గంగ జాడెక్కడ..? (కృష్ణా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గంగ జాడెక్కడ..? (కృష్ణా)

విజయవాడ, ఏప్రిల్22 (way2newstv.com): 
వేసవి ప్రభావం జిల్లాలో తీవ్రమైంది. వడగాల్పులు, వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ నీటి మట్టం పడిపోయింది. తాగు, సాగు అవసరాల కోసం నీటిని ఎడాపెడా తోడేస్తుండటంతో భూగర్భం ఖాళీ అవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో నీటి వినియోగం బాగా పెరిగింది. ఫలితంగా నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌ ఆఖరు, మే నెలల్లో దారుణమైన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. జిల్లాలో సగటు నీటి మట్టం 10.93 మీటర్లకు పడిపోయింది. ఈ ప్రభావం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా పడింది. ఇక్కడ తాగునీటికి, సాగునీటికి బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రైతులు తమ పంటలను బతికించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. బోర్ల మీద బోర్లు వేస్తూ నీరు పడక అప్పులపాలవుతున్నారు. పల్లెల్లోనూ నీరు అందక ఒట్టిపోతున్నాయి. తాగునీటి పథకాలకు సంబంధించిన బోర్లు కూడా విఫలమవుతున్నాయి. నూజివీడు డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో 400 అడుగుల లోతులో బోర్లు వేస్తున్నా నీరు అరకొరగానే వస్తోంది.జిల్లాలో భూగర్భ నీటి మట్టం రోజు రోజుకు వేగంగా పడిపోతోంది. ప్రస్తుతం ఇది 10.93 మీటర్లకు దిగజారింది. డిసెంబరు నుంచి నీటిమట్టం క్రమేపీ పడిపోతూ వచ్చింది. గత ఏడాది ఇదే సమయానికి పోల్చితే 1.40 మీటర్ల కంటే పెరిగింది. 


గంగ జాడెక్కడ..? (కృష్ణా)

