న్యూఢిల్లీ, మే 1, (way2newstv.com)
నాలుగు విడతల్లో ఎక్కడా సొంతంగా పట్టు దొరకలేదు. మిగిలిన మూడువిడతలూ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏతావాతా ఏదో మిరాకిల్ చోటు చేసుకుంటే తప్ప సొంతంగా అధికారంలోకి వచ్చే చాన్సులేదని కమలనాథులు కలవరపాటుకు గురవుతున్నారు. దాంతో ప్లాన్ బీ పై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించకపోతే ఏం చేయాలనేదే బీజేపీని తొలుస్తున్న ప్రశ్న. భారతీయ జనతాపార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే ప్రతిపక్షంలో కూర్చోవడమా? లేక ఇతర పార్టీల సహకారం తీసుకోవడమా? ఏయే పక్షాలు తమకు సహకరిస్తాయి? ఒకవేళ అధికారం చేజారిపోతే 2024 నాటికి పార్టీ మరింత బలహీనపడుతుందా? విపక్షాల కుమ్ములాటలతో మరింత ప్రబలశక్తిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? వంటి అనేక కోణాలపై బీజేపీలో చర్చ మొదలైంది. యాభైస్థానాల్లోపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే మధ్యేమార్గంగా సహకరించేందుకు కొన్ని పక్షాలు ఇప్పటికే సిద్దంగా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఆయా పార్టీల సహకారం తీసుకుంటే శాశ్వతంగా ఆ ప్రాంతాల్లో తాము బలపడే అవకాశాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది.
ప్రత్యామ్నాయాలపై కమలం ప్లాన్
దీనికి బదులుగా కొంతకాలంపాటు అధికారానికి దూరంగా ఉండి పార్టీని పటిష్టం చేసుకుంటే దీర్ఘకాలం అధికారంలో కొనసాగేందుకు అనువైన ప్రణాళికను అమలు చేయవచ్చనుకుంటున్నారు. అయితే దీనిపై భిన్నమైన వాదనలు వినవస్తున్నాయి. ఒక్కసారి అధికారాన్ని కోల్పోతే వివిధ వర్గాల నుంచి పార్టీకి లభించే ఆర్థిక మద్దతు పోతుంది. తిరిగి అధికారం తెచ్చుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.రాష్ట్రాలవారీగా బీజేపీ లెక్కలు వేస్తోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, ఢిల్లీల నుంచి లభించే సీట్ల సంఖ్య భారీగా తగ్గుతుందని అధిష్ఠానం అంచనా. ఈ రాష్ట్రాల్లోనే 75 నుంచి 80స్థానాలు తగ్గుతాయని భావిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో మరో 40 సీట్లకు గండి పడేందుకు అవకాశాలున్నాయి. అయితే పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిషా లలో సీట్ల సంఖ్య పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. లాభనష్టాలు లెక్కలు వేసుకుంటే మొత్తంగా 175 నుంచి 200 స్థానాల వరకూ కమలానికి దక్కే చాన్సులు ఉన్నట్లు అంతర్గత సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీజేపీలోని నాయకులు కూడా ఈ సంఖ్యతో ఏకీభవిస్తున్నారు. రెండువందల స్థానాలు వస్తే కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది కమలనాథుల యోచన. మిత్రపక్షాల నుంచి దాదాపు వంద సీట్ల వరకూ సమకూర్చుకోవచ్చని, అందుకు తగిన విధంగా సంప్రతింపులు జరిపే బాధ్యతను అధ్యక్షుడు అమిత్ షా కు అప్పగించవచ్చని అగ్రనాయకులు వెల్లడిస్తున్నారు. అయితే 175 కంటే తక్కువ స్థానాలు లభిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఏర్పాటు యత్నాలకు పూనుకోకూడదని స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. ఏదోరకంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రాంతీయ పార్టీల బ్లాక్ మెయిలింగ్ పెరిగిపోతుందని, అధికారం కోసం దిగజారిపోయినట్లవుతుందని బీజేపీ సమాలోచనల్లో సీనియర్ నేతలు అభిప్రాయపడినట్ పార్టీ వర్గాల సమాచారం.ఒకవేళ అధికారంలోకి రాకపోతే రెండు రకాల ప్రత్యామ్నాయాలు పార్టీ ముందు ఉంటాయి. ఒకటి తటస్థంగా మిగిలిపోవడం, లేదా కాంగ్రెసు కూటమి అధికారంలోకి రాకుండా ప్రాంతీయ పార్టీల కూటమిని ప్రోత్సహించి బయటనుంచి మద్దతు ఇవ్వడం. ఈ రెండు విధానాల్లోనూ లాభనష్టాలున్నాయి. తటస్థంగా ఉండిపోవడం వల్ల రాజకీయంగా కేంద్రంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అలాగని ఫెడరల్, సెక్యులర్ ఫ్రంట్ కట్టించి మద్దతిస్తే వారు చేసే తప్పులకు తాము కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో తటస్థంగా ఉండటం సాధ్యం కాదని మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తాను అధికారంలోకి రాకపోయినా బీజేపీని నిరోధించడానికి ఎంత సాహసానికైనా సిద్దంగా ఉంది కాంగ్రెసు పార్టీ. ఫెడరల్ ఫ్రంట్, సెక్యులర్ ఫ్రంట్ లకు తానే మద్దతు ప్రకటిస్తుంది. తద్వారా కొన్ని షరతులను ప్రాంతీయపార్టీల ముందు ఉంచి బలపడేందుకు ప్రయత్నిస్తుంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు చేసిన ప్రయోగమే కేంద్రంలో చేసేందుకు కూడా వెనకాడదు. అదే జరిగితే భాగస్వామిగా కాంగ్రెసు పాత్ర పోషిస్తుందా? బయట్నుంచి మద్దతిస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. దేనికైనా కాంగ్రెసు సిద్దంగానే ఉంటుంది. అవసరమైతే తన పార్టీ ప్రయోజనాలను సైతం పణంగా పెట్టైనా బీజేపీని నిరోధించాలని భావిస్తుంది. ఎందుకంటే మరోసారి బీజేపీ పవర్ లోకి వస్తే.. కాంగ్రెసు ముక్త భారత్ నినాదాన్ని నిజం చేసేందుకు పూనుకుంటుందనే భయం హస్తం పార్టీని వెన్నాడుతోంది.మెజార్టీ లభించకపోతే ఇతరపార్టీలను కూడగట్టగల సామర్థ్యం, సౌమ్యం కలిగిన నితిన్ గడ్కరీని పీఠం పై కూర్చోబెడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా సాగింది. పైపెచ్చు గడ్కరీకి ఆర్ఎస్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంది. కానీ పార్టీని శక్తిమంతం చేయగల జనాకర్షణ ఆయనకు లేదు. బీజేపీ తొలిసారి అధికారంలోకి రావడానికి వాజపేయి జనాకర్షణ, అద్వానీ రథ యాత్ర ఉపకరించాయి. 2014 లో అధికారంలోకి రావడానికి నరేంద్రమోడీ ప్రధాన కారణం. సంస్థాగత బలం ద్వారానే అధికారంలోకి రావాలన్న సంఘ్ సిద్ధాంతం పెద్దగా ఫలించడం లేదు. పార్టీ గెలుపోటములు వ్యక్తులమీదనే ఆధారపడుతున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, రమణసింగ్ వంటి వారి కారణంగానే పార్టీ బలాబలాల్లో ఆయా రాష్ట్రాల్లో మార్పులు వచ్చాయి. పాజిటివ్ గానే కాకుండా నెగటివ్ గా కూడా ప్రధాన నాయకులపైనే పార్టీ ఆధాపడుతోంది. ఇది తోసిపుచ్చలేని విషయం. ఈ పరిస్థితుల్లో అత్యంత ఆదరణ కలిగిన మోడీని పక్కనపెట్టి గడ్కరీతో ప్రయోగం చేస్తే మొదటికే మోసం వస్తుంది. అందువల్ల పార్టీ అధికారానికి దూరంగా ఉండటానికైనా సిద్ధపడాలి. తప్పితే ప్రయోగాల జోలికి పోకూడదని భావిస్తున్నారు. తగినంత మద్దతు లభించకపోతే కొంతకాలంపాటు సర్కారుకు దూరంగా ఉంటే సంపూర్ణమెజార్టీతో తిరిగి అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుందనేది అంతర్గతంగా పార్టీ అవగాహన.