అదిలాబాద్, ఏప్రిల్ 10, (way2newstv.com)
అదిలాబాద్ జిల్లాను పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు. ఎన్నికల సమయంలో స్వరాష్ట్రంలోనే మనమే ఈ సీసీఐని తెరిపించుకుందామని అధికారంలోకి వచ్చిన గులాబీ అధినేత ఆ ఊసే మరిచిపోయారు. ఇక్కడి కార్మికులు ఇంకా చీకట్లోనే బతుకీడుస్తున్నారు. ఈ ఐదేండ్లలో మిల్లును తెరిపించేందుకు కొంత ప్రయత్నాలు చేసినా అది కేంద్రాన్ని కదిలించలేకపోయింది. తనను ఎంపీగా గెలిపిస్తే సిమెంట్ పరిశ్రమను పున:ప్రారంభిస్తామని నగేష్ ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు సిర్పూర్ కాగజ్‌నగర్ సమీపంలోని వేంపల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కలగానే మారాయి. వేంపల్లి వద్ద పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆ ఊసే లేదు. ఫలితంగా క్రాంతినగర్, భాగ్యనగర్, ఒడ్డెరకాలనీ, మహాలక్ష్మివాడ, తాటిగూడ, తిలక్‌నగర్, ఖుర్షిద్‌నగర్, సుందరయ్యనగర్ కాలనీలతో పాటు భీంసరి గ్రామస్తులు ఈ రోడ్డు గుండా రావాలంటే గేటు వద్ద నిరీక్షించాల్సి వస్తోంది.
ఎవ్వరికి పట్టని అదిలాబాద్
బ్రిడ్జి స్థలం ఎంపికలోనే రోజులు గడిపోగా నిర్మాణ అంచనా వ్యయం రూ.700కోట్లు అవుతుందనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుందనీ ప్రకటించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు పోటీ పడి ప్రచారం చేశారే తప్ప ఆచరణలో మాత్రం శూన్యమే మిగిలింది 'ఆదిలాబాద్- ఆర్మూర్' రైల్వే లైన్ కలగానే మిగిలి పోయింది. ఈ లైన్ పనులపై ప్రభుత్వాలు ఆశలు కల్పించడం, మరిచిపోవడం పరిపాటిగా మారింది. గతేడాది బడ్జెట్‌లోనే నిధులు కేటాయించారనీ, త్వరలోనే రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయనీ ఎంపీగా గొడెం నగేష్ గతంలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. లైన్ నిర్మాణానికి రూ.2730 కోట్లు ఖర్చు అవుతాయనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరోసగం వాటా కింద భరించాల్సి ఉంటుందనీ తెలిపారు. అది ఇసుమంతైనా కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో స్థలాన్ని సైతం గుర్తించింది. ఇంతలో రాష్ట్ర ఏర్పాటు, కొత్త ప్రభుత్వం కొలువుదీరడం జరిగిపోయింది. కుమ్రంభీం వర్ధంతి సందర్భంగా జోడేఘాట్ వేదికగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని నేతలు వల్లేవేయగా దాన్ని ములుగు జిల్లాకు తరలించారు. ఈ విషయంలో స్థానిక నేతలు చేష్టలుడిగి చూశారని అపవాదు మూటగట్టుకున్నారు. ఎంపీ నగేష్ ప్రభుత్వంపై కనీస ఒత్తిడి తీసుకురాలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు.