ఏలూరు, మే 1, (way2newstv.com)
పోలవరం ప్రాజెక్టు వంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణంలో నమూనా అధ్యయన పరీక్షలకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఏ ప్రాజెక్టు అవసరమైనా అందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమూనా అధ్యయన పరీక్షలకు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు ఇంజనీరింగ్ ప్రయోగశాల ద్వారా పొందే అవకాశం ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రయోగశాలను తెలంగాణాకు వదిలేయడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నమూనా అధ్యయన పరీక్షలు పూణెలో చేయించాల్సి వస్తోంది. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఈ అధ్యయన పరీక్షలు పూణేలో జరుగుతున్నాయి. జల వనరుల శాఖ ఇంజనీర్ల బృందం ఎప్పకపుడు పూణే వెళ్ళి, అక్కడ మకాం ఉండి నమూనా అధ్యయన పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెలల తరబడి ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇంజనీర్లు నివేదికలు తయారుచేయించుకొచ్చి సీడబ్ల్యూసీకి, పోలవరం అధారిటీకి సమర్పిస్తున్నారు. ఈ నమూనా అధ్యయన నివేదిక కోసమే కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నాయి.దీనితో పాటు నాణ్యతా ప్రమాణాలను లెక్కించే సామర్ధ్యం కూడా ఒకపుడు స్వతంత్రంగా వుండేది.
పోలవరం ప్రాజెక్టుపై నమూనాకే కోట్లాది రూపాయిలు
కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు సంక్రమించిన ప్రాంతీయ ఇంజనీరింగ్ ప్రయోగశాలల్లో అవకాశం లేకపోవడంవల్ల పోలవరం నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి కూడా సీడబ్ల్యుసీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కేంద్రానికి పంపించి నివేదికలు తెచ్చుకుంటున్నారు. దీనికి కూడా ఒక ఇంజనీరింగ్ బృంద ఎప్పటికపుడు తిరుగుతోంది.పోలవరం ప్రాజెక్టులో చాలా కీలకమైన నాణ్యతా నిర్ధారణ పరీక్షలు, నమూనా అధ్యయన పరీక్షలకు సంబంధించి సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో రెండు కేంద్ర ప్రభుత్వ రంగ కన్సల్టింగ్ సంస్థలకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సంస్థల విభాగాలను పోలవరం హెడ్ వర్క్సు ప్రాంతంలో పెట్టి నిరంతరం ఎప్పటికపుడు అవసరమైన అధ్యయన నివేదికలు, నాణ్యతా ప్రమాణాల నివేదికలు అప్పగించే విధంగా చర్యలు చేపట్టారు. వాస్తవానికి ఈ సంస్థలను సీడబ్ల్యూసీ నియమించినప్పటికీ అందుకు అవసరమైన నిధులను (చార్జీలను) ప్రాజెక్టు ఖర్చులోంచే చెల్లించాల్సివుంది.ఇందుకు సంబంధించిన బిల్లులు ఎప్పటికపుడు చెల్లించాల్సివుంది. పోలవరం ప్రాజెక్టు లక్ష్యం మేరకు ముందుకెళ్ళాలంటే నివేదికలు సకాలంలో సమర్పించాల్సివుంది. ఈ నివేదికల కోసం, నమూనా అధ్యయనాల పరీక్షల కోసం పూణే, న్యూఢిల్లీ, ముంబై తదితర అత్యున్నత ఇంజనీరింగ్ కేంద్రాలకు నిత్యం పోలవరం ఇంజనీర్ల బృందం తిరుగుతూనే ఉంది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి నివేదికలు సకాలంలో సమర్పిస్తున్నారు. సందేహాలను నివృత్తిచేయడానికి ఒకటికి రెండు సార్లు సీడబ్ల్యూసీకి ఈ నివేదికలు సమర్పిస్తున్నట్టు తెలుస్తోంది.ఇటు నమూనా అధ్యయన నివేదికల కోసం, అటు నాణ్యతా నిర్ధారణ పరీక్షల నివేదికల కోసం సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఒక్కో దశలో రీయంబర్స్‌మెంట్ నిధులు సకాలంలో రాకపోవడం వల్ల ఇంజనీర్లు న్యూఢిల్లీ వెళ్లి రావడానికి కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ మన ఇంజనీరింగ్ శక్తి సామర్ధ్యాలను మనం సక్రమంగా వినియోగించుకోకపోవడం, చిత్తశుద్ధి లోపం కారణంగా ఉన్న శక్తిని వదిలేసి రూ. కోట్లు వెచ్చించి పరాయి ప్రాంతాల్లో అధ్యయనాలను కొనుక్కోవాల్సిన పరిస్థితి తప్పడంలేదు