ఆదిలాబాద్, మే 3 (way2newstv.com):
పంటలు సాగు చేసే రైతుల ఆర్థికంగా లబ్ధిపొందేందుకు వీలుగా ప్రణాళిక రూపకల్పనకు వ్యవసాయ స్థితిగతులపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో రైతు సమగ్ర సర్వే మొదలయింది. వచ్చే నెల 20లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గత సర్వేలతో సంబంధం లేకుండా ఎనిమిది పేజీల్లో 46 అంశాలతో కూడిన వ్యవసాయ సంబంధిత సమాచారం సేకరిస్తున్నారు.జిల్లాలో చేపట్టిన రైతు సమగ్ర సర్వేతో సాగు విస్తీర్ణంతో పాటు, నేల స్వభావం, వానాకాలం, యాసంగి, వేసవిలో సాగు చేసే పంటలు, వ్యవసాయ పనిముట్లు, పంట రుణాలు, బీమా, మార్కెటింగ్, చరవాణి వివరాలు, పశువులు, సేంద్రియ వ్యవసాయం, ఉద్యాన పంటలు, సూక్ష్మసేద్యం, ఇంటి ఆవరణలో పెంచుతున్న మొక్కలు, విద్యుత్తు కనెక్షన్లు, వాటి వివరాలు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వచ్చేనెల 20లోగా సర్వేను పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల విధుల్లో ఉన్న వ్యవసాయ సిబ్బందిని విధుల్లో నుంచి తప్పించి సర్వేకు కేటాయించారు.
రైతుకు అండగా.. (ఆదిలాబాద్)
అయితే గ్రామాల్లో ఎన్నికల సందడి ఉండటంతో, అధికారులు వెళ్లే సమయానికి రైతులు అందుబాటులో లేకపోవడంతో సర్వేలో జాప్యం జరిగే వీలుంది.రైతుబంధు అమలు కోసం భూముల వివరాలు సేకరించిన రైతులు పండించే పంటలు, మార్కెటింగ్‌తో పాటు ఇతర వ్యవసాయ స్థితిగతులపై ఇప్పటి వరకు సమాచారం సేకరించలేదు. రైతులు ఒక పంట పేరున రుణం తీసుకోవడం, మరో పంటకు బీమా చేసుకోవడం, క్షేత్రస్థాయిలో మరో పంట సాగు చేయడంతో గందరగోళం నెలకొంది.. దీంతో రైతులు ఏ పంటలు పండిస్తున్నారు. ఎంత దిగుబడి వస్తుందనే అంచనా లేదు. దీంతో ఒక్కోసారి విత్తనాల కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చేపడుతున్న సర్వే ద్వారా పంటల సాగు వివరాలు తెలుస్తుండటంతో దాని ప్రకారంగా విత్తనాలు, ఎరువుల అవసరాలను గుర్తించే వీలుంది.రైతుల వారీగా వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్లు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 1.18లక్షల మంది రైతులు ఉండగా, ఖరీఫ్‌లో రెండు లక్షలు, రబీలో 18వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంట పత్తి. 87వేల మంది రైతులు పత్తి సాగు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తరువాత సోయా, కంది పంటలు సాగు చేస్తున్నారు. కూరగాయల సాగు తక్కువగా ఉంది. దీంతో ఏటా వేల టన్నుల కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ సర్వేలో ఉద్యాన పంటలు, పండ్ల తోటల సమాచారం కూడా సేకరిస్తుండటంతో ఉద్యాన పంటల పరిస్థితులు తెలిసే వీలుంది. ఈ నేపథ్యంలో రైతుల వారీగా చేపట్టిన సర్వే వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం ఉంది.