అప్పుడు 12.33 మీటర్లుగా ఉంది. ఈ సంవత్సరం మార్చితో పోలిస్తే 0.26 మీటర్ల మేర పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. కాలువలకు నీటిని విడుదల చేయడమే. గత నెలలో తాగునీటి అవసరాల కోసం జలవనరుల శాఖ అధికారులు 0.56 టీఎంసీల నీటిని వదిలారు. ఈ నీటితో 384 చెరువులను నింపారు. దీంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. పశ్చిమ మండలాల్లో రెండో పంట కోసం సాగునీటి కొరత నేపథ్యంలో బోర్ల ద్వారా నీటిని అధికంగా తోడేస్తుండటంతో పడిపోతోంది. డెల్టా ప్రాంతాల్లో మెరుగ్గానే ఉంది. ఎగువ మండలాల్లో మాత్రం దారుణంగా పతనమవుతోంది. వీటిల్లోనూ కృష్ణా నది వెంబడి ఉన్న ప్రాంతాల్లోనే ఆశాజనకంగా ఉంది. మిగిలిన చోట్ల నీటి వనరులు అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ పరిస్థితి దాపురించింది. సముద్ర తీర ప్రాంతాల్లో తక్కువ లోతులోనే నీరు దొరుకుతున్నా ఇది తాగేందుకు పనికిరాని పరిస్థితి. ఉప్పునీటిమయంగా మారడమే దీనికి కారణం. మచిలీపట్నంలో 1.05 మీటర్లు, కృత్తివెన్నులో 1.25 మీ, కోడూరులో 1.39 మీ, నాగాయలంకలో 1.60 మీ, చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో 1.73 మీ, తిరువూరు మండలంలోని అక్కపాలెంలో 1.77 మీ.లలో నీరు అందుబాటులో ఉంది. నూజివీడు డివిజన్‌లో అయితే దారుణంగా ఉంది. ముసునూరులో 98.76 మీటర్లు, నూజివీడు మండలం పల్లెర్లమూడిలో 47.35 మీ, విజయవాడ గ్రామీణంలోని ఎనికేపాడులో 22.62 మీ, ముసునూరు మండలం వేల్పుచర్లలో 32.84 మీ, చాట్రాయి మండలం చిన్నంపేటలో 33.29 మీ, బాపులపాడు మండలం సింగన్నగూడెంలో 25.13 మీ, ఆగిరిపల్లిలో 23.74 మీటర్ల మేర తవ్వితే కానీ నీరు పడని పరిస్థితి నెలకొంది. జిల్లాలో దాదాపు సగం ప్రాంతాల్లో 8 మీటర్ల కంటే లోతుకు పోతేనే నీటి జాడ కనిపిస్తోంది.గతేడాది ఖరీఫ్‌ ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగానే కురిశాయి. తర్వాత దోబూచులాడుతూ వచ్చింది. వానల జాడలేకపోవడం.. అంతలోనే మళ్లీ వర్షాలు పడటంతో కొంతవరకు రైతులు గట్టెక్కారు. చినుకు జాడ లేని పరిస్థితుల్లో డిసెంబరులో పెథాయ్‌ తుపాను వచ్చింది. దీని కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వానలు కురిశాయి. ఈ ప్రభావం భూగర్భ నీటి మట్టంపై తీవ్రంగా పడింది. కొంత మెరుగుపడింది. ఆ తర్వాత వర్షం ఛాయలే లేకపోవడంతో నీటి మట్టం పడిపోయింది. గత ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఇప్పటివరకు మొత్తం 966.40 మి.మీ వర్షం పడాల్సి ఉంది. కానీ కేవలం 800.50 మి.మీ పడింది. 17.20 శాతం మేర లోటు కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాధారణ వర్షపాతం 7.4 మి.మీ కాగా.. 5.2 మి.మీ మాత్రమే పడింది. మార్చిలో 10.7 మి.మీకు గాను 5.2 మి.మీ పడింది. ఏప్రిల్‌లో 5.4 మి.మీ పడాల్సి ఉంది. ఇంత వరకు ఒక్క చుక్క కూడా పడలేదు.కృష్ణా జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో సాగునీటికి భరోసా కొరవడింది. అత్యధికంగా బోర్లపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. పరిమితికి మించి బోర్లను వేయడం వల్ల భూగర్భ జలాలు బాగా అడుగంటాయి. ఈ మండలాల్లో ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. భూగర్భ జలశాఖ అధికారుల గణాంకాల ప్రకారం  పశ్చిమ కృష్ణా పరిధిలోని ముసునూరు, ఛాట్రాయి, విస్సన్నపేట, నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు మండలాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే దిగువకు పడిపోయింది. ఈ ప్రాంతాల్లో నాగార్జునసాగర్‌ జలాలే దిక్కు. గత కొన్నేళ్లుగా సాగర్‌ జలాలు సరిగా రావడం లేదు. దీంతో బోర్ల కింద మామిడి, అరటి, ఆయిల్‌పామ్‌, కూరగాయలు, మొక్కజొన్న, మిర్చి, జామ, తదితర పంటలను సాగు చేస్తున్నారు. ముసునూరులో అట్టడుగు స్థాయికి నీటిమట్టం పడిపోయింది. ప్రస్తుతం సాగర్‌ జలాలు విడుదల కావడంతో పరిస్థితులు కొంత వరకు మెరుగుపడే అవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు. నీటి జాడ కోసం చాలా మంది రైతులు విధిలేని పరిస్థితుల్లో 20 హెచ్‌పీ మోటార్లను కూడా వినియోగిస్తున్నారు. ఇంత సామర్థ్యం కలవి వాడుతున్నా తరచూ విఫలమవుతున్నాయి. ఒక్కో బోరు వేయడానికి రూ.50వేలు అవుతుంది. లోతుకుపోయే కొద్దీ అన్నదాతకు ఖర్చులు పెరుగుతున్నాయి. సాగు అవసరాలతో పాటు ప్రధానంగా తాగు నీటికి కూడా పెరిగిన నీటిమట్టం మేలు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పడిన వర్షం వల్ల వచ్చే ఏడాది వేసవి వరకు తాగు నీటికి కొంత మేర సమస్యలు తప్పుతాయి. ముఖ్యంగా పశ్చిమ కృష్ణాలోని చాలా ప్రాంతాల్లో తాగు నీటి అవసరాలకు బోర్లపైనే ఆధారపడతారు.పశ్చిమ కృష్ణాలోనే అధికంగా ప్రభావం కనిపిస్తోంది. ఈ ప్రాంతం అంతా వర్షాధారమే. బోర్లను ఎక్కువ లోతున వేయాల్సి వచ్చింది. 3 మీటర్లలోపు నీరు దొరికే ప్రాంతాలు జిల్లాలో కేవలం 12.90 శాతమే. 39.60 శాతం ప్రాంతాల్లో నీరు కావాలంటే.. 3 నుంచి 8 మీటర్ల వరకు వెళ్లాల్సిందే. 47.50 శాతం చోట్ల 8 మీటర్లపైగా వేయాల్సిందే. ఇవన్నీ పశ్చిమ జిల్లాలోని ప్రాంతాలే. నూజివీడు నియోజకవర్గంలోని ఛాట్రాయి మండలంలో దాదాపు 500 బోర్ల వరకు ఎండిపోయాయి. తిరువూరు మండలంలో నీరు సరిగా అందక వ్యవసాయ బోర్లు సాగడం లేదు. రెండు గంటల కంటే ఎక్కువ ఆడటం లేదు. గతంలో 80 అడుగుల్లో బోరు వేస్తే నీరు దొరికేది. ప్రస్తుతం 200 అడుగులకు పోయినా ఫలితం ఉండటం లేదు. దీనికి తోడు చెరువులు, వాగులు ఎండిపోవడంతో తీవ్రత ఎక్కువగా ఉంది. ముసునూరు ప్రాంతంలో అయితే ప్రస్తుతం చాలా మంది రైతులు 20 హెచ్‌పీ మోటార్లను కూడా వినియోగిస్తున్నారు. ఇంత సామర్థ్యం కలవి వాడుతున్నా తరచూ విఫలమవుతున్నాయి. ఒక్కో బోరు వేయడానికి రూ.50వేలు అవుతుంది. లోతుకుపోయే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఫలితంగా ఖర్చులు కూడా అపరిమితంగా పెరుగుతున్నాయి.