సోలో బ్రతుకే సో బెటర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సోలో బ్రతుకే సో బెటర్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30, (way2newstv.com)
భారత రాజకీయాల్లో బ్రహ్మచారుల సంఖ్య పెరిగిపోతోంది. బ్రహ్మచార పురుషులు, మహిళలు రాజకీయరంగంలో పోరాడుతున్నారు. కుటుంబ సౌఖ్యాలను వదిలి రాజకీయ లక్ష్య సాధన కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. కొంతమంది మొదటి నుంచి వివాహానికి దూరంగా ఉండగా, మరికొంతమంది వివాహానంతరం ఒంటరి జీవితం వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. పెళ్లి చేసుకుంటే కుటుంబం, బాదరబందీ ఉంటుంది. పోరాటానికి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అదే ఒంటరి జీవితంలో ఈ ఇబ్బందులుండవు. పోరాడటానికి, ప్రజల కోసం పనిచేయడానికి హద్దులే ఉండవు. కుటుంబం లేకపోవడం అవినీతి, బంధుప్రీతికి పాల్పడాల్సిన అవసరమే ఉండదు.ఒక్కసారి జాతీయ, రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తాయి. తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్ర సృష్టించిన అటల్ బిహారీ వాజ్ పేయి ఆజన్మ బ్రహ్మచారి. వివాహానికి దూరంగా ఉన్నారు. బంధువుల కూతురిని దత్తత తీసుకుని ఆమె వద్ద చరమాంకం వరకూ గడిపారు.న మితభాషి, సాహితీవేత్త అయిన వాజ్ పేయి వివాహం చేసుకోలేదని ఏనాడూ బాధపడలేదు. తాజా రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే ప్రధాని పదవిని అధిష్టించానలి తాపత్రయ పడుతోన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని పదవిని మరోసారి అధిష్టించేందుకు రెడీ అయిన నరేంద్ర మోదీ ఇద్దరూ బ్రహ్మచారులే. 


సోలో బ్రతుకే సో బెటర్

చిన్న వయసులోనే వివాహం చేసుకుని కొద్దికాలానికే ఒంటరి జీవితానికి మోదీ మొగ్గు చూపారు. భార్య ఉన్నప్పటికీ దశాబ్దాలుగా వేరుగా ఉంటున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ లెక్క చేయలేదు. యాభయ్యో వడికి చేరువలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పటికీ పెళ్లి ఊసెత్తడం లేదు. రాజకీయాలను తాను పెళ్లి చేసుకున్నట్లు చమత్కరిస్తున్నారు.ఒడిశా ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా పనిచేస్తున్న నవీన్ పట్నాయక్ ఆజన్మ బ్రహ్మచారి. బిజూ జనతాదళ్ అధినేత అయిన పట్నాయక్ ఏడు పదులు దాటినా వివాహం ఊసెత్తడం లేదు. ఈ సారి గెలిస్తే ఐదోసారి సీఎం పదవిని చేపట్టనున్న నవీన్ పట్నాయక్ ఆదర్శ రాజకీయ వేత్త. పేదల అనుకూల విధానాలను అవలంబిస్తుంటారన్న పేరుంది. తండ్రి బిజూ పట్నాయక్ మరణం తర్వాత అధికార పగ్గాలను అందుకున్న ఆయన అవినీతికి ఆమడదూరం. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అవివాహిత. రాష్ట్రంలో సీపీఎం సర్కార్ దురాగాతాలను ఆమె ఒంటరిగా పోరాడారు. రాష్ట్రంలో సీపెీఎం పాలనను అంతమొందించేంత వరకూ పెళ్లి చేసుకోనని ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఆ లక్ష్యం నెరవేరినప్పటికీ వివాహం ఊసెత్తడం లేదు 64 ఏళ్ల దీదీ. కాంగ్రెస్ నాయకురాలిగా సీపీఎంతో పోరాడిన తర్వాత రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ ప్రారంభించారు. 2011లో సీపీఎం సర్కార్ ను ఓడించి అధికారం అందుకున్నారు. 2016లోనూ విజయ కేతనం ఎగురవేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేరు తెలియని వారుండరు. రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన నేతగా చరిత్ర సృష్టించారు. ఆజన్మాంతం అవివాహితగానే ఉండిపోయారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేసిన మాయావతి అవివాహిత. దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. ప్రధాని పీఠంపై కన్నేసిన ఆమె ప్రస్తుతం యూపీ లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో కలసి పోటీ చేస్తున్నారు. హంగ్ లోక్ సభ ఏర్పడితే ప్రదాని అభ్యర్థిగా మాయావతి పేరు తెరపైకి వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేం. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బ్రహ్మచారి. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన ఆయన కుటుంబం పంజాబ్ లో స్థిరపడింది. 26 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు. 14 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. 18 ఏళ్ల వయసులోనే అయోధ్య రామమందిర ఉద్యమంలో పొల్గొన్న ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అవివాహితుడు. గోరఖ్ పూర్ మఠం అధిపతిగా కొంతకాలం పనిచేశారు. 46 ఏళ్ల వయసుగల ఆయన గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి అయిదు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆజన్మ బ్రహ్మచారి. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ప్రస్థానం ప్రారంభించారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన 68 ఏళ్ల రావత్ నిజాయితీ పరుడు. అసోం ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్ అవివాహితుడు. ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడైనా అనంతర కాలంలో బీజేపీలో చేరారు. అనతి కాలంలోనే పార్టీలో ఎదిగారు. 2016 ఎన్నికల్లో గెలిచి అసోం ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా చెప్పకుంటూ పోతే అవివాహిత రాజకీయ వేత్తలకు కొదవ ఉండదు.