కర్నూలు, మే 16, (way2newstv.com)
తాజాగా జరిగిన ఎన్నికల్లో పలువురు సీనియర్ నాయకులు తమ వారసులను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఇప్పటికే 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న నాయకులు తాజా ఎన్నికల్లో తమ పుత్రులను రంగంలోకి దింపారు. ఇలాంటి వారిలో ప్రముఖ నాయకుడు, కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన కేఈ కృష్ణమూర్తి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో తన కుమారుడుని రంగంలోకి దింపారు. కేఈ శ్యాంబాబు ఇక్కడ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. ఇక, వైసీపీ తరఫున ఇక్కడ నుంచి దివంగత చెరుకులపాడు నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి బరిలో నిలిచారు. అయితే, వైసీపీ సమన్వయ కర్తగా ఉన్న సమయంలోనే ఇక్కడ చెరుకులపాడు హత్యకు గురయ్యారు.ఈ హత్య విషయంలో శ్యాంబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు, వైసీపీ ఇప్పటికే శ్యాంబాబును విచారించాలనే డిమాండ్ చేస్తోంది. ఇక, ఎన్నికల విషయానికి వస్తే.. డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ తన కుమారుడి గెలుపును ప్రతిష్టా త్మకంగా భావించారు.
కేఈ వేరు... శ్యాంబాబు వేరయా...
ఎట్టిపరిస్థితిలోనూ గెలిపించుకోవాలనే కసితో ప్రయత్నించారు. తానే స్వయంగా ప్రతి ఒక్కరినీ కలిశారు. ఇక, వైసీపీ తరఫున చెరుకులపాడు శ్రీదేవి కూడా గట్టిగానే పోటీ చేశారు. వైసీపీ అధినేత జగన్ ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనే తొలి సీటుగా శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇక శ్రీదేవి తన భర్త మరణానికి కారకుడైన శ్యాంబాబును ఓడించాలని ఆమె ప్రచారంలో విమర్శలు గుప్పించారు. హోరా హోరీగా సాగిన పోరులో ఎవరిది పైచేయి అనే విషయానికన్నా కూడా కేఈ శ్యాంబాబుకు ఎదురైన ప్రతికూల గాలులపైనే ఎక్కువగానే చర్చ జరిగింది.వాస్తవానికి జగన్ ప్రకటించిన తొలి అభ్యర్థి కూడా చెరుకుల పాడు శ్రీదేవి కావడంతో ఆమె రెండేళ్లుగా నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రజల్లోకి వెళ్లింది. దీనికితోడు జగన్ కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇరు పక్షాలూ జోరుగానే ముందుకు సాగాయి. సానుభూతి పవనాలు తనకు తోడుగా ఉన్నాయని శ్రీదేవి… అధికారం మొత్తం తమ చేతిలోనే ఉందని కేఈ ఇలా ఎవరికి వారు తమ అంచనాలు తాము వేసుకున్నారు. ఎన్నికల్లోనూ పోలింగ్ ఆశించిన విధంగానే జరగడం కూడా ఇరు పక్షాల్లోనూ గెలుపు గుర్రం ఆశలు పెరిగాయి. అయితే, మహిళా సెంటిమెంట్, నారాయణ రెడ్డి హత్య పరిణామాలు, జగన్ మ్యానియా వంటివి ఇక్కడ శ్రీదేవి గెలుపు ఖాయమనే వ్యాఖ్యలు వినిపించేలా చేయడంతో కేఈ కుమారుడు ఎదురీదక తప్పలేదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక పత్తికొండలో గత కొన్ని దశాబ్దాలుగా కేఈ ఫ్యామిలీ హవా ఉన్న మాట వాస్తవమే అయినా కేఈ.కృష్ణమూర్తికి ఉన్న క్రేజ్ శ్యాంబాబు లేకపోవడంతో ఈ సారి ఆయన గెలుపు సులువు కాదన్న చర్చలు కూడా కర్నూలు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. టీడీపీ వీరాభిమానులు సైతం
ఇక్కడ తమ పార్టీ గెలుపు 50-50 అని చెపుతున్నారంటే వైసీపీ నుంచి ఎంత గట్టి పోటీ ఎదురైందో ? తెలుస్తోంది.
Tags:
political news