విజయనగరం, ఏప్రిల్ 26 (way2newstv.com):
తిత్లీ తుపాను వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి స్వయంగా గృహాలను నిర్మించి ఇచ్చేందుకు కలెక్టరు ఇచ్చిన హామీ నెరవేరుతుందనే ఆశతో గిరిజనులు ఎదురుచూస్తున్నారు. తాము ప్రతిపాదించిన నష్టం ప్రాప్తికి మరిన్ని ఇళ్లు మంజూరవుతాయని ఉన్నతాధికారులు భావిస్తున్న నేపథ్యంలో నష్టపోయిన వారికి న్యాయం జరగుతుందని మరోవైపు నిరీక్షిస్తున్నారు. మంజూరైన ఇళ్లను స్వయంగా నిర్మించుకోవాల్సిందేనని గృహ నిర్మాణ సంస్థ సన్నాయినొక్కులు నొక్కుతోంది. దీంతో ఎటు అడుగులు వేయాలో తెలియని స్థితిలో గిరిజనులు ఉన్నారు.పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో తిత్లీ తుపాను కారణంగా గృహాలను కోల్పోయిన బాధితులు 881 మంది ఉన్నారని అధికారులు అంచనా వేశారు.
మా గూడెక్కడ.. (విజయనగరం)
గిరిజన ప్రాంతంలో అంతా రేకులు, పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారు కావడం వల్ల పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు నమోదైన వారికి కూడా గృహాలు మంజూరు చేయాలనేది అధికారుల యోచన. ఈ మేరకు ఐటీడీఏ పీవో లక్ష్మీశ 881 మందికి గృహాలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి మంజూరు వచ్చే సరికి అవి కేవలం 140కి పరిమితమయ్యాయి. మిగిలిన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని గృహ నిర్మాణ సంస్థ ఉన్నతాధికారులకు కలెక్టరు లేఖ రాశారని, త్వరలోనే మంజూరవుతాయని అధికారులు ఇప్పటివరకు చెప్పుకొచ్చారు. కానీ నేటి వరకు ఆదిశగా ముందడుగు పడలేదు. దీంతో మంజూరు కాని వారంతా తమ ఇళ్లను మెరుగుపరచుకోవడం ఎలాగని ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతులు కాక, స్వయంగా ఇళ్లను నిర్మించుకోలేక అడుగులు వేయలేకపోతున్నారని జరడ, తిత్తిరి తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు చెబుతున్నారు.తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న గిరిజన ప్రాంతంలో గిరిజనులకు స్వయంగా ఇళ్లను కట్టించి ఇస్తామని కలెక్టరు,. ఐటీడీఏ పీఓలు ప్రకటించారు. స్వయంగా కలెక్టరు స్థాయి అధికారే హామీ ఇవ్వడంతో ఆదిశగా చర్యలు ప్రారంభమవుతాయని గిరిజనుల్లో విశ్వాసం నెలకొంది. మంజూరైన 140 ఇళ్లను గృహనిర్మాణ పథకం లబ్ధిదారులు ఎలా కట్టుకుంటున్నారో అలాగే.. గిరిజన లబ్ధిదారులు కూడా కట్టుకోవాలని గృహ నిర్మాణ సంస్థ ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు.