పాతాళానికి జలం (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాతాళానికి జలం (పశ్చిమగోదావరి)

జంగారెడ్డి గూడెం, మే 3  (way2newstv.com): 
2018లో రుతు పవనాలకు ముందు 5.67 మీటర్లు, వర్షాల తర్వాత 2.80 మీటర్ల మేర జలమట్టం తగ్గింది. విచ్చలవిడి బోర్ల వినియోగం, అక్రమ నీటి వ్యాపారం, వర్షపాతం లోటు.. ఇవన్నీ ఇందుకు ప్రధాన కారణాలు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో పశ్చిమ నీటి ముప్పును ఎదుర్కొనక తప్పదు. జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో జలాశయాలన్నీ ఇంకిపోతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో నమోదైన వర్షపాతం మినహా ఈ ఏడాది జిల్లాలో పెద్దగా వర్షాలు పడలేదు. సగటున 1070.90 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 4.60 శాతం తక్కువగా నమోదైంది. ‘నీరు - చెట్టు’ కార్యక్రమంలో చెరువుల్లో పూడిక తొలగింపు, ఇంకుడు గుంతల తవ్వకం పనులు చేస్తేనే పరిస్థితి ఇలా ఉంది. లేదంటే మరింత నీటి ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చేది. రాష్ట్రంలో అట్టడుగున భూగర్భ జలాలు నమోదైన తొలి వంద ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే అందులో పది జిల్లాలోనే ఉండటం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. ఆయా ప్రాంతాల్లో అమర్చిన ఫిజియోమీటర్ల ద్వారా నమోదైన గణాంకాల్ని పరిశీలిస్తే కొయ్యలగూడెం -2, దెందులూరు, ద్వారకాతిరుమల, చాగల్లు, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, పెదవేగి మండలాల్లోని గ్రామాల్లో భూగర్భ జలం అట్టడుగున ఉంది. 


పాతాళానికి జలం (పశ్చిమగోదావరి)

గత అయిదేళ్లుగా వర్షాలకు ముందు, తర్వాత పరిశీలిస్తే భూగర్భ జల మట్టం తగ్గుతోంది. ఏటా సగటున మీటరు నుంచి రెండు మీటర్ల లోతుకు దిగజారుతోంది. సాధారణంగా వర్షాలు కురిసిన తర్వాత భూగర్భజలం పెరుగుతుంది. అయితే బోర్ల ద్వారా విచ్చలవిడిగా నీటిని తోడేయడంతో ఎక్కడికక్కడ తగ్గుతోంది. 2014లో 14.86 మీటర్ల లోతున ఉన్న జలం 2018 నవంబరులో 2.80 మీటర్లు దిగజారి 17.66 మీటర్లు లోతున నమోదైంది. గతేడాదిగా పరిశీలిస్తే 63.78 అడుగుల నుంచి మరో 3 అడుగులకు దిగజారి 66.76 అడుగుల లోతునకు జలమట్టం వెళ్లిపోయింది.జిల్లాలో మెట్ట ప్రాంత వ్యవసాయం ప్రధానంగా బోర్లపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా రబీ సీజన్‌లో నూరు శాతం సాగు బోర్లపైనే జరుగుతుంది. ఇప్పటికే కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు, అచ్యుతాపురం, మంగపతిదేవిపేట తదితర ప్రాంతాల్లో వ్యవసాయ బోర్లు నీరు అందక మొరాయిస్తున్నాయి. బోర్లు ఉన్నాయన్న ధీమాతో ఉద్యాన పంటల సాగుకు సమాయత్తమైన రైతులు నీరందక సతమతం అవుతున్నారు. ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని మరోచోట పొలాల్లో బోర్లు వేసుకుంటూ ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. చివరకు బిందు సేద్యం పద్ధతులను ఆశ్రయించినా తోటలు ఎండుతున్నాయి. అలాగే జిల్లాలో నీటి అక్రమ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. శుద్ధి చేసిన తాగునీరు పేర అక్రమ వ్యాపారం కోసం ఎక్కడికక్కడ బోర్లు తవ్వుతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడానికి ఇదీ ఒక కారణమని తెలుస్తోంది.జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోయాయి. కొవ్వాడ ప్రాజెక్టు దాదాపు రెండు నెలల కిందటే డెడ్‌ స్టోరేజీకి చేరింది. ఇక్కడ 81 మీటర్లకు నీటిమట్టం తగ్గిపోయింది. తమ్మిలేరులో డెడ్‌ స్టోరీజీ కంటే అర అడుగు మేర నీరు నిల్వ ఉంది. ఎర్ర కాలువలో నీటి మట్టం 78.27 మీటర్లకు తగ్గింది. ఈ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువలకు 100 క్యూసెక్కుల నీరు అందిస్తున్నారు. జల్లేరులో డెడ్‌ స్టోరేజీ కంటే సుమారు 2 మీటర్ల మేర మాత్రమే నీటి నిల్వ ఉంది. మార్చి 15న ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను నిలిపివేశారు.