ఏలూరు, ఏప్రిల్ 9, (way2newstv.com)
ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నంగా బరిలోకి దిగిన జనసేన ప్రచారంలో దూసుకుపోతోంది. టీడీపీ, వైసీపీ వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. అయితే పవన్ ప్రచారంలో తొలుత మెగా హీరోలెవరూ కనిపించలేదు. ప్రచారం ముగింపుకొచ్చేసరికి రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ మీకు తోడుగా మేమున్నామంటూ పవన్‌కు బాసటగా నిలిచారు.
పాలకొల్లులో బన్నీ ప్రచారం
నాగబాబు బరిలో ఉన్న నరసాపురం నియోజకవర్గలో గత వారం ఆయన కొడుకు వరుణ్‌తేజ్, కుమార్తె నిహారిక ప్రచారం చేశారు. మూడురోజుల క్రితం పవన్ వడదెబ్బతో అస్వస్థతకు గురికావడంతో రామ్‌చరణ్ ఆయన్ని విజయవాడలో పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. జనసేన వెంట తానున్నానంటూ ప్రకటించారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం పవన్ నిర్వహించిన ప్రచారంలో అల్లు అర్జున్ తళుక్కున మెరిశారు. ప్రచార సభలో పవన్ వెంట నిలబడిన బన్నీ జనసైనికుల్లో ఉత్సాహం నింపారు. ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలతో ముగిసింది.