లక్నో, మే 5, (way2newstv.com)
భోజ్ పురి నటుడు రవికిషన్ టాలీవుడ్ కు సుపరిచితుడు. ‘‘రేసుగుర్రం’’ సినిమాలో ఆయన మద్దాలి శివారెడ్డి పేరుతో విలన్ పాత్ర పోషించి ప్రేక్షకుల మెప్పును పొందాడు. తర్వాత బీజేపీలో చేరి ఏకంగా లోక్ సభకు పోటీ చేస్తుండటం విశేషం. సినిమాల్లో ప్రతినాయకుడి పాత్ర పోషించిన రవికిషన్ రాజకీయాల్లో కథానాయకుడి పాత్ర పోషించనున్నారు. రాజకీయాల్లో అదీ అధికార బీజేపీలో చేరగానే ఆయనకు మంచి జాక్ పాట్ అవకాశం లభించింది. పార్టీ ఏకంగా ఆయనకు గోరఖ్ పూర్ స్థానాన్ని కేటాయించడం విశేషం. గోరఖ్ పూర్ చెప్పగానే ముందుగా యోగి ఆదిత్యానాధ్ గుర్తుకు వస్తారు. తూర్పు ఉత్తరప్రదేశ్ లో, నేపాల్ సరిహద్దుల్లో ఈ లోక్ సభ స్థానం విస్తరించి ఉంది. ఆదిత్యానాధ్ ఇక్కడి నుంచి వరసగా అయిదు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. గోరఖ్ పూర్ ఎంపీగా ఉంటూనే ఆయన యూపీ ముఖ్యమంత్రి కావడం విశేషం.రాజకీయంగా చూస్తే గోరఖ్ పూర్ కమలానికి కంచుకోట వంటిది. యోగి ఆదిత్యానాధ్ అయిదుసార్లు ఎన్నికవ్వడమే ఇందుకు నిదర్శనం. అయితే గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కమలం అదృష్టం తారుమారైంది. ఆదిత్యానాధ్ సీఎం గా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
గోరఖ్ పూర్ లో శివారెడ్డి గెలిచేనా
ఈ ఎన్నికలో కమలం పార్టీ కషాయాన్ని మింగవలసి వచ్చింది. నాటి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని నిషాద్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ దాదాపు 22 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు. అప్పట్లో ఆయనకు ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలు మద్దతు ఇచ్చాయి. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో పరిస్థితి మారింది. ప్రవీణ్ కుమార్ నిషాద్ ఇటీవల అనూహ్యంగా బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి ఆదిత్యానాధ్ ను కలిశారు. దీంతో ఎస్పీ తన వ్యూహాన్ని మార్చుకుని రామ్ భువల్ నిషాద్ కు టిక్కెట్ కేటాయించింది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన కౌదిరం స్థానం తాజాగా గొరఖ్ పూర్ రూరల్ శాసనసభ స్థానంగా రూపాంతరం చెందింది. గోరఖ్ పూర్ లోక్ సభ స్థానం పరిధిలో కెయింప్ యారగంజ్, విప్రియాబ్, గొరఖ్ పూర్ అర్బన్, గొరఖ్ పూర్ రూరల్, సహజన్వ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో 14,32 లక్షల మంది ఓటర్లున్నారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో అనేక మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా బీజేపీ, ఎస్పీ మధ్యనే ఉంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు రవికిషన్, రామ్ భువల్ నిషాద్ మధ్య పోటీ ఉంది. ఇతర చిన్నా చితకా పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వారి ప్రాధాన్యం అంతంత మాత్రమే. గోరఖ్ పూర్ బీజేపీకి పట్టున్న స్థానమే. ఆదిత్యానాధ్ అయిదుసార్లు గెలవడమే ఇందుకు నిదర్శనం. గత లోక్ సభ ఎన్నికల్లో ఆయన 1,42 లక్షల ఓట్ల మెజారిటీ సాధించడం గమనార్హం. ఈ నేపధ్యంలో తమ గెలుపుపై బీజేపీ ఒకింత ధీమాతో ఉంది. అయితే గత ఏడాది ఉప ఎన్నిక చేదు అనుభవాన్ని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఈ వాదనను కమలం పార్టీ తోసిపుచ్చుతోంది. ఉప ఎన్నికకు, సాధారణ ఎన్నికలకు తేడా ఉంటుందని, ఉఫ ఎన్నిక సమయంలో విపక్షాలు ఏకపతాటిపై నడిచాయని, అయినప్పటికీ మెజారిటీ 22 వేల లోపేనని గుర్తు చేస్తోంది. ఆ తేడాను ఈసారి తేలిగ్గా అధిగమిస్తామని కమలం పార్టీ చెబుతోంది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు మారాయని గుర్తు చేస్తోంది.వెండితెర నటుడు అయిన బీజేపీ అభ్యర్థి రవికిషన్ విజయంపై ధీమాతో ఉన్నారు. మోదీ, ఆదిత్యనాధ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఆయన చెబుతున్నారు. ఎంపీగా యోగి ఆదిత్యనాధ్ గోరఖ్ పూర్ నగరాన్ని అందంగా తీర్చి దిద్దారని ఆయన గుర్తు చేస్తున్నారు. ఏడు కోట్ల మంది మహిళలకు మోదీ గ్యాన్ కనెక్షన్లు ఇచ్చారని, 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించారని రవికిషన్ చెబుతున్నారు. తాను గెలిస్తే భోజ్ పురి భాషను ఎనిమిదో షెడ్యూల్ లో చేరుస్తానని హామీ ఇచ్చారు. తాను నియోజకవర్గానికి బయట వ్యక్తిని అయినప్పటికీ, ఎన్నకైతే ఇక్కడే ఉంటానని చెప్పారు. మదోీ, ఆదిత్యానాధ్ సహాయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిచేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఎస్పీ అభ్యర్థి రామ్ భువల్ నిషాద్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఉప ఎన్నిక ఫలితమే పునరావృతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలు తనకు కలసి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. యాదవ, ముస్లిం, దళిత ఓటు బ్యాంకులు తమ వెనకే ఉన్నాయనిచెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి రవికిషన్ యువత ఓట్లపై ఆధారపడ్డారు. సంప్రదాయంగా ఉండే అగ్రవర్ణాల ఓట్లు తనకు పడతాయని చెబుతున్నారు. మొత్తానికి గొరఖ్ పూర్ లో ఆసక్తికర పోరు జరిగింది. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో గెలుస్తారని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే ఎవరికి వారు గెలుపుపై ధీమాలో ఉండటం విశేషం