నకిలీ విత్తు వచ్చేస్తోంది (కర్నూలు)

కర్నూలు, మే23  (way2newstv.com): 
ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నకిలీ పత్తి విత్తనాలను వక్ర మార్గంలో విక్రయించేందుకు దళారులు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే మంత్రాలయం, కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం మండలాల్లో ఏజెంట్ల వద్దకు విత్తనాలను చేరవేశారు. సీజన్‌ ఆరంభంలో రైతులకు అందుబాటులో ఉంచి తక్కువ ధరకు అమ్మకాలు చేసి సొమ్ము చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెలాఖరులోపు వీటిని విక్రయించనున్నారు.పత్తి విత్తనాలను తయారు చేసే కంపెనీలు కొంత మంది రైతులతో ఒప్పందం చేసుకుని విత్తన పత్తిని సాగు చేస్తారు. సాగు చేసిన పంట దిగుబడులను ఆ కంపెనీలకు ఇవ్వాలి. వారు దూది, విత్తనాలను వేరు చేసి ల్యాబ్‌లో పరీక్షించి వ్యవసాయ శాఖ అనుమతితో మార్కెట్లోకి విక్రయిస్తారు. ఆయా కంపెనీలకు చెందిన విత్తనాలు 450 గ్రాములు కనీసం రూ.800 వరకు ఉంటాయి. ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులు కొందరు కంపెనీలకు కొంత పత్తిని పంపి మిగిలిన వాటిని సొంతంగా జిన్నులో విత్తనాలను వేరు చేయిస్తారు. శుద్ధి చేసిన విత్తనంలా రంగు పూసి వాటిని నకిలీ ప్యాక్‌లకు చేరుస్తారు. 

నకిలీ విత్తు వచ్చేస్తోంది (కర్నూలు)

ఏమాత్రం తేడా లేకుండా ఉండే విత్తనాలను రూ.1200 నుంచి రూ.1500లకే రైతులకు అమ్మేస్తారు. తక్కువ ధరకు వస్తుందని ఆశ పడిన రైతు వాటిని కొనుగోలు చేసి మోసపోవాల్సి వస్తోంది. ఒరిజినల్‌ విత్తనాలు ల్యాబ్‌ వెళ్లిన తర్వాత బయటకు రావు. అయితే నకిలీ విత్తనాలు మాత్రమే ఉంటున్నట్లు తెలుస్తోంది.కంపెనీ శుద్ధి చేసి ప్రభుత్వం అనుమతించిన విత్తనాలను నాటితే ఎకరానికి కనీసం 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తోంది. నకిలీ బీటీ విత్తనాలను సాగు చేయడంతో మూడు నుంచి ఐదు క్వింటాళ్ల మధ్య దిగుబడి వస్తోంది. దీంతో పెద్ద ఎత్తున రైతు మోసపోతున్నారు. దీనికితోడు పర్యావరణానికి పూర్తిగా హాని కలిగిస్తోంది. నియోజకవర్గంలో ఏటా ఖరీఫ్‌లో వర్ష పాతం తక్కువగా ఉంటుంది. దీన్నే సాకుగా చూపి కొనుగోలుదారులు దిగుబడి రాకపోవడానికి వర్షాలే కారణమని రైతులను నమ్మ బలికిస్తారు. దీంతో రైతు మోసపోవాల్సి వస్తోంది. బయ్యర్లు నకిలీ విత్తనాలను విక్రయించేందుకు పెద్ద ఎత్తున పన్నాగం చేస్తారు. ఇందులో ముఖ్యంగా పండించిన పంట మొత్తాన్ని కంపెనీకి పంపరు. అందులో కొంత పత్తి, నాసిరకం పత్తిని కలిపి జిన్నింగ్‌ చేస్తారు. ఇవి కంపెనీ విత్తనాల సైజుల్లో ఉంటాయి. దీంతో రంగు కలిపి ప్యాక్‌ చేసి తక్కువ ధరకు విక్రయిస్తారు. జిన్నింగ్‌ చేసేది మాత్రం కర్నూలు, ఎమ్మిగనూరు, తెలంగాణాలోని ఐజ, గద్వాల ప్రాంతాల్లో నకిలీ కొనుగోలుదారులు విత్తనాలను వేరుచేయిస్తారు. అక్కడి నుంచి ప్యాక్‌ చేసి నేరుగా వారి ఏజెంట్లకు పంపుతారు. ఇవి ఏమాత్రం ల్యాబ్‌ టెస్టింగ్‌ చేసి ఉండరు.మంత్రాలయం మండలంలో బూదూరు, సూగూరు, వగరూరు, రచ్చుమర్రి, మాలపల్లి, పెద్దకడబూరు మండలంలో జాలవాడి, కమ్మలదిన్నె, నెమలకల్లు, ముచ్చుగిరి, మేకడోణ, దొడ్డిమేకల, కోసిగి మండలంలో పల్లెపాడు, బెలగల్‌, కౌతాళం మండలంలో కౌతాళం, హాల్వి, కామవరం, తోవి, రౌడూరు, నదీచాగి,బాపురం, చూడి, గ్రామాల్లో ఉన్న ఏజెంట్ల ద్వారా విత్తనాలను విక్రయిస్తారు. కర్ణాటక సరిహద్దుల్లో గ్రామాల్లోనూ విక్రయిస్తారు. అక్రమార్కులు అధికంగా ఇక్కడి రైతులను మోసపుచ్చుతున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడా పనిచేశాం అన్నవిధంగా తూతూమంత్రంగా నాలుగు, ఐదు కిలోల విత్తనాలను పట్టుకొని కేసులు పెట్టిస్తారు. పెద్ద మొత్తంలో ఉండేవారి నుంచి ఏమాత్రం పట్టించుకోవడంలేదు. వీరికి నేత అండగా ఉండడంతో మరింత సులభంగా మారింది. విత్తనాలకు కచ్చితంగా బిల్లు ఉండేలా చూసుకోవాలని సూచించడం లేదంటే అధికారులు రైతుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ అర్థమవుతోంది.


Previous Post Next Post