విశాఖపట్టణం, మే 1, (way2newstv.com)
పీలో ఎన్నికలు ముగిసి దాదాపు 20 రోజులు పూర్తయ్యాయి. ఫలితాలకు కూడా ఇంకా 20 రోజుల పైనే సమయం ఉంది. గతంలో ఏపీ ఎన్నికలు ఎప్పుడూ చివరి దశలో ఉండేవి. అయితే ఈ సారి మొదటి దశలోనే పూర్తి అయిపోవడంతో ఫలితాలకు, ఎన్నికలకు మధ్య దాదాపు నెలన్నరకు పైగా సమయం చిక్కింది. ఇదే సరైన సమయమని బెట్టింగ్ రాయుళ్లు ఖర్చు పెట్టి మరీ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించుకొని, పందెం బరిలోకి దిగుతున్నారు. ఎన్నికలు ముగియగానే హడావిడిగా వైసీపీ మీద భారీగా పందెం కాసిన బెట్టింగ్ బాబులు, ఇప్పుడు ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలింగ్ సరళిని బట్టి విశ్లేషించుకొని అంచనాకు వస్తున్నారు.
పవన్ గెలుపుపై భారీ బెట్టింగ్ లు
పోలింగ్ ముగిసిన వెంటనే వేసిన బెట్టింగుల్లో మొగ్గు వైసీపీ వైపు చూపించినా, ప్రస్తుతం మాత్రం కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేన ప్రభావం భారీగా ఉందని గత 20 రోజుల పాటు వెలువడుతున్న వివిధ రిపోర్టులను బట్టి బెట్టింగ్ రాయుళ్లు ఒక అంచనాకు వస్తున్నారు. పోటీ కోస్తాలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో జనసేన గట్టిపోటీ ఇచ్చిందని భావిస్తున్నారు. అధికార టీడీపీ, వైసీపీలకు ధీటుగా పోటీ ఇచ్చిందని భావిస్తున్నారు.ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అటు పశ్చమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచి, అలాగే ఉత్తరాంధ్రలోని గాజువాక నుంచి పోటీచేయగా, రెండు సీట్లలోనూ గెలిచే అవకాశం ఉందని బెట్టింగ్ సర్కిల్స్ లో భారీగా పందేలు నమోదు అవుతున్నాయి. పోలింగ్ ముగిసన సమయంలో జనసేన వర్గాల్లో చాలామంది మొదట పవన్ ఏదో ఒక స్థానంలోనే గెలుస్తారని తొలుత భావించారు. అయితే ఇప్పుడు మాత్రం బూత్ స్థాయి వారీగా వస్తున్న సమాచారం బేరీజు వేసుకొని పవన్ రెండు సీట్లలో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనాకు వచ్చాయి. అయితే పవన్ మాత్రం ఎన్నికలు ముగిసినప్పటి నుంచి మౌనంగానే ఉన్నారు. అసలు విషయం బయటపడాలంటే మాత్రం మరో 23 రోజులు ఆగాల్సిందే..