అన్నదాత అందోళన (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అన్నదాత అందోళన (తూర్పుగోదావరి)

కాకినాడ, మే 27 (way2newstv.com): 
జిల్లాలో రబీలో రైతుల పంట పండింది..వరి దిగుబడులు గణనీయంగా పెరిగాయి..అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దళారుల మాయాజాలానికి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో నిర్దేశించిన ధరలకు మాత్రమే అమ్మాలని రైతులకు సూచిస్తూ అధికారులు ముమ్మర ప్రచారం చేశారు. ఇంతవరకు బాగున్నా.. జిల్లాలో ధాన్యం దిగుబడి ఎంత..? కొనుగోలు కేంద్రాల్లో సేకరిస్తున్నది ఎంత..? మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి..? దళారుల దందాలతో రైతులు మోసపోతున్న వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 4.04 లక్షల ఎకరాల్లో రబీలో వరి సాగైంది. పండించిన వారిలో 90 శాతం మంది కౌలు రైతులే. కూలీల కొరత, ఇతర ఇబ్బందులతో చాలా మంది రైతులు సాగుకు మొగ్గు చూపకుండా భూములను కౌలుకు ఇచ్చేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ధాన్యానికి గిట్టుబాటు ధర రాకపోవడంతో కౌలు రైతులు సైతం సేద్యం చేసేందుకు వెనకాడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏటా ఖరీఫ్‌లో వర్షాల కారణంగా పంటలను నష్టపోతూ రబీ ..మిగతా 7లోపైనే ఆశలు పెట్టుకుని వ్యవసాయం చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర అందక పోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. కూలీ రేట్లు, ఎరువులు, పురుగు మందుల ధరల పెరుగుతుండడంతో సాగుకు పెట్టిన పెట్టుబడులు రైతన్నలకు తడిసి మోపెడవుతున్నాయి. 

అన్నదాత అందోళన (తూర్పుగోదావరి)
ప్రస్తుతం రబీలో వచ్చిన దిగుబడులకు, వెచ్చించిన పెట్టుబడికి దాదాపు సరిపోవడంతో చివరకు తమకేమీ మిగలడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ధాన్యం నిల్వలను కళ్లాల్లోనే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతుండగా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. దళారులు ముందుగానే కళ్లాల్లోకి వాలిపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ, మట్టి శాతం పేరుతో కొర్రీలు ఎదురవుతున్నాయనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల సేకరణ లక్ష్యం తక్కువగా ఉండడం..జిల్లాలో పండుతున్న ధాన్యం ఎక్కువ కావడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. నారుమడి, విత్తనాలు, ఎరువులు, దమ్ములు, ఆకుతీత, వరినాట్లు, బాటలు, కలుపు తీత, వరికోత, నూర్పులు వరకు పెట్టిన ఖర్చులు.. కూలీలతో ఎకరాకు ఖర్చు రూ.28 వేల నుంచి రూ 30 వేలకు దాటుతోంది. ఆయా పనులకు అవసరమైన సొమ్ము వ్యాపారులు, మిల్లర్ల నుంచే రైతులు అప్పుగా తెచ్చుకుంటున్నారు. దీంతో పంట పండిన తర్వాత తక్కువ మొత్తానికైనా వారికే అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. కొందరు రైతులైతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మే అవకాశం తమకు లేదని పేర్కొంటున్నారు. .ధర పెరుగుతుందన్న ఆశతో ఈ ఏడాది రబీలో ఎక్కువ మంది రైతులు ఎంటీయూ 3626 (బొండాలు) వరి వంగడాన్ని సాగు చేశారు. గత ఏడాది ఈ రకానికి మంచి ధర దక్కింది. ప్రస్తుతం దీనికి బస్తాకు రూ.1150కు మించి ధర పలకడం లేదు. దీంతో కళ్లాల్లోనే ధాన్యం రాశులు దర్శనమిస్తున్నాయి. నెల రోజులుగా రేటు పెరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు ధర పెరిగే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఏదో ఒక ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.బొండాల సాగులో సుడిదోమ ఉద్ధృతి ఎక్కువ కావడంతో ఈ ఏడాది ఎకరాకు రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ధరకు విక్రయిస్తే రైతు నష్టపోయే పరిస్థితి ఎదురవుతోంది. ధర పెరుగుతుందని ఇంకా ఎదురుచూస్తే చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండడంతో పాటు కళ్లాల్లోనే ధాన్యం రాశులు ఉంటే రాబోయే వర్షాలకు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంటుందని, దీంతో వచ్చిన ధరతో అమ్ముకోవాల్సివస్తోందని రైతులు వాపోతున్నారు.