డా|| మేడసాని మోహన్
తిరుపతి, ఏప్రిల్2, (way2newstv.com)
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల్లో వేద విజ్ఞానసారం ఇమిడి ఉందని టిటిడి శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్ట్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్ పేర్కొన్నారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 516వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాహితీ సదస్సులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా డాక్టర్ మేడసాని మోహన్ 'అన్నమయ్య సంకీర్తనలు - విశిష్టాద్వైత సిద్ధాంత అన్వయము' అనే అంశంపై ఉపన్యసిస్తూ శరణాగతి, లోకనీతి, వేదాల్లోని సారాన్ని కలిపి అన్నమయ్య తన సాహిత్యాన్ని సృష్టించారని వివరించారు. యావత్ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. అన్ని మంత్రాల సారం శ్రీ వేంకటేశ్వర మంత్రంలో ఉందంటూ స్వామివారిపై ఎనలేని భక్తిని చాటారని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు తదితర దేవతలకు ప్రాధాన్యం కల్పించారని వివరించారు.
అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానసారం
హైదరాబాదుకు చెందిన ఆచార్యఎన్.ఎస్.రాజు 'అన్నమయ్య సంకీర్తనలు-విశిష్టతలు' అనే అంశంపై ఉపన్యసిస్తూ సామాన్యప్రజలను చైతన్యవంతం చేసేందుకు అన్నమయ్య కీర్తనలను రచించినట్టు తెలిపారు. వాడుక భాషలోని సామెతలు, పలుకుబడులను ఉపయోగించి పామరులకు సైతం అర్థమయ్యేలా రచనలు చేశారని కొనియాడారు. జానపద బాణీలో రాసిన జోలపాటలు, చందమామ పాటలు మిక్కిలి ప్రాచుర్యం పొందాయని తెలిపారు. అనంతరం అనంతపురంకు చెందిన ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు 'అన్నమయ్య సంకీర్తనలు - దేశి సంప్రదాయ ప్రతిఫలనము' అనే అంశంపై ఉపన్యసిస్తూ అన్నమయ్య సంప్రదాయ జానపద బాణీలు మాత్రమే ఎంచుకుని రచనలు చేయలేదన్నారు. అయన ఆనాటి దేశీయ బాషా, నుడికారం, పలుకుబడులు, వేష భాషలతో రచనలు చేసినట్లు వివరించారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు హైదరాబాదుకు చెందిన శ్రీమతి టి.శ్రీనిధి బృందం గాత్రం, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన కుమారి బి.అన్నపూర్ణ మధులిక బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు తిరుపతికి చెందిన గురజాడ మధుసూదనరావు బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు విశ్వనాథ్, ఏఈవో శాంతి, రీసెర్చి అసిస్టెంట్ లత, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.