ప్రకృతి కన్నెర్ర (నెల్లూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకృతి కన్నెర్ర (నెల్లూరు)

నెల్లూరు, ఏప్రిల్ 30 (way2newstv.com): 
జిల్లాలో పచ్చదనం మచ్చుకైనా కనిపించడం లేదు. ముఖ్యంగా గత దశాబ్దం కాలంగా జిల్లా పరిస్థితే మారిపోయింది. అంతకుముందు పచ్చని పంట పొలాలు, ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు, రోడ్లకు ఇరువైపులా భారీ చెట్లు పచ్చదనానికి మారుపేరుగా ఉండేవి. ఇందుకూరుపేట తదితర ప్రాంతాలైతే కోనసీమను తలపించేవి. అభివృద్ధి పేరుతో వివిధ పరిశ్రమలు, కాలుష్యకారక సంస్థలు జిల్లాలో వందలకొద్దీ ఏర్పాటయ్యాయి. దానికితోడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పచ్చని పొలాలను ప్లాట్లుగా మార్చేశారు. సాధారణ, ఉద్యాన పంట పొలాలనూ ఎడారుల్లా మార్చేశారు. తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, గూడూరు, చిల్లకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ మండలాలతో పాటు కోవూరు, కొడవలూరు, దగదర్తి, కావలి ప్రాంతాల్లోనూ అనేక పరిశ్రమలు, సంస్థలను ఏర్పాటు చేశారు. లక్షలాది ఎకరాలను వారికి కట్టబెట్టారు. వాటిల్లో 50 శాతాన్ని వినియోగిస్తే.. మిగతా సగ భాగం భూమిని ఎడారిగా పెట్టేశారు. జిల్లాలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే.. వర్షాభావం కారణంగా జిల్లాలో చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల్లో నీటి కొరత ఏర్పడింది. దాంతో పంటలు కూడా సక్రమంగా పండని పరిస్థితి.. వర్షాలు లేని కారణంగానే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దాంతో సీతారామపురం, దుత్తలూరు, మర్రిపాడు, ఉదయగిరి మండలాలతోపాటు ఆత్మకూరు వంటి పట్టణాల నుంచి ఇతర జిల్లాలు, ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. ఉపాధి కోసం ఊళ్లకు ఊళ్లే వదిలేసి జనం వేరే ప్రాంతాలకు వెళుతున్నారు.


 ప్రకృతి కన్నెర్ర (నెల్లూరు)

జిల్లాలో 1800కు పైగా చిన్నా, పెద్ద చెరువులున్నాయి. వాటిలో చాలా వరకు ఆక్రమణల పాలుకాగా.. మరికొన్ని శ్రద్ధ కనబర్చకపోవడంతో పూడుకుపోయాయి. ఇంకొన్ని మాత్రం నీరు-చెట్టు పనుల్లో భాగంగా మెరుగుపడ్డాయి. ఇంత జరిగినా.. జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా ఆ చెరువులు, ఉన్న కాలువల్లో నీరులేక ఎండిపోయాయి. అంతేకాకుండా జిల్లాలోని పెన్నానది, స్వర్ణముఖి వంటి నదులు పూర్తిగా ఎండిపోయాయి. అందువల్ల జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల స్థాయి తీవ్రంగా పడిపోయింది. ఎన్నడూ లేనివిధంగా 11.70 అడుగుల మేర భూగర్భ నీటి మట్టం పడిపోయింది. గతంలో ఓ సారి 8 అడుగులకు నీటిమట్టం పడిపోతే.. ఈసారి 11.70 అడుగులకు ఇది చేరడం ఆందోళన పరిచేదే.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 180 బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. చెరువులు, నీటి గుంటల్లో నీరు పూర్తిగా ఇంకిపోతున్నాయి. వింజమూరు, సీతారామపురం దొరవారిసత్రం తదితర మండలాల్లో బావులు కూడా పూర్తిగా ఎండిపోతున్నాయని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సమాచారం అందింది.
జనవరి నుంచే అనేక గ్రామాలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిపై ఆధారపడి ఉన్నాయి. గత మూడు సంవత్సరాల నుంచి ఒక వైపు కరవు వెంటాడుతుంటే.. మరో వైపు తాగేందుకు కూడా పూర్తి స్థాయిలో నీరు లేని పరిస్థితులు ఇంకో వైపు తరుముకొస్తున్నాయి. పశువులు, ఇతర జీవాలకు కూడా నీరు లేక అలమటిస్తున్నాయి. వీటి నీటి అవసరాలకు దాదాపు నాలుగు మండలాల పరిధిలోని 27 ఆవాసాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా పంపుతున్నారు. దీంతో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు వెంటనే ఆ వరుణ దేవుడు కనికరించి వర్షాలు కురిపించక పోతే జిల్లా పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో చెప్పలేని దుస్థితి నెలకొంది. మనుబోలులో 28.50, వింజమూరు 24.97, వరికుంటపాడులో 24.20, ఉదయగిరిలో 17.91 మీటర్ల నీరు లోతుకు నీరు చేరింది. ఈ ఏడాది జిల్లాలో మార్చి మాసానికే 1012.9 ఎం.ఎం. సాధారణ వర్షపాతం నమోదు కావాలి. కాని కేవలం 469.1 ఎం.ఎం.మాత్రమే నమోదు అయింది. దాదాపు 54.14 శాతం తక్కువ వర్షపాతం మన జిల్లాలో నమోదైంది. ఇకనైనా అధికారులు స్పందించి జలవనరులను కాపాడుకునేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో కొన్నేళ్లుగా అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. రెండు దశాబ్దాలకు ముందు జిల్లాలో అడవుల శాతం 20 వరకు ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 33 శాతం పచ్చదనం ఉండేలా అందరూ శ్రద్ధ వహిస్తే చాలు ఆ పచ్చదనమే ఆనందదాయకంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చని ప్రకృతి కళకళలాడాలంటే గాలి, నీరు, భూమి ఈ మూడూ సమృద్ధిగా ఉండాలి. అందుకు మొక్కలు నాటాలి. కాలుష్యం తగ్గాలి. జిల్లా వాతావరణం మరికొన్ని డిగ్రీల సెల్షియస్‌ పెరిగితే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. పర్యావరణం మెరుగయ్యేలా పచ్చదనాన్ని పెంపొందించడం, జలవనరులను పరిరక్షించడం, కాలుష్యాన్ని అరికట్టడం వంటివి అందరూ విధిగా పాటిస్తేనే మేలు. సంప్రదాయ వనరులను పరిమితంగా వినియోగించడం అవసరం.