంబాల్లోని మహిళలు బీడీలు చుడుతున్నారు. సిరిసిల్ల పట్టణంలో దాదాపు 25వేల మంది వరకు బీడీలు చుట్టేవారున్నారు. రోజంతా నడుములన్నీ గుంజంగా, రెప్పవాల్చకుండా వారు పొద్దస్తమానం వెయ్యి బీడీలు చుడితే దక్కేది రూ.160 మాత్రమే. ఆ పనీ నెలలో దక్కేది 10 నుంచి 15 రోజులే. నెలలో గరిష్టంగా పనిదొరికితే ఒక్కో మహిళలకు దక్కేది 1800 రూపాయలే. ఇదీ బీడీ కార్మికుల దుస్థితి. సిరిసిల్ల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో భగీరథ పైపులైన్లు వేసినప్పటికీ అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నీరు రావడంలేదు. సిరిసిల్ల పట్టణంలో భగీరథ పైపులైన్ల కోసం రోడ్లను తవ్వారు. ఆ తర్వాత వాటిని సరిచేయలేదు. దీంతో రెండేండ్లుగా ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.