కరీంనగర్, ఏప్రిల్ 30 (way2newstv.com):
ఈ వేసవిలోనూ జిల్లావాసులకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఎండలు ముదురుతున్న కొద్దీ భూగర్భ జలాలు అడుగంటిపోతున్న క్రమంలో.. బోరు బావుల్లో నీరు అడుగంటుతోంది. ఈ క్రమంలో ప్రజలు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటిపైనే ఆధారపడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా మార్చి 31లోగా అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా కొన్ని గ్రామాల్లో కొత్తగా నిర్మించే ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదు. పలు ప్రాంతాల్లో పైపులైను పనులు, ఇంటర్ కనెక్షన్ల పనులు చేయాల్సి ఉంది. దీంతో పలు చోట్ల పాత పద్ధతి ద్వారానే నీరివ్వాలని నిర్ణయించారు. కానీ జిల్లాలోని పలు గ్రామాల్లో వారం రోజులుగా ఎత్తు ప్రదేశాలకు తాగునీరు అందడం లేదని, కొద్దిపాటి నీటితో అవసరాలు తీరడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఏటా వేసవిలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యల కోసం ప్రణాళికలు తయారు చేసే అధికారులు ఇప్పటివరకు అలాంటి ప్రణాళికల ఊసే ఎత్తడం లేదు.జిల్లాలో మిషన్ భగీరథ తాగునీటిని పైపులైన్ల ద్వారా 80 శాతం సరఫరా చేస్తున్నప్పటికీ గ్రామాల్లోని ఎత్తు ప్రాంతాలకు తక్కువ నీరు రావడంతో నీరు సరిపోవడం లేదు. పైపులైన్ల లీకేజీలు, ఇతర సమస్యల కారణంగా ట్యాంకుల్లోకి పూర్తిగా నీరు వెళ్లడం లేదు.
దాహం తీర్చని భగీరథ(కరీంనగర్)
కింది ప్రాంతాలకు మాత్రం ఒకేరోజు రెండుసార్లు ట్యాంకులు నిండి పూర్తి స్థాయిలో నీరు అందుతోంది. ఎతైన ప్రాంతాల విషయంలో ముందస్తు చర్యలు లేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం పూర్తికాకపోవడంతో పాత ట్యాంకులకే నీరందించి సరఫరా చేస్తున్నా అవసరాలు తీరడం లేదు. అలాగే పైపులైన్ల నిర్మాణ పనులూ గ్రామాల్లో పూర్తికాక వేసవిలో తాగునీటికి తహతహలాడాల్సి వస్తోంది.మార్చి నాటికి ట్యాంకుల నిర్మాణం పూర్తిచేసి ఇంటింటా తాగునీరు అందించాలని సీఎం కేసీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పనుల వేగం పెంచే విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు.. అయినప్పటికీ ఇంకా 20 శాతం ట్యాంకుల పనులు కావాల్సి ఉంది. ఈ ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తయితేనే కొత్త ప్రాంతాలకు కొత్త కనెక్షన్ల ద్వారా నీరందించే అవకాశం ఉంటుంది. మే నెలాఖరు వరకు పూర్తి చేయించాలని అధికారులు భావిస్తున్నప్పటికీ మండుతున్న ఎండలతో పనులు సకాలంలో పూర్తయ్యేలా లేవు. గ్రామీణ నీటి సరఫరా విభాగం పనిచేసిన సమయంలో ఏటా వేసవిలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించే వారు. దీంతో ట్యాంకర్ల ద్వారా, దూర ప్రాంతాల నుంచి పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసే వారు. గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని మిషన్ భగీరథలో విలీనం చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఏ ప్రాంతంలో తాగునీటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగానే వేసవిలో ప్రత్యేక ప్రణాళికలు విధానాన్ని ప్రవేశపెట్టవద్దని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈసారి ఆ దిశగా కార్యాచరణ చేపట్టలేదు. కొన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరందక, ప్రత్యామ్నాయ చర్యలు లేక ప్రజలు అవస్థలు పడుతూ.. ఖాళీ బిందెలతో ఆందోళన చెందుతున్నారు