నరసాపురంలో నువ్వా, నేనా.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నరసాపురంలో నువ్వా, నేనా....

ఏలూరు, మే 13, (way2newstv.com)
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు? ఏ నాయ‌కుడు ఇక్కడ ఎంపీ సీటు ను కైవ‌సం చేసుకుంటాడు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిజానికి రాష్ట్రంలోనే ప్రత్యేక‌త‌ను సంత‌రించుకున్న పార్ల మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో న‌ర‌సాపురం ఒక‌టి. ఇక్కడ క్షత్రియ సామాజిక వ‌ర్గం నుంచే ఎంపీలు గెలుస్తుండ‌డంతో ఇక్కడ క్షత్రియ వ‌ర్గం ఎక్కువగా ఉంద‌నే ప్రచారం జ‌రుగుతోంది. అయితే, వాస్తవానికి ఇక్కడ కాపు సామాజిక వ‌ర్గమే ఎక్కువ‌. ఇక‌, గ‌త నెల 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనూ హోరా హోరీ పోలింగ్ జ‌రిగింది. ప్రధాన పార్టీల నుంచి పోటీకి దిగిన అభ్యర్థులు నువ్వా-నేనా అనేరేంజ్‌లో స‌మ‌రం చేశారు.ప్రధానంగా అధికార టీడీపీ ఇక్కడ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించిన టీడీపీ.. ఈ ద‌ఫా మాత్రం ఇక్కడ నుంచి ప్రయోగం చేసింది. ఇదే జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క వర్గం నుంచి రెండు సార్ల‌మెంటు ఎమ్మెల్యేగా గెలిచిన వేటుకూరి వెంక‌ట‌ శివ‌రామ‌రాజు ఉర‌ఫ్ క‌లువ‌పూడి శివ‌ను ఇక్క‌డ నుం చి ఎంపీగా చంద్ర‌బాబు నిల‌బెట్టారు. 


నరసాపురంలో నువ్వా, నేనా....

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నుంచి చివ‌రి నిముషంలో టికెట్ ద‌క్కించుకున్నా రు.. క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజు, మ‌రోప‌క్క‌, మూడోపార్టీగా అవ‌త‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన నుంచి ఆయన సోద‌రుడు మెగా బ్రద‌ర్ నాగ‌బాబు ఇక్కడ నుంచి పోటీ చేశారు.మిగిలిన అభ్యర్థుల్లో ప్రజాశాంతి పార్టీ నుంచి సువార్తీకుడు కేఏ పాల్ ఇక్కడ నుంచే పార్లమెంటుకు పోటీ చేశారు. అయితే, ప్రధాన పోరు మాత్రం వైసీపీ, టీడీపీ, జ‌న‌సేనల మ‌ధ్యే సాగుతుంద‌ని అంటున్నారు. ఇక‌, ప్రధాన పార్టీలు రెండూ కూడా క్షత్రియ వ‌ర్గానికి టికెట్ కేటాయిస్తే.. జ‌న‌సేన మాత్రం కాపు వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ సోద‌రుడికి అవ‌కాశం ఇచ్చింది. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని భీమ‌వ‌రం అసెంబ్లీ సీటుకు ఏకంగా ప‌వ‌నే పోటీ చేయ‌డంతో మొత్తంగా న‌ర‌సాపురం ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంతోపాటు.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాపైనే రాజ‌కీయంగా అంచ‌నాలు పెరిగిపోయాయి. దీంతో ఎవ‌రు ఎక్కడ గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.ఇక‌, న‌ర‌సాపురంలో క్షత్రియ ఓటు బ్యాంకు 70 వేలు ఉంటుంది. మిగిలిన వ‌ర్గాల్లో కాపుల ఓటు బ్యాంకే మేజ‌ర్‌. ఇక్క‌డ నుంచి నాగబాబు పోటీ చేస్తుండ‌డంతో కాపుల ఓటు బ్యాంకును చీలుస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కాపు ఓటు క్రాసింగ్ జ‌రిగింద‌ని కూడా భావిస్తున్నారు. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లోనూ కాపులు బ‌లంగా ఉన్నారు. ఇక ఉండి ఎమ్మెల్యేగా గ‌త రెండుసార్లు వ‌రుస‌గా గెల‌వ‌డంతో పాటు మంచి ఇమేజ్ ఉన్న శివ టీడీపీ నుంచి రంగంలో ఉన్నారు. శివ‌ను చివ‌రి క్షణంలో ఎంపీగా పంపిన చంద్రబాబు ఉండి సీటును శివ స‌న్నిహితుడు అయిన మంతెన రాంబాబుకు ఇచ్చారు.ఇక వైసీపీ నుంచి ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ప్రముఖ పారిశ్రామిక‌వేత్త క‌నుమురు రఘురామ‌కృష్ణంరాజు చివ‌ర్లో వైసీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి రంగంలో ఉన్నారు. ఎన్నిక‌ల్లో వైసీపీ బాగా ఖ‌ర్చు పెట్టింది. ఇప్పుడున్న అంచ‌నాల ప్ర‌కారం పాల‌కొల్లు, త‌ణుకు, ఉండి మూడుచోట్ల టీడీపీ గెలుస్తుంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో భీమ‌వ‌రం, న‌ర‌సాపురం, తాడేప‌ల్లిగూడెంలో టీడీపీకి మూడో ప్లేస్ వ‌స్తుంద‌ని అంచ‌నాలూ ఉన్నాయి. భీమ‌వ‌రంలో ప‌వ‌న్ పోటీ చేయ‌డంతో ఇక్క‌డ పోటీ జ‌నసేన వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్యే ఉంది. ఇక్క‌డ టీడీపీకి మూడో ప్లేస్ అంటున్నారు.ఇక న‌ర‌సాపురంలోనూ టీడీపీకి మూడో ప్లేసేనా ? అన్న సందేహాలు ఆ పార్టీ వాళ్ల‌లోనే వినిపిస్తున్నాయ్‌. ఇక జ‌న‌సేన అన్నిచోట్ల కాపు ఓటు బ్యాంకు చీలుస్తుందా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే.. టీడీపీ తీవ్రంగా న‌ష్ట పోతుంద‌ని చెబుతున్నారు. జ‌న‌సేన‌కు భీమ‌వ‌రం, తాడేప‌ల్లిగూడెంల‌లో గెలుపు అవ‌కాశం ఉంది. ఇక‌, మూడో పార్టీ వైసీపీ అన్ని చోట్లా గెలుస్తుందా? లేక‌కొన్ని స్థానాల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా? ఓవ‌రాల్‌గా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ గెల‌వ‌డం లేదా క‌నీసం రెండో ప్లేస్లో ఉన్నా ఆ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందా ? అస‌లు ఏం జ‌రుగుతుంది అనేది ఇక్క‌డ అంచ‌నాల‌కు అంద‌క పోవ‌డం గ‌మ‌నార్హం.