మెజార్టీపైనే అందరి చూపు


లక్నో, మే 20, (way2newstv.com)
ఫైజాబాద్… ఉత్తరప్రదేశ్ లోని అంతగా ప్రాధాన్యం లేని ఓ జిల్లా కేంద్రం. లోక్ సభ నియోజకవర్గ కేంద్రం. మామూలుగా అయితే ఫైజాబాద్ లోక్ సభ స్థానం గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. యూపీలోని 80 స్థానాల్లో ఇది ఒకటి. కానీ ఈ నియోజకవర్గం పరిధిలో అయోధ్య అసెంబ్బీ నియోజకవర్గం ఉండటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకృత మైంది. ఫైజాబాద్ ఫలితం అయోధ్య నియోజకవర్గం నుంచి వచ్చే మెజారిటీపైనే ఆధారపడి ఉంటుంది. రామమందిరం కొలువై ఉన్న ఈ పట్టణం రాజకీయంగా అత్యంత సున్నితమైనది.ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో దరియాబాద్, అయోధ్య, బికాపూర్, రుదౌలి, మిల్కి పూర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్ 2.80 లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఆయనపై పోటీ చేసిన ఎస్పీ అభ్యర్థి మిత్రసేన్ యాదవ్ కు 2.08 లక్షలు, బీఎస్పీ అభ్యర్థి జితేంద్రకుమార్ సింగ్ కు 1.41 లక్షల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నిర్మల్ ఖత్రికి 1.29 లక్షల ఓట్లు లభించాయి. 



మెజార్టీపైనే అందరి చూపు

ప్రస్తుత ఎన్నికల్లోనూ బీజపీ లల్లూసింగ్ ను బరిలోకి దించింది. ఎస్పీ, బీఎస్పీ పొత్తులో భాగంగా ఎస్పీ అభ్యర్థి ఆనందసేన్ యాదవ్, శివసేన తరుపున మహేష్ తివారీ, కాంగ్రెస్ తరుపున నిర్మల్ ఖత్రి పోటీలో ఉన్నారు. రాష్ట్ర రాజధాని లక్నో నగరానికి 127 కిలోమీటర్ల దూరంలో పైజాబాద్ నియోజకవర్గం ఉంది.బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. గత ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులు, మోదీ చరిష్మా, హిందుత్వ విధానం తనకు విజయాన్ని చేకూర్చి పెడతాయని ఆయన అంచనా. మెజారిటీ హిందువలు ఇప్పటికీ బీజేపీ వైపే ఉన్నందున విజయం సునాయాసమన్నది ఆయన భావన. నియోజకవర్గ జనాభా 24 లక్షల మంది. ఇందులో 86 శాతం మంది హిందువులు. 14.8 శాతం మంది ముస్లింలు. ముస్లింలది నిర్ణయాత్మక పాత్ర కాదు. అందువల్ల గెలుపుపై బీజేపీ ధీమాగా ఉంది. అయితే పరిస్థితి అంత సానుకూలంగా లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎస్పీ, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగాపోటీ చేస్తున్న ఆనంది సేన్ గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో ఎస్పీ, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేసినందున బీజేపీకి కలసి వచ్చిందని, ఈసారి ఆ పరిస్థితి లేదని సేన్ గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా సింగ్ కూడా ఆషామాషీ అభ్యర్థి కాదు. ఆయన గతంలో ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ పోటీ ప్రధానంగా బీజేపీ, ఎస్పీ మధ్యనే ఉంటుంది. ఎంపీ లల్లూ సింగ్ గత అయిదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని, విద్య, వైద్య సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పోలీసులు వీఐపీల భద్రతకే పరిమితమయ్యారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.సామాజిక పరంగా చూస్తే యాదవులు, దళితులు, ముస్లింలు ఎస్పీ అభ్యర్థికే ఓట్లు వేస్తారన్న వాదనలో రెండో అభిప్రాయం లేదు. అయితే మెజారిటీ హిందువుల్లో చీలిక వస్తేనే ఎస్పీ అభ్యర్థి విజయం సాధ్యమవుతుంది. బ్రాహ్మణులు, కుర్మీలు, వ్యాపారులు కమలానికి మద్దతుగా ఉన్నారు. ఇటీవల అయోధ్యలో ప్రధాని మోదీ బహిరంగసభలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ఆయన ముగించడం ద్వారా అయోధ్య అంశం తమ అమ్ముల పొదిలో ఉందని చాటారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ ఖత్రి నిరుద్యోగం, నియోజకవర్గం వెనకబాటు, ధరల పెరుగుదల అంశాలను ప్రస్తావిస్తున్నారు. మహారాష్ట్రలో మిత్రపక్షంగా బీజేపీ, శివసేన వ్యవహరిస్తున్నాయి. కానీ శివసేన ఇక్కడ తమ అభ్యర్థిని బరిలోకి దించడం విశేషం. రాజకీయ సంగతి పక్కన పెడితే అయోధ్య అభివృద్ధి పరంగా చాలా వెనకబడి ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అయోధ్య అంశం రాజకీయ పార్టీల మధ్య నలుగుతున్నప్పటికీ అభివృద్ధి పూజ్యం. ఇప్పటికీ ఇరుకైన రహదారులు, గతుకుల రోడ్లే. తాగునీటి ఇబ్బందులు, అపరిశుభ్రత వంటి సమస్యలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయి. పక్కనే సరయూ నది ఉన్నా.. తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. చెత్తా చెదారంతో సరయూ నది దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అయోధ్య సందర్శనకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను పూజారులు నిలువుగా దోచుకుంటున్నారు. అయినప్పటికీ కమలం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లలేదని విశ్లేషకుల అంచనాగా ఉంది.
Previous Post Next Post