అలంకార ప్రాయంగా మారిన తీర గస్తీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అలంకార ప్రాయంగా మారిన తీర గస్తీ

విజయవాడ మే 14, (way2newstv.com)
ఏపీలో సముద్ర తీరం ప్రాంతం ఎక్కువే.  జిల్లాకు సంబంధించినంత వరకూ చూస్తే దాదాపు 111 కి.మీ. సముద్ర తీరం ఉంది. ప్రాధాన్యత దృష్టా జిల్లా కీలక ప్రాంతమే అయినా తీర ప్రాంత రక్షణ, తదితరాల విషయంలో తొలి నుంచి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. ఫలితంగా రూ.కోట్లు వెచ్చించి తీరంలో గస్తీ నిమిత్తం కొనుగోలు చేసిన అధునాతన మెరైన్‌ బోట్లు అలంకారప్రాయంగా మారాయి. ఏడేళ్ల కిత్రం తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కార్యాచరణకు నోచుకోలేదు. మెరైన్‌ స్టేషన్లు, సిబ్బంది నియామకం, గస్తీ కోసం అధునాతన మెరైన్‌ బోట్లు ఏర్పాటు చేసినా అవి అలంకార ప్రాయమయ్యాయి. తీరప్రాంత గస్తీ నిమిత్తం జిల్లాలో మూడు మెరైన్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. తొలిలో మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని గిలకలదిండి, తదుపరి అవనిగడ్డ నియోజకవర్గ పరధిలోని హంసలదీవి వద్ద పాలకాయతిప్పలో ఒక స్టేషన్‌, పెడన నియోజకవర్గంలోని ఒర్లగొందితిప్ప వద్ద మరో స్టేషన్‌ ఏర్పాటయ్యాయి. వాటిలో సిబ్బందిని నియమించారు. ఒక్కో స్టేషన్‌కు ఒక సీఐ, ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ఏడుగురు హెచ్‌సీలు, పది మంది పీసీలు, ఏడుగురు హోంగార్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఠాణాల ఏర్పాటు సమయంలో పర్యవేక్షణ బాధ్యత జిల్లా ఎస్పీ చూసేవారు.


అలంకార ప్రాయంగా మారిన తీర గస్తీ

2011లో ముంబయిలో చోటుచేసుకున్న ఉగ్రదాడితో తీరప్రాంత రక్షణ విషయంలో డొల్లతనం బహిర్గతమైంది. సముద్రతీరం ద్వారా తీవ్రవాదులు చొరబడే అవకాశం కల్పించడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.కళ్లు తెరిచిన పాలకులు తీరంలో నిఘా ప్రాధాన్యత గుర్తించి మెరైన్‌ స్టేషన్ల ఏర్పాటు, గస్తీని పటిష్ఠం చేయడంపై దృష్టి సారించారు. ఇది వాంఛనీయ పరిణామమే అయినా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.  అనంతరం విశాఖపట్టణంలో డీఐజి స్థాయి అధికారి పర్యవేక్షణలోకి వచ్చేలా మెరైన్‌కు సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక విభాగంతో సేవలు మరింత పరిపుష్టం కావాల్సింది పోయి క్రమేపీ నీరుగారిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బడ్జెట్‌ కొరత, పర్యవేక్షణ లేమి వంటి కారణాలతో అసలు లక్ష్యం నీరుగారిపోయే స్థితికి దిగజారిపోతోంది.తీర ప్రాంతం నుంచి కోస్ట్‌గార్డ్‌ పరిధి వరకూ గస్తీ నిర్వహించాల్సి బాధ్యత మెరైన్‌ స్టేషన్లపై ఉంటుంది. అందుకోసం ప్రత్యేకించి అధునాతన బోట్లను సమకూర్చారు. గిలకలదిండి స్టేషన్‌ కోసం మూడు బోట్లను కేటాయించారు. పాలకాయతిప్ప, ఒర్లగొందితిప్ప స్టేషన్లకు బోట్లు ఇవ్వలేదు. గిలకలదిండి స్టేషన్‌కు పేరుకు మూడు మైరెన్‌ బోట్లు ఇచ్చినా ఆది నుంచి అవి అలంకార ప్రాయానికే పరిమితమవుతన్నాయి. కొన్ని నెలల పాటు బడ్జెట్‌ కేటాయింపులు సక్రమంగా లేకపోవడంతో బోట్లకు అవసరమైన డీజిల్‌ కోనుగోలులో ఇబ్బందులు గస్తీకి అడ్డంకి అయ్యాయి. కొన్ని నెలలపాటు టెక్నికల్‌ క్రూ లేకపోవడం, మరికొంత కాలం బోట్లు రిపేర్లు.. ఇలా ఏదో ఓ కారణంతో ఎక్కువ రోజులపాటు బోట్లు ఎటూ కదలకుండా తీరానికే పరిమితం అవుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో బడ్జెట్‌ కొరత లేకపోయినా సాంకేతిక పరమైన అంశాలు ప్రతిబంధకంగా మారాయి. బోట్లు మరమ్మతులకు గురైన సమయంలో సకాలంలో చర్యలు చేపట్టకపోవడం. నిర్వహణ వైఫల్యం వంటి అంశాలు పరిపాటి అవుతూ వస్తున్నాయి. మెకనైజ్డ్‌ బోట్ల కోసం అనుభవజ్ఞలైన పది మంది సిబ్బంది ఉన్నారు. సంబంధిత బోట్లకు సంబంధించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, మరమ్మతులు, కొన్ని సాంకేతిక పరమైన అంశాల్లో దాదాపు ఎనిమిది నెలలుగా నెలకొన్న అధికారిక నిర్లక్ష్యంతో మూడు బోట్లు ఎటూ కదలకుండా తీరంలోనే నిలిచి ఉంటున్నాయి. వాటికి ఎప్పుడు మోక్షం కల్పిస్తారన్న విషయంలోనూ నేటికి సరైన స్పష్టత లేదు. అవసరాన్ని బట్టి పాలకాలయ తిప్ప, ఒర్లగొందితిప్ప స్టేషన్లకు కూడా ఈ మూడు బోట్లే దిక్కుగా ఉన్నాయి. ఇవి మూలకు చేరుకోవడంతో అత్యవసరం అయితే ప్రైవేటు బోట్లను ఆశ్రయించక తప్పదు. వాస్తవంగా ప్రతి రోజూ నిర్ధిష్ట సమయంలో బోట్లు తీరప్రాంత జలాల్లో గస్తీ తిరగాల్సి ఉంటుంది. బోట్లు మూలకు చేరడంతో గస్తీ ఏ మేరకు సాగుతుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం అమల్లో ఉంది. పర్యవేక్షణలో భాగస్వాములుగా ఉండాల్సిన మెరైన్‌ సిబ్బంది ఎలా నిఘా కొనసాగిరస్తాన్నది కూడా ప్రశ్నార్థకమే. తరచూ తీరప్రాంతంలో ఏదో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్న పరిస్థితుల్లో మెరైన్‌ వ్యవస్థ ఉత్సవ విగ్రహంలా మారడం ఆందోళన కలిగించే అంశం అవుతోంది. ఒకవేళ జరగరాని దుస్సంఘటన ఏదైనా చోటుచేసుకుంటే అందుకు ఎవరు జవాబుదారి అన్నది ప్రశ్నార్థకం అవుతోంది.