జగన్ ను గెలిపించిన పాదయాత్రలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ ను గెలిపించిన పాదయాత్రలు


గుంటూరు, మే 24, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి మామూలుగా వీయలేదు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అనూహ్య రీతిలో జనం తిప్పికొట్టారు. ప్రజలు ఏకపక్షంగా తీర్పు నిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా పడిన కష్టానికి ఫలితం లభించింది. ప్రధానంగా జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రజలచెంతకు చేర్చింది.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే జగన్ కు వన్ సైడ్ ఓటింగ్ జరిగిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఏ జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ తన ఆధిక్యతను కనపర్చలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేకత కొంతయితే జగన్ పాదయాత్ర కొంత కారణమని చెప్పకతప్పదు. జగన్ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి క్షణం తీరిక లేకుండా గడిపారు. గత ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సానుభూతి కొంత పనిచేసినా అధికారంలోకి రాలేకపోయారు. కానీ ఈ ఎన్నికల్లో వైఎస్ మరణం సానుభూతి ఉండదన్నది అందరికీ తెలిసిందే. 


జగన్ ను గెలిపించిన పాదయాత్రలు
దాదాపు పథ్నాలుగు నెలలపాటు మూడువేల ఐదు వందల కిలోమీటర్ల మేర జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర సాగింది. ఎండనక, వాననక సుదీర్ఘంగా సాగిన పాదయాత్ర జనం మనస్సుల్లో ముద్రపడింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. తెలుసుకోవడం కోసం జగన్ తమ చెంతకు వచ్చారని అన్ని ప్రాంతాల ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జగన్ ను అక్కున చేర్చుకున్నారు.అందుకే జగన్ 2014 నుంచే తన కార్యాచరణను సిద్దం చేసుకున్నారు. అధికారంలోకి రావాలన్న కసి జగన్ లో కన్పించింది. అందుకే ఆయన సుదీర్ఘ పాదయాత్రను ఎంచుకున్నారు. గతంలో పాదయాత్ర చేసిన వాళ్లంతా అందలం ఎక్కారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలకు ముందు, నారా చంద్రబాబునాయుడు 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి అధికారంలోకి రాగలిగారు. జగన్ కూడా అదే సూత్రాన్ని ఎంచుకున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ కూడా జగన్ తన పాదయాత్రను కొనసాగించారు.పాదయాత్రకు ముందు ఆయన ఖాళీగా లేరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. గుంటూరు హోదా కోసం ఆయన ఆమరణ దీక్షకుదిగారు. అలాగే యువభేరిల పేరిట ప్రతి జిల్లాలోనూ నిర్వహించి హోదా కోసం ఉద్యమించారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా కోసం ఐదుగురు పార్లమెంటు సభ్యుల చేత రాజీనామా చేయించారు. ఇవన్నీ జగన్ పార్టీ విజయానికి దోహదం చేశాయనే చెప్పాలి. జగన్ ప్రజలు నమ్మారు. ఆయనకు ఒకసారి ఛాన్సిస్తే తప్పేంటన్న అభిప్రాయానికి రావడంతోనే ఏపీలో వన్ సైడ్ పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు.