నెల్లూరు, మే23 (way2newstv.com):
సెలవుల్లో మధ్యాహ్న భోజనం కొనసాగించటం ద్వారా పేద విద్యార్థుల కడుపు నింపాలనేది ప్రభుత్వం ఆలోచన. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నిర్వాకం కారణంగా అది కాస్తా దెబ్బతింది. కరవు మండలాల్లో ఉపశమన చర్యల్లో భాగంగా వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు భోజనాన్ని అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అమలు చేస్తున్నారు.మరోవైపు జిల్లాలో మెజారిటీ పాఠశాలల తలుపులు కూడా తెరవటం లేదు. భోజనాన్ని వండి వార్చే ఏజెన్సీలు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కూడా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. లక్షల సంఖ్యలో విద్యార్థులుంటే వేల సంఖ్యలోనే హాజరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం చేసిన ప్రయోగం ఒక విధంగా నీరుగారే ప్రయత్నం ఏర్పడింది.
మధ్యాహ్నానికి సెలవ్.. (నెల్లూరు)
కరవు నేపథ్యంలో అందరికీ సెలవుల్లోనూ భోజనం అందించాలి. అందుకు అనుగుణంగా నిర్వహణ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులకు సమాచారం అందించి.. భోజనం కోసం వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ ఏడాది ఎలాంటి అవగాహన కల్పించలేదు. సెలవులు ఇచ్చిన వెంటనే పాఠశాల తలుపులు మూసేశారు. కొన్ని చోట్ల విద్యార్థులు వస్తున్నా.. ఏజెన్సీలు తక్కువ సంఖ్యలో ఉండటంతో తిప్పి పంపేస్తున్నారు. దీంతో రోజురోజుకూ భోజనానికి వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. విద్యార్థులు నిర్దేశిత సమయానికి వచ్చి భోజనం చేసి వెళ్తే సరిపోతుంది. విద్యాశాఖ లెక్కల ప్రకారం రోజుకు 2.13 లక్షల మంది విద్యార్థులకు భోజనం పెట్టాలి. ప్రస్తుతం రో జుకు సుమారు 12 వేల మందికి మాత్రమే అందిస్తున్నారు. మొదట్లో సంఖ్య సుమారు 20 వేల వరకు ఉన్నా.. ఏజెన్సీలు భోజనం వండిపెట్టడానికి ఆసక్తి చూపటం లేదు. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయటానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపకుంటే.. సంబంధిత పాఠశాల నిర్వహణ కమిటీలు ఒక తీర్మానం చేసి పంపాల్సి ఉంది. జిల్లాలో అలాంటి తీర్మానాలు లేకుండానే పథకం నిర్వీర్యంగా మారింది.విద్యార్థులే భోజనం కోసం రావటం లేదని ఏజెన్సీలు చెప్పటం గమనార్హం. పాఠశాలలకు సెలవులు ఇవ్వటానికి ముందే ప్రభుత్వం కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే విషయాన్ని విద్యార్థులకు అందించటంలో కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆసక్తి చూపలేదు. సమాచారం లేక పాఠశాలల్లో చదివే పిల్లలను పంపటం లేదు. కొన్ని పాఠశాలలకు వస్తున్నా.. గిట్టుబాటు కావటం లేదన్న సాకుతో తిప్పి పంపేస్తున్నట్లు తెలుస్తోంది.