సన్నబియ్యం సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. త్వరలో ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో ఈ పాస్ విధానం అమలు చేయాలని పౌరసరఫరా శాఖ నిర్ణయించింది. అన్నీ కుదిరితే ఒకట్రెండు నెలల్లో ఈ విధానం అమల్లోకి రానుంది. నాలుగేండ్ల నుంచి ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద సర్కారు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ పాస్ విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ రేషన్ బియ్యం సరఫరాలో ఈ పాస్ విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో ప్రతినెలా వందల క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నాయి. దీన్ని దష్టిలో ఉంచుకొని ఆ శాఖ హాస్టళ్లు, స్కూళ్లలో అక్రమాలు నిరోధించాలంటే ఈ పాస్ విధానమే మేలనే అంచనా ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఒకటి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి విద్యార్థికి ఒకటి నుంచి 5వ తరగతి వారికి 100 గ్రాములు, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 150 గ్రాముల భోజనాన్ని పెడుతున్నారు. అదే విధంగా హాస్టల్ విద్యార్థులకు రోజూ 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 500 గ్రాములు, 6 నుంచి 10వ తరగతి వారికి 600 గ్రాముల భోజనాన్ని అందిస్తున్నారు.
ఈ పాస్ ద్వారానే సన్నబియ్యం సరఫరా
పాఠశాలలకు విద్యార్థులు హాజరు కాకున్నా వచ్చినట్టుగా లెక్కలు చూపి అక్కడక్కడా అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కొన్ని పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడంలేదు. వారు ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న భోజనాన్నో, ఇంటికి వెళ్లి తిని రావడమో చేస్తున్నారు. అలాంటి వారిని కూడా మధ్యాహ్న భోజనం చేసినట్టుగా తప్పుడు లెక్కలు చూపుతున్నారనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. హాస్టళ్లలో కూడా అదే పరిస్థితి. విద్యార్థులు ఇండ్లకు వెళ్లినా వాళ్లు హాస్టల్‌లో ఉన్నట్టుగానే లెక్కలు సష్టించి సంబంధిత అధికారులు సన్నబియ్యాన్ని కొల్లగొడుతున్నారు. అలా అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చోటుచేసుకున్నాయి. వీటిని ఈపాస్ ద్వారానే అడ్డుకట్ట వేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం.ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అనుగుణంగా ఎంఈఓలు, తహసీల్దార్లకు లెక్కలు అందిస్తున్నారు. వారు పెట్టిన ఇండెంట్ ఆధారంగా సంబంధిత రేషన్‌దుకాణానికి సన్నబియ్యం వస్తున్నాయి. అక్కడి నుంచి పాఠశాలలకు తీసుకెళ్తున్నారు. కాగా, వసతి గహాల్లో విద్యార్థుల హాజరు తీసుకునేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నా అవి నిరుపయోగంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం బయోమెట్రిక్‌ను కచ్చితంగా అమలు చేయడంతోపాటు బియ్యం సరఫరాలో ఈపాస్ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. దాంతోపాటు పాఠశాలకు సరఫరా అయ్యే బియ్యం సరఫరాకు సంబంధించి రేషన్‌షాపుల నుంచి కాకుండా నేరుగా సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ పాఠశాలలకు సంబంధించి బియ్యాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తి వేలిముద్ర తీసుకొని ఇవ్వనున్నారు. అదే విధంగా హాస్టల్‌కు సంబంధించి వేలిముద్ర ఆధారంగా బియ్యాన్ని ఇస్తారు. తద్వారా బియ్యం పక్కదారి పట్టదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో నేరుగా పాఠశాల, హాస్టల్ వారు ఎంత బియ్యం తీసుకున్నారనేది తేలిపోతుంది. అక్కడ విద్యార్థులకు వండిపెడతారు. అక్కడ ప్రతి నెలా మిగిలిన బియ్యం బయటికి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ పాస్ విధానం అమలు చేయడం ద్వారా సన్నబియ్యంలో అక్రమాలకు అడ్డుకట్టపడి సక్రమంగా పిల్లలకు భోజనం అందే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు
Tags:
telangananews