జనసేనానికి దారేది....కలిసి రాని సామాజికవర్గం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జనసేనానికి దారేది....కలిసి రాని సామాజికవర్గం

కాకినాడ, ఏప్రిల్ 15, (way2newstv.com)
కొత్తగా వచ్చిన పార్టీ ఏం చేయాలి…? తన దమ్ము ధైర్యాన్ని ప్రదర్శించాలి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ను ఉదాహరణగా తీసుకుంటే కేజ్రీవాల్ తాను ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పైనే పోటీకి దిగారు. మరో చోట నుంచి కేజ్రీవాల్ పోటీ చేయలేదు. గెలిస్తే… నిలుస్తా…లేకుంటే తప్పుకుంటా అనే రీతిలో కేజ్రీవాల్ అప్పట్లో ధైర్యసాహసాలను ప్రదర్శించారు. దీంతో కేజ్రీవాల్ పార్టీ ఢిల్లీలో దుమ్ము రేపింది. అయితే ఏపీలో నిన్న జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ వచ్చింది.గత ఎన్నికల్లోనూ జనసేన పార్టీ నేరుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి అది అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమయింది. ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగుతానని చెప్పిన పవన్ కల్యాణ్ కమ్యునిస్టులను కలుపుకుని పోటీ చేశారు. 175 నియోజకవర్గాల్లో జనసేన కూటమి అభ్యర్థులను పోటీకి నిలిపారు. అయితే పోలింగ్ తర్వాత పరిశీలిస్తే జనసేన అభ్యర్థులు రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మాత్రమే ప్రభావం చూపగలిగారు. ఎక్కడా వైసీపీ, టీడీపీ కి ధీటుగా పోటీ ఇవ్వలేకపోయారన్నది పోలింగ్ తర్వాత స్పష్టమయింది. 



జనసేనానికి దారేది....కలిసి రాని సామాజికవర్గం

కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు దూరమయినట్లు వార్తలు వస్తున్నాయి.నిజానికి జనసేన అధినేత కూడా రాంగ్ రూట్లో వెళ్లాడంటున్నారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఆయన భయానికి నిదర్శనమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పోనీ రెండు నియోజకవర్గాల్లో జనసేనకు బలమైనది ఏదైనా ఉందంటే దానికీ సమాధానం దొరకలేదు. గాజువాకలో పోటీ నువ్వా? నేనా? అన్నట్లు జరిగింది. ఇక్కడ పవన్ గెలిచినా మెజారిటీ పెద్దగా రాదన్న అంచనాలు ఉన్నాయి. ఇక భీమవరం విషయానికొస్తే ఇక్కడ జనసేనకు, వైసీపీకి మధ్యనే పోరు జరిగిందని ఆఫ్టర్ పోల్ విశ్లేషణలు వెలువడుతున్నాయి. అక్కడ గెలుస్తారులే అని ఇక్కడ అనుకుని రెండు నియోజకవర్గాల్లోనూ దెబ్బపడే ప్రమాదముందంటున్నారు. గెలవలేమని అభ్యర్థులు  కూడా పెద్దగా ఖర్చు పెట్టకపోవడం మైనస్ అని అంటున్నారు.జనసేన కొద్దిగా బలం చూపగలిగేది పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిలో మాత్రమే. విశాఖ జిల్లాలో సాక్షాత్తూ పవన్ పోటీ చేశారు కాబట్టి కొంత ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తనకు ప్రధానంగా యువత అండగా ఉంటారని ఆశించారు. కానీ యువతలో కొంత భాగం జగన్ వైపు మళ్లినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. గెలవలేని పార్టీకి ఓటెందుకు వేయాలని కొందరు అభిమానమున్నా ఇతర పార్టీలకు ఓటు వేసినట్లు చెబుతన్నారు. మెగా బలమైన అభిమానులు పవన్ వైపు నిలిచినా అది గెలుపునకు ఎంతమేర ఉపయోగపడతాయన్నది సందేహమే. మొత్తం మీద పవన్ పార్టీ తొలిసారి పోటీకి దిగిన ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఫలితాలపై చూపలేదని, వన్ సైడ్ రిజల్ట్ వస్తాయన్నది రాజకీయ పండితుల అంచనా.