రేపటి నుంచి బాబు నియోజకవర్గాల వారీగా ఆరా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రేపటి నుంచి బాబు నియోజకవర్గాల వారీగా ఆరా

విజయవాడ, మే 1, (way2newstv.com)
ఏపీలో పోలింగ్ ముగిశాక ఎన్నికల సంఘంపై యుద్ధం ప్రకటించారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన.. ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలతో కలిసి పోరాటం ప్రారంభించారు. అనంతరం తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలో ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల తరపున ప్రచారం చేసిన చంద్రబాబు... ఆ తర్వాత కాస్త సైలెంటయ్యారు. ఇటీవల సిమ్లా పర్యటనకు వెళ్లి కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వేసవి విడిది చేసి హిమాచల్‌ ప్రదేశ్‌లో కాస్త రిలాక్స్ అయ్యారు. సోమవారం అమరావతికి తిరిగొచ్చిన చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలపై మళ్లీ దృష్టి సారించారు.


రేపటి నుంచి బాబు నియోజకవర్గాల వారీగా ఆరా

రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరుపై, పోలింగ్ సరళిపై టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. అమరావతిలో మే 2 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీడీపీ సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన తీరు, నాయకుల పనితీరు, బూత్‌లవారీగా పోలింగ్ సరళిపై చర్చించనున్నారు. అంతేకాదు కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేయనున్నారు. రోజుకు 2 పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలపై సమీక్షలు జరపాలని చంద్రబాబాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ సమీక్షా సమావేశాలకు ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి 50 మంది నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం.ఏపీలో వైసీపీదే గెలుపుని మెజార్టీ సర్వేలు చెబుతుండడంతో ఆ వ్యవహారంపై చంద్రబాబు ఇప్పటికే ఆరా తీసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో టీడీపీ పరిస్థితి ఏంటని నేతలను అడిగి తెలుసుకున్నారు. కొందరు నేతలు టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కుప్పం వంటి నియోజకవర్గాల్లో ఏ ఏ పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లు టీడీపీకి పడి ఉంటాయన్న అంచనాలను రిపోర్టు రూపంలో అందజేశారు. దానిపై సంతృప్తి వ్యక్తంచేసిన చంద్రబాబు..మిగతా నియోజకవర్గాల్లోనూ అలాంటి రిపోర్టులు రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకర్గంలో టీడీపీకి పడిన ఓట్ల అంచనాలపై సమీక్షా సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.