సొంత పార్టీ నేతలపై కస్సు బస్సు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సొంత పార్టీ నేతలపై కస్సు బస్సు

విజయవాడ, మే 18, (way2newstv.com
మ‌ళ్లీ అధికారంలోకి రావాలి! ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి తీరాలి! ఇదీ టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఏ వేదికెక్కినా.. ఎక్కడ మాట్లాడినా ఎలుగెత్తిచాటుతున్న విష‌యం. ఇక‌, పార్టీ నేత‌ల‌కురోజుకో త‌లంటు పోశారు. ఎక్కడిక‌క్కడ పార్టీలో విభేదాల‌ను స‌రిదిద్దుతూ ముందుకు సాగారు. ఎన్నిక‌ల‌కు ముందు రోజు వ‌ర‌కు కూడా ప‌లు జిల్లాల్లో త‌మ్ముళ్ల ప‌రిస్తితిపై ఆయ‌న నివేదిక‌లు తెప్పించుకుని స‌రిదిద్దుతూనే ఉన్నారు. ఇక‌, ఎన్నిక‌ల్లో కూడా త‌మ్ముళ్లను చూడొద్దు.. త‌న‌ను చూసి ఓటేయ‌మ‌ని ఆయ‌న నేరుగా ప్రజ‌ల‌కు పిలుపు కూడా ఇచ్చారు. అయిన‌ప్పటికీ ఎంత లేద‌న్నా క్షేత్రస్థాయిలో నాయ‌కుల బలాబ‌లాల‌పైనే ప్రజ‌ల ఓటింగ్ ఉంటుంద‌నేది వాస్తవం.ఇక‌, ఎన్నిక‌లు ముగిశాయి. ఇప్పుడు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని అసెంబ్లీ స్థానాల‌పై రోజుకొక‌టి చొప్పున చంద్రబాబు రివ్యూ మీటింగులు పెడుతున్నారు. ప‌రిస్తితిని తెలుసుకుంటున్నారు. క‌ష్టప‌డి ప‌నిచేసిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంద‌ని గ‌తంలో చెప్పిన మాట‌ల‌నే వ‌ల్లెవేస్తున్నారు.


సొంత పార్టీ నేతలపై కస్సు బస్సు

బాబు తీరు ఈ విధంగా ఉంటే.. క్షేత్రస్థాయిలో త‌మ్ముళ్ల ప‌రిస్థితి మాత్రం దీనికి భిన్నంగా క‌నిపిస్తోంది. ఎక్కడిక‌క్కడ బాబు విజ‌న్‌పై నీళ్లు కుమ్మరించే ప‌నికే త‌మ్ముళ్లు ప్రయ‌త్నించారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వ‌చ్చి టికెట్‌లు పొందిన నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌లు త‌మ పార్టీ వారినే ఓడించేందుకు చాప‌కింద నీరులాగా ప్రయ‌త్నించారు.మ‌రీ ముఖ్యంగా టీడీపీలో సీనియ‌ర్లుగా ఉండి టికెట్ ఆశించి భంగ ప‌డిన నాయ‌కులు ఈ త‌ర‌హా కార్యక్రమాల‌కు తెర‌దీశారు. క‌డ‌ప‌లోని జ‌మ్మల‌మ‌డుగు, క‌డ‌ప ఎంపీ సీట్లలో ఇదే జ‌రిగింది. అదేవిధంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి, కృష్ణాజిల్లా తిరువూరు వంటి చోట్ల వ్యతిరేక‌త పెరిగి తెర‌చాటున సొంత పార్టీ నాయ‌కుల‌కు వ్యతిరేకంగానే త‌మ్ముళ్లు ప‌నిచేశారు. ఇక‌, క‌ర్నూలులో ప‌రిస్థితి మ‌రో ద‌శాబ్దమైనా చ‌క్కదిద్దే ప‌రిస్థితి లేకుండా పోయింది. పత్తికొండలో తుగ్గలి నాగేంద్రపై కేఈ వర్గం, ఆలూరులో వీరభద్రగౌడ్‌పైనా, కోడుమూరులో విష్ణువర్థన్‌రెడ్డిపైనా కోట్ల వర్గం సీఎంకు ఫిర్యాదు చేశాయని సమాచారం.నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదని మంత్రి ఫరూక్‌, స్థానిక అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆళ్లగ‌డ్డలో మంత్రి అఖిల‌కు తీవ్రవ్యతిరేక‌త పెరిగింది. సొంత పార్టీ నేత‌లే ఆమె ఓడిపోవాల‌ని కోరుకున్నారు. అదేవిధంగా బెజ‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఖ‌తూన్‌కు కూడా సొంత పార్టీ నేత‌లు పొగ‌బెట్టారు. పైకి న‌వ్వుతూ మాట్లాడినా తెర‌వెనుక మాత్రం వైసీపీకి అనుకూలంగా ప‌నిచేశారు. ప్రకాశంలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపించింది. ప‌రుచూరు, కొండ‌పిలో టీడీపీ నేత‌ల ప‌రాజ‌యాన్ని సొంత పార్టీ నేత‌లే కోరుకున్నారు. మొత్తంగా చంద్రబాబు కోరిక‌ను త‌మ్ముళ్లు విన్నట్టే విని.. క్షేత్రస్థాయిలో మాత్రం తాము చేయాల్సింది చేసేశారు. దీంతో ఫ‌లితం ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది.