పంపిణీకి బ్రేక్ (మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పంపిణీకి బ్రేక్ (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, ఏప్రిల్ 08  (way2newstv.com): 
గొర్రెల యూనిట్ల పంపిణీకి ప్రభుత్వం తత్కాలిక విరామం ప్రకటించింది. వచ్చే జులై చివరి వారం నుంచి మళ్లీ పంపిణీ ప్రారంభిస్తామని, అంతవరకు నిలిపివేయాలని జిల్లా పాలనాధికారితోపాటు పశు సంవర్ధక శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గిపోయిన నేపథ్యంలో గొర్రెలు పంపిణీ చేస్తే గ్రాసం, తాగునీటి కొరత వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి దశలో మొత్తం 12,318 యూనిట్లను పంపిణీ చేయగా ఇందుకు ప్రభుత్వం రూ. 115.48 కోట్లు ఖర్చుచేసింది. మొదటి విడతలో తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ మాదాసి కుర్వలు గొర్రెల పథకానికి దూరంగా ఉన్నారు. 


పంపిణీకి బ్రేక్ (మహబూబ్ నగర్)

రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టగా మాదాసి కుర్వలంతా దరఖాస్తు చేసుకోవటంతో పంపిణీ చేయాల్సిన యూనిట్ల సంఖ్య భారీగా పెరిగింది. తాజా నిర్ణయంతో జిల్లాలో 43వేల యూనిట్ల గొర్రెల పంపిణీ ఆగిపోయింది. వీరందరికీ కూడ మరో మూడు నెలల తర్వాతే గొర్రెలు అందే అవకాశం ఉంటుంది. ఇందుకు జిల్లాలో డీడీలు చెల్లించిన లబ్ధిదారులు మరో 100 రోజుల పాటు ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వం ఇప్పటివరకు పంపిణీ చేసిన గొర్రెలు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా లేదా అనే దానిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధమవుతున్నాయి. మండల పరిషత్తు ఎన్నికల తర్వాత పూర్తి పరిశీలన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గొర్రెలు పొందిన వారిలో చాలామంది దళారుల ద్వారా అమ్మేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని కొన్ని మండలాల్లో దస్త్రాల్లో లెక్కలు చూపి గొర్రెల సొమ్ము లబ్ధిదారులు, దళారులు, అధికారులు కుమ్ముకై మింగేసినట్లు ఇప్పటికే ఇంలిజెన్స్‌కు సమాచారముంది. పరిశీలన తర్వాతే రెండో విడత పంపిణీ చేపట్టే అవకాశముంది.