మహబూబ్ నగర్, ఏప్రిల్ 03 (way2newstv.com):
గ్రామీణ ప్రాంతాల్లో వారికి నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో దివ్యాంగులకు పని కల్పించాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరికీ 150 రోజుల పని దినాలు కల్పించాలనే లక్ష్యం ఉన్నా 2018-19 ఆర్థిక సంవత్సరంలో వారికి పెద్దగా అవకాశం కల్పించలేదు. ఉపాధి హామీ పనుల్లో ముళ్లపొదల తొలగింపు, మొక్కలకు రక్షణ కంచెల ఏర్పాటు, చిన్న గుంతలు తీయడం వంటి సులువైన పనులను దివ్యాంగులకు కల్పించాల్సి ఉంటుంది. సాధారణ కూలీలకు 100 పనులు కల్పిస్తుండగా, వీరికి 150 రోజుల పనిదినాలు కల్పిస్తారు. ఇలా పని కల్పించేందుకు జోగులాంబ గద్వాల జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో 3,552 మంది దివ్యాంగులను అధికారులు గుర్తించారు.
ఉపాధికి మంగళం.. (మహబూబ్ నగర్)
వీరందరికీ ఉపాధి హామీ జాబ్‌కార్డులు అందించారు. దివ్యాంగులతో ప్రత్యేకంగా 118 దివ్యాంగుల శ్రమశక్తి సంఘాలు(వీఎస్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 100 రోజుల పనిదినాలు 32 మందికి కల్పించారు. నిబంధనల మేరకు 150 రోజుల పని ఇద్దరికి మాత్రమే కల్పించారు. 100 రోజుల పనులుచేసినవారు కూడా ఒక్కో మండలంలో 7 మందికి మించలేదు. ఇటిక్యాల మండలంలో ఒక్కరు కూడా 100 రోజుల పనులు చేయకపోవటం ఉపాధి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దివ్యాంగులు ఉన్నచోట వారు చేసే పనులు గుర్తించడం లేదు. ఫలితంగా వారికి పనులు లేకుండా పోతున్నాయి. కుటుంబాలను పోషించుకునేందుకు పనులు కల్పించాలని దివ్యాంగులు ప్రజావాణికి వెళ్లి అధికారుల ముందు తమ గోడును వెళ్లబోసుకుంటున్నా పెద్దగా స్పందన ఉండకపోవటం వారిని ఆవేదనకు గురిచేస్తోంది.