బెంగళూర్, ఏప్రిల్ 5 (way2newstv.com)
కర్ణాటకలో మాండ్య నియోజకవర్గం చరిత్ర తెలిసిన వారెవరైనా ఇది డేంజర్ జోన్ అని చెప్పలగలరు. ఇక్కడ ప్రజలు ఎంత ప్రేమిస్తారో? వారికి కోపం వస్తే అంత ధ్వేషిస్తారన్న దానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. మాండ్య పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపోటములు ఎవరి వైపు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. 1951లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో అన్నదాతలే అధికంగా ఉంటారు. వారిదే ఇక్కడ ఆధిపత్యం. ఇప్పుడు కర్ణాటకలో మాండ్య నియోజకవర్గం దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం సినీనటి, అంబరీష్ భార్య సుమలత, దేవెగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేయడమే కారణం.మాండ్య నియోజకవర్గం చూడటానికి ప్రశాంతంగానే కన్పిస్తుంది. కావేరీ నదీ జలాల రాకతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. అత్యంత ధనిక రైతులుండే ప్రాంతమిది.
మాండ్య... డేంజర్ జోనా...
అందుకే ఇక్కడ రిజల్ట్ ఒక పట్టాన ఎవరికీ చిక్కదంటారు. సినీనటి రమ్య 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినప్పటికీ ఆ తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడించడమే ఇందుకు నిదర్శనం. రైతు నేతగా పేరొందిన పుట్టణయ్య మరణించిన తర్వాత ఆయన కుమారుడిని ఇక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. సెంటిమెంట్లు ఇక్కడ తక్కువగానే పనిచేస్తాయనడానికి ఇదే ఉదాహరణగా చెబుతారు.ఇప్పుడు పోటీ చేస్తున్న సుమలత కూడా సెంటిమెంట్ తోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంబరీష్ రెండుసార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే అంబరీష్ పట్ల ఇక్కడ ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉన్నాయంటారు. అందుకోసమే మాండ్య కోసం పట్టుబట్టి మరీ సుమలత పోటీ చేస్తున్నారు. సుమలతకు భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించడంతో ఆమెకు విజయావకాశాలు పెరిగాయంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు సయితం సుమలతకే జై కొడుతున్నారు. తాజాగా మైసూరు మహారాజా యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్ కూడా సుమలత గెలవాలని కోరుకోవడంతో మరింత ఊపు వచ్చిందనే చెప్పాలి.ఇక ఇక్కడ బరిలో ఉన్న దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడ చెమటోడుస్తున్నారు. తండ్రి అధికారంలో ఉండటం, మాండ్య పార్లమెంటు పరిధిలోని ఎక్కువ అసెంబ్లీ స్థానాలను జనతాదళ్ ఎస్ చేతిలోనే ఉండటంతో తన గెలుపు సులువని అనుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కుమారస్వామి సయితం మాండ్యపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నారు. దేవెగౌడ మనవడి రాజకీయ అరంగేట్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ మాండ్య ప్రజలను తక్కువ అంచనా వేయలేం. దీనిని పొలిటికల్ నిపుణులు డేంజర్ జోన్ గా అభివర్ణిస్తారు. మరి చివరకు విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.