సిక్కోలు సెంటిమెంట్ వర్క అవుట్ అవుతుందా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిక్కోలు సెంటిమెంట్ వర్క అవుట్ అవుతుందా

శ్రీకాకుళం, మే 14, (way2newstv.com)
ఏపీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కాకుండా రాష్ట్ర ప్రజలు అందరూ ఆంధ్రప్రదేశ్ నెక్ట్స్‌ ముఖ్యమంత్రి ఎవరు ? అని తెలుసుకునేందుకు 23వ తేదీ ఎప్పుడు వస్తుందా ? అని కళ్ళల్లో వత్తులు వేసుకుని మరి వెయిట్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు మరి కొద్ది రోజుల సమయం ఉండడంతో నియోజకవర్గాల వారీగా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది సెంటిమెంట్లను నమ్ముకుంటే మరికొంతమంది ఆ సెంటిమెంట్లు తమను ఎక్కడ ముంచుతాయోన‌ని కాస్త ఆందోళనతో ఉంటున్నారు. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి 7 ఎమ్మెల్యే సీట్లతో పాటు శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని అవలీలగా గెలుచుకుంది. వైసిపి 3 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ మూడు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు.ఇక ఈ ఎన్నికల్లో టిడిపి, వైసిపి మధ్య అన్ని నియోజకవర్గాల్లోనూ హోరా హోరీ పోరు నడిచింది. ఇక శ్రీకాకుళం జిల్లాలో నుండి విజయనగరం లోక్‌స‌భ పరిధిలో ఉన్న రాజాం నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. 


సిక్కోలు సెంటిమెంట్ వర్క అవుట్ అవుతుందా

గత కొన్ని సంవత్సరాలుగా రాజాం నియోజకవర్గం సెంటిమెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం… లేదా ఇక్కడ ఓడిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరుగుతూ వస్తోంది. 1989లో అప్పటి ఉణుకూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు విజ‌యం సాధిస్తే అందుకు విరుