కొవ్వూరు, ఏప్రిల్ 30 (way2newstv.com):
ఎప్పుడూ నిండుకుండగా జలజలపారే గోదారమ్మ బక్కచిక్కిపోయింది. నదీగర్భంగా నీటిబొట్టులేని దుస్థితిని ఎదుర్కొంటోంది. ఇలాంచి పరిస్థితి రావడం నదీ ప్రస్థానంలో ఇదే మొదటిసారి అని పెద్దలు చెబుతున్నారు. భద్రాచలంలో అయితే తాగునీటి పంపులకు కూడా నీరు అందని పరిస్థితి ఏర్పడింది. అక్కడ నది ప్రవాహానికి అడ్డుకట్ట వేసి పట్టణానికి తాగునీరు అందిస్తున్నారు. ఈ ఏడాది నదిలో నీరు అడుగంటిపోవడం వెనుక కారణాలు అనేకం. ఆగస్టు తర్వాత పెద్దగా వర్షాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం నదిపై పలుచోట్ల ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి నీటి సరఫరాకు అడ్డుకట్టలు వేసి నీటిని నిల్వ చేస్తోంది. ఈ ప్రభావంతో నదిలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది.
బక్కచిక్కిన గోదారమ్మ(పశ్చిమగోదావరి)
గోదావరి డెల్టాలో రబీ పంటను కాపాడేది సీలేరు నీరే. ఈ నది నుంచి రబీ సీజనులో 5,727 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుంటుంది. సీలేరు, శబరి కలయికతో గోదావరి డెల్టాను కాపాడుకోగలుగుతున్నారు. ఆ రెండు ఉపనదులు లేకుంటే గోదావరి నీరు పంటలను కాపాడే పరిస్థితి లేదు. జులై నుంచి డిసెంబరు వరకూ ఉద్ధృతంగా ప్రవహించే నది జనవరి నుంచి నెమ్మదిస్తుంది. ఇక మే నెల వస్తే మరింత ఘోరం. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నది పూర్తిగా ఎండిపోయింది. పశ్చిమ గోదావరిలో అత్యధిక గ్రామాలకు తాగునీరుగా గోదావరి జలాలే అందిస్తున్నారు. పశ్చిమ జనాభా సుమారు 40 లక్షలు. ఒక్కో మనిషికి రోజుకు సగటున 40 లీటర్లు నీటిని లెక్కిస్తే 1.60 కోట్ల లీటర్ల నీరు అవసరం అవుతుంది. కొండల్లోంచి, కోనల్లోంచి జాలువారుతున్న గోదావరి జలం నిజంగా దివ్యామృతమే. దీని ఉదజని సూచిక 6.5 నుంచి 9.2 మధ్య ఉంటుంది. ఏ విధమైన బ్యాక్టీరియా ఉండదు. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సోడియం, క్లోరైడ్, కార్బోనేట్లు, పాస్పెట్లు తగు పరిమాణంలో ఉంటాయి. ఈ నీటిని శుద్ద్ధి చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన అన్ని సుగుణాలు లభిస్తాయి.గోదావరి నీటిమట్టం కేవలం రెండు నెలల వ్యవధిలోనే పడిపోయింది. ఫిబ్రవరి నెలలో నీటిమట్టం సాధారణంగా ఉంది. కుక్కునూరు మండలం వేలేరు వద్ద ఫిబ్రవరి 3న ముగ్గురు యువకులు నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. వారి ఆచూకీ తెలుసుకోవటం చాలా కష్టమైంది. నదిలో అత్యధిక లోతు ఉండటంతో దాదాపు మూడు రోజులు పాటు గాలిస్తే గానీ మృతదేహాలు దొరకలేదు. ఆ స్థాయిలో ప్రవహించిన నది, కేవలం రెండు నెలల వ్యవధిలో రెండు మూడు అడుగుల లోతుకు మాత్రమే పరిమితమైంది.