షీలా దీక్షిత్ దక్షత్ కు పరీక్షే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

షీలా దీక్షిత్ దక్షత్ కు పరీక్షే

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 (way2newstv.com
పురుషాధిక్య భారత రాజకీయాలలో ఆమె ఓ నిత్యనూతన నాయకురాలు. రాజకీయాలకు వయసు ఏమాత్రం అవరోధం కాదని పదే పదే చాటి చెప్పుతూ వచ్చిన యోధురాలు. 81 ఏళ్ల వయసులో ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన షీలా దీక్షిత్ రాజకీయాలలో పురుషులకు మహిళలు ఏమాత్రం తీసిపోరని నిరూపించారు. భారత రాజకీయాలలో సుదీర్ఘ కాలం కొనసాగిన మహిళలు, రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలు చూసిన మహిళలు అతికొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఢిల్లీ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లపాటు తిరుగులేని అధికారం చెలాయించిన షీలా దీక్షిత్ గురించి మాత్రమే. భారత్ లో రాజకీయాలు అంటే కేవలం పురుషులకు మాత్రమే అనుకొనే రోజులకు కాలం చెల్లింది. పురుషులతో సమానంగా రాణించే మహిళల్లో షీలా దీక్షిత తర్వాతే ఎవరైనా. సుదీర్ఘ రాజకీయ జీవితంలో జయాపజయాలను సమానంగా స్వీకరించడమే కాదు ఎనిమిది పదుల వయసులోనూ ఎన్నికల బరిలో నిలిచిన ఘనత 81 సంవత్సరాల షీలా దీక్షిత్ కు మాత్రమే దక్కుతుంది. 


షీలా దీక్షిత్ దక్షత్ కు పరీక్షే

అంతేకాదు భారత రాజకీయ చరిత్రలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సైతం షీలా దీక్షిత్ పేరుతోనే ఉంది. 1998 నుంచి 2013 వరకూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ సేవలు అందించారు. ఆమె నాయకత్వంలోనే వరుసగా మూడు సార్లు కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో అధికారం చెలాయించింది. ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు షీలా మాట వేదంలా ఉంటూ వచ్చింది. అయితే తన పదవీ కాలంలో పలు వివాదాలు ఎదుర్కొన్నా తన ఆధిపత్యాన్ని కొనసాగించగలిగారు. చివరకు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ కొట్టిన దెబ్బతో షీలా ప్రభ ఒక్కసారిగా మసకబారిపోయింది. కేజ్రీవాల్ ప్రత్యర్థిగా 25 వేల ఓట్ల తేడాతో పరాజయం పొందిన షీలా ఆ తర్వాత ఏడాది కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినా అది రెండుమాసాల ముచ్చటగానే మిగిలిపోయింది. కేంద్రంలో బీజెపీ అధికారంలోకి రావడంతో...కొద్ది నెలల వ్యవధిలోనే గవర్నర్‌ పదవికి షీలా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2019 జనవరిలో ఢిల్లీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీలా మరోసారి వెలుగులోకి వచ్చారు. ఢిల్లీ రాజకీయాలతో షీలా దీక్షిత్ కు ఉన్న అనుబంధం, అనుభవం తమ పార్టీకి గత వైభవాన్ని తీసుకొస్తుందని రాహుల్ గాంధీ గట్టిగా నమ్ముతున్నారు.ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి షీలా దీక్షిత్ ముక్కోణపు సమరంలో బీజెపీ సిట్టింగ్ ఎంపీతో పాటు...ఆప్ అభ్యర్థితో తలపడుతున్నారు. ఈశాన్య ఢిల్లీ ప్రజల గురించి తనకు, తన గురుంచి ఈశాన్య ఢిల్లీ ప్రజలకు బాగాతెలుసునని అది వ్యక్తిగతంగా తనకు, కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని ఈ వెటరన్ లీడర్ అంటున్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా బహుముఖ బాధ్యతలు నిర్వర్తించిన షీలా దీక్షిత్ 81 సంవత్సరాల వయసులో ఎన్నికల బరిలో నిలవటమే ఒక రికార్డయితే ఇక విజయం సాధించగలిగితే అది సరికొత్త చరిత్రే అవుతుంది.