కరీంనగర్, మే 3 (way2newstv.com):
దశాబ్దాలు గడుస్తున్నా.. జిల్లా కేంద్రంలో జవహర్ బాల కేంద్రానికి శాశ్వత భవన నిర్మాణం జరగలేదు. ఏటా పిల్లలు ఏదో ఒక సంస్థ ప్రాంగణంలో శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవి బాలకేంద్రంలో ఏటా దాదాపు 400 నుంచి 600 వరకు వివిధ కళా అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో ఇంత మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నా.. వారికి శాశ్వత వేదికంటూ లేకపోవటం విచారకరమని కళా సంఘాలు వాపోతున్నాయి. అయిదు దశాబ్దాల కిందట బస్టాండు రోడ్డులోని నెహ్రూ యువక కేంద్రంలో బాల కేంద్రాన్ని ప్రారంభించారు. ఏటా శిక్షణ కోసం విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. బాలల గ్రంథాలయంతో పాటు ఇరుకు గదుల్లోనే పలు కళాంశాలపై పిల్లలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. స్థలా భావంతో నాలుగైదు ఏళ్లు కరీంనగర్ మహిళా క్లబ్‌లోకి మార్చారు. 2006 వరకు ఇక్కడే శిక్షణ కార్యక్రమాలు సాగాయి. తదుపరి మళ్లీ బాలల గ్రంథాలయ పఠనాలయానికి మార్చారు. మళ్లీ స్థలా భావంతో నెహ్రూ యువక కేంద్రం, ఇతరత్రా పాఠశాలల్లో ఏటా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయించినా భవన నిర్మాణం జాప్యం కావటంపై తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఒక దశలో బాల కేంద్రంలో పనిచేసే బోధకులకు గౌరవ వేతనాలు ఇవ్వలేని పరిస్థితి.
బాలకేంద్రంపై నిర్లక్ష్యం (కరీంనగర్)
ప్రభుత్వం వారికి గౌరవ వేతనం కూడా మంజూరు చేయలేదు. బాల వికాస సమితి బాల కేంద్రం వేసవి శిక్షణ తరగతులను విజయవంతంగా పూర్తి చేసేందుకు మద్దతుగా నిలిచింది. కొన్నేళ్ల పాటు సమితి గౌరవ వేతనాలు చెల్లించింది. తర్వాతి కాలంలో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకుని గౌరవ వేతనం చెల్లించారు. శాశ్వత భవనం నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించారు. నిధులు సకాలంలో రాకపోవటంతో ఇందులో స్థలం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా బాల సదన్‌కు కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ 17 గుంటల స్థలం బాల కేంద్రం పేరున తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కేటాయించారు. అప్పట్లో దీని నిర్మాణానికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు పంపించారు. 2005లో భవన నిర్మాణానికి రూ.5 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వటానికి ఒప్పుకున్నారు. అయినా నిర్మాణ పనులు ఊసే లేదు. గతంలో పర్యవేక్షకుడిగా పనిచేసిన గోవిందరాజు దాదాపు 30 ఏళ్లు రూ.3 వేల వేతనంతో పనిచేసి పదవీ విరమణ పొందారు. కొందరు వేసవి శిక్షణ శిబిరంలో మాత్రమే పనిచేస్తే మరికొందరు ఏడాది పొడవునా పని చేసే గురువులు ఇందులో ఉన్నారు. ఈ సంవత్సరం తబలా, సంగీతం, శాస్త్రీయ, జానపద నృత్యం, పెయింటింగ్, టైలరింగ్ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ ఏడాది జవహర్ బాల కేంద్రం వేసవి శిక్షణ శిబిరం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతుల సమయపాలనను విడుదల చేశారు. గాత్ర సంగీతం ఉదయం 8 నుంచి 9 వరకు, తబలా, మృదంగం ఉదయం 8.30 నుంచి 9.30 వరకు, శాస్త్రీయ నృత్యం ఉదయం 9 నుంచి 10 వరకు, ఫ్లూట్ ఉదయం 9 నుంచి 10 వరకు, డ్రాయింగ్, పెయింటింగ్ ఉదయం 9.30 నుంచి 11 వరకు, జానపద నృత్యం ఉదయం 10 నుంచి 11 వరకు, క్రాఫ్ట్, మెహందీ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్నారు.