విపక్షాల్లో అనైక్యతే కేసీఆర్ కు బలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విపక్షాల్లో అనైక్యతే కేసీఆర్ కు బలం

హైద్రాబాద్, మే 1, (way2newstv.com)
తెలంగాణలో అప్రతిహతమైన ప్రజామద్దతుతో అధికారపార్టీ తెలంగాణ రాష్ట్రసమితి రాజకీయ శిఖరంపై కూర్చుంది. ప్రతిపక్షాలనేవి నిర్వీర్యమైపోయాయి. ఇతర పార్టీలనుంచి ఎన్నికైన ప్రతినిధులు అధికారపార్టీలో చేరిపోయినా ఎక్కడా ప్రతిఘటన ఎదురుకావడం లేదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారే తిరిగి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచి వస్తున్నారు. అనూహ్యమైన ఈ ప్రజామద్దతు కారణంగానే విపక్షాలను లెక్కచేయని తత్వాన్ని కేసీఆర్ అలవరచుకున్నారు. ఫలితంగా అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదు. ఎదురుచెప్పేవారు లేరు. నియంతృత్వం రాజ్యం చేస్తోందన్న భావన ఏర్పడింది. శాసనసభా పక్షాలను ఏకమొత్తంగా విలీనం చేసుకోవడమూ సాగుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం, అధికారపార్టీ రెండూ ముఖ్యమే. పవర్ లో ఉన్న పార్టీ పక్కదారి పడుతున్నప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. అందుకే అపోజిషన్ ను కంట్రోలింగ్ పాయింట్ గా చెప్పాల్సి ఉంటుంది. అయితే విమర్శను తట్టుకోలేని అధికారపార్టీ పూర్తిగా ప్రతిపక్షాలే లేకుండా చేయడం ద్వారా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని చూస్తోంది. 


విపక్షాల్లో అనైక్యతే కేసీఆర్ కు బలం

విపక్షాల్లో ఐక్యత లేకపోవడం, ప్రజలకు సంక్షేమం రూపంలో కావాల్సిన ముడిసరుకు అంతా ప్రభుత్వమే ఇచ్చేయడంతో అప్పోజిషన్ అవసరమేమిటనే ప్రశ్న తెలంగాణలో ఏర్పడింది. ఇది దీర్ఘకాలంలో డిక్టేటర్ షిప్ కు దారితీస్తుంది. తమ అవసరాలను అప్పటికప్పుడు అంచనా వేసుకుని సంతృప్తి చెందే సామాన్యుడు అంతదూరం ఆలోచించడు. అదే అధికారపార్టీకి వరంగా మారుతోంది.ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల వైఫల్యం ప్రతిపక్షాలకు వరంగా లభించింది. నిజానికి పౌరసమాజము, విపక్షాలు రాష్ట్రంలో నిర్వీర్యమైపోయి ఉన్నాయి. అధికార పార్టీని ఎదిరించే సత్తా కోల్పోయాయి. ఆయా పార్టీల్లోని బలహీనతల కారణంగా టీఆర్ఎస్ ఆడిందే ఆట పాడిందే పాటగా చెలామణి అయిపోతోంది. ఈ స్థితిలో ప్రతిపక్షాలకు అయాచిత అవకాశం దొరికింది. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలోని లోపాలు, అవకతవకల కారణంగా విద్యార్థులు రోడ్డున పడ్డారు. 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజానికి ప్రతి ఏటా ఇంటర్ ఫలితాలతో ఫెయిలైన విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. కానీ ఇప్పుడు బోర్డు లోపాలకు ఈ ఆత్మహత్యలు చుట్టుకున్నాయి. అడ్మిషన్లు మొదలు హాల్ టిక్కెట్ల జారీ వరకూ అడుగడుగునా సమస్యలు ఎదురయ్యాయి. వాటి తీవ్రతను గమనించకుండా అదే సంస్థ ద్వారా మార్కుల వివరాల క్రోడీకరణ సాగిపోయింది. మొత్తం వ్యవహారం తిరగబడి లక్షల విద్యార్థుల ఫలితాలలో తప్పులు జరిగినట్లు అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం అదే విషయాన్ని ధ్రువీకరించింది. అయితే తీవ్రమైన ఆందోళన నెలకొనకుండా చర్యలు తీసుకుంటాం. దిద్డుబాటు ఏర్పాట్లు చేపడుతున్నామంటూ సాధ్యమైనంత సున్నితత్వాన్ని కనబరిచేందుకు సర్కారు ప్రయత్నించింది. అయితే ఆవేశంలో ఉన్న విద్యార్థి లోకం మాత్రం చల్లారలేదు. ఉడుకు రక్తం, ఆవేదన కలగలిసి రోజురోజుకీ ఆందోళన చేపట్టే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. తల్లిదండ్రులూ తమ పిల్లలకు మద్దతునిస్తున్నారు. ప్రభుత్వానికి ఇరకాటంగా మారిన అంశమదే.తమ పిల్లల ఇంటర్మీడియట్ విద్యకు తల్లిదండ్రులు ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అప్పులు చేసి తమ బిడ్డలు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలని తాహతుకు మించి ఖర్చు పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైపోయినా ఫర్వాలేదనుకుంటున్నారు. పైసలగురించి లెక్క చేయడం లేదు. కొందరైతే పిల్లలను చదివించుకోవడం కోసమే పట్టణాలకు వలస వస్తున్నారు. ఇంతగా శ్రమదమాదులకోర్చి చదివించుకుంటున్నారు. కేవలం బోర్డు వైఫల్యం వల్ల తమ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగానే ఇంటర్మీడియట్ బోర్డు వివాదం పెద్ద గొడవగా మారుతోంది. సమాజం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. పట్టణాల్లో గ్రామగ్రామాన ప్రభుత్వం తమ పిల్లల్ని ఫెయిల్ చేసిందనే బలమైన నమ్మకం ఏర్పడిపోయింది. నిజానికి ఏదో ఒక చిన్న ఉద్యమం , ఒక వర్గానికి చెందిన సమస్య అయితే ప్రభుత్వం ఎప్పుడో అణచివేసి ఉండేది. దానిని ప్రశ్నించే మీడియా ఉండేది కాదు. ఒకరకంగా చెప్పాలంటే మీడియా కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది. రకరకాల వాణిజ్య ప్రయోజనాలతో మీడియాను సర్కారు కంట్రోల్ చేస్తోంది. సొసైటీ యావత్తు తిరుగుబాటు ధోరణి కనబరచడంతోనే ప్రసార,ప్రచురణ మాధ్యమాలు తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చింది. ప్రభుత్వ కంట్రోల్ సడలింది. ఆధిపత్యధోరణి పెరిగిపోయినప్పుడు వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకున్నప్పటికీ పౌరసమాజమే తిరగబడుతుందనేందుకు ఇంటర్మీడియట్ అంశాన్ని ఒక ఉదాహరణగా చెప్పాలి.సామాజిక అంశం, విద్యార్థుల బలం, తల్లిదండ్రుల ఆవేదన కలసి వచ్చి రాజకీయ ఆయుధంగా అందివచ్చింది విపక్షాలకు. ఇటీవలే ఎన్నికలు ముగిసి జావగారిపోయి ఉన్నాయి ప్రతిపక్షాలు. ఈ ప్రభుత్వంపై ఇప్పట్లో పోరాటం చేయలేమనే నమ్మకాన్ని ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇంటర్మీడియట్ విద్యార్థులు రోడ్డు ఎక్కిన వెంటనే రాజకీయ పార్టీలు పెద్దగా స్పందించలేదు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం కంట్రోల్ చేసేస్తుందని పార్టీలు భావించాయి. తాము అనవసరంగా జోక్యం చేసుకున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదనుకున్నాయి. కానీ రోజురోజుకీ తీవ్రత పెరగడంతో ఈ సంక్షోభంలో అవకాశాన్ని పట్టుకోగలిగాయి రాజకీయ పార్టీలు. దీనిపై సర్కారు సైతం స్పందించింది. నిర్బంధంగానైనా అణిచివేయకపోతే సమస్య మరింత ముదురుతుందని గ్రహించి నాయకుల గృహనిర్బంధానికి పాల్పడింది. అయితే సమస్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడింది కాబట్టి ప్రజల్లోకి వెళ్లిపోయింది. రాజకీయపార్టీలు తెగించి పోరాడితే ప్రజల్లో పట్టు తెచ్చుకునేందుకు ఒక అవకాశం లభిస్తుంది. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల చేజేతులారా ఒక అవకాశాన్ని ప్రతిపక్షాలకు కల్పించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణలో పునరుజ్జీవం పొందడం ఇక విపక్షాల చేతుల్లోనే ఉంది