నూజివీడు, ఏప్రిల్ 30(way2newstv.com):
జిల్లాలో మామిడి ఎగుమతులు ఊపందుకోగా, ధరలు తిరోగమనం పడుతున్నాయి. కొద్ది రోజులుగా ఒక్క విస్సన్నపేట నుంచే రోజుకు వంద టన్నుల వరకు మామిడి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. తోతాపురి రకం మామిడిని ఆయా ప్రాంతాల్లోని కూరగాయల మార్కెట్లకు.. బంగినపల్లి, రసం రకాలను పండ్ల మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ధరలు గిట్టుబాటు కాకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. తోతాపురి రకం మామిడి ధర టన్నుకు సుమారు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. మామిడిలో రారాజుగా చెప్పుకునే బంగినపల్లి రకానికి సైతం టన్నుకు రూ.20 వేలకు మించి ధర లభించటంలేదు. చిన్న, పెద్దరసం మామిడి ధరలు సైతం టన్నుకు రూ.6 వేలనుంచి రూ.10 వేలకు లోపుగానే చెల్లిస్తున్నారు. గత ఏడాది తోతాపురి రకం మామిడికి కనిష్ఠంగా టన్నుకు రూ.10 వేల వరకు ధర లభించగా.. రసం, బంగినపల్లి రకాలకు రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ధరలు చెల్లించారు. ఈ ఏడాది ఆరంభంలోనే గరిష్ఠంగా పలకాల్సిన ధరలు కనిష్ఠ స్థాయిలో పడిపోవటంతో పాటు, తాజాగా అవి మరింత దిగజారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరాఘాతం (కృష్ణాజిల్లా)
ప్రధానంగా ఇక్కడి నుంచి ముంబయి, నాగపూర్, దిల్లీ వంటి దూరప్రాంతాలకు మామిడిని ఎగుమతి చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు మన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి చేరుకుంటున్న మామిడి నుంచి ఇక్కడి మామిడికి పోటీ ఏర్పడుతుండటంతో ధరలు తగ్గిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా చిత్తూరు, తిరుపతి ప్రాంతాల నుంచి మామిడి ఎగుమతులు ప్రారంభం కాగానే ఇక్కడి పంట కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపటంలేదు. ఆయా ప్రాంతాల్లో నాణ్యమైన మామిడి ఉత్పత్తవుతుండగా ఇక్కడ నాణ్యత కొరవడుతోందనే కారణాలు చెబుతున్నారు. గతంలో 12 మార్కెట్ల ద్వారా రోజుకు సుమారు 150 టన్నుల వరకు మామిడి ఎగుమతులు సాగేవి. ఈ ఏడాది మూడు, నాలుగు మార్కెట్లకు మించి మామిడి కొనుగోలు చేయటంలేదు. ప్రస్తుతం విస్సన్నపేట మార్కెట్ నుంచి రోజుకు 50 టన్నుల వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
ఒకప్పుడు నాణ్యమైన మామిడి ఉత్పత్తిలో దేశంలోనే ముందంజలో ఉన్న కృష్ణా జిల్లాలో నాణ్యత కొరవడేందుకు పలు కారణాలు ఉన్నాయి. రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవటం ప్రధాన కారణం. ఇదే అదనుగా భావించిన పలు రసాయన కంపెనీలు తమ ఉత్పత్తులతో నాణ్యత పెంచుకోవచ్చని అవగాహన సదస్సుల్లో నమ్మించి, వాటిని వినియోగించేలా చేసి, లాభాలార్జించటం మరో కారణం. రూ. వేలు వెచ్చించి ఆ మందులను వాడుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. నూజివీడులోని ప్రభుత్వ మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పంటకు తెగులు సంభవించినప్పుడు, ఆయా ప్రాంతాల్లో సందర్శించి నివారణోపాయాలు తెలిపేందుకే పరిమితమయ్యారు. మామిడి రైతులకు అందుబాటులో ఉంటూ, సరైన సమయంలో సలహాలందించే ఉద్యానశాఖ అధికారులు రెండేళ్ల క్రితం వరకు జిల్లా, డివిజన్ కేంద్రాలకే పరిమితమవ్వగా గత ఏడాది నుంచి మండల స్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేసి అందుబాటులోకి వచ్చారు. ఈ ఏడాది మామిడి సీజను ఆరంభం నుంచి రైతులకు ఈ శాఖ అందుబాటులో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించటం ద్వారా మామిడికి స్థానికంగా విక్రయావకాశాలు పెంపొందించేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భాలు, గిట్టుబాటు ధర లభించని సమయాల్లో స్థానికంగా జరిగే కొనుగోళ్లతో రైతులకు కొంతమేరయినా మేలు చేకూరుతోంది. ఇతర రాష్ట్రాల వ్యాపారులు, స్థానిక కొనుగోలుదారుల మధ్య పోటీ వాతావరణంతో రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు అవకాశాలున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ఉత్సాహం చూపే యువత ఈ ప్రాంతంలో ఉన్నా, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవటంతో అంతంతమాత్రంగానే ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతం తోతాపురి రకం మామిడి కొనుగోళ్లలో స్థానిక, స్థానికేతరుల మధ్య పోటీ వాతావరణం వల్లే పంట విక్రయాలు ఆశాజనకంగా ఉన్నట్లు పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇతర రకాల మామిడిని కొనుగోలు చేసేందుకు అనువైన పరిశ్రమల ఏర్పాటు స్థానికంగా లేకపోవటంతో రైతులు ఎగుమతులపై ఆధారపడి, పంటల సాగును కొనసాగిస్తున్నారు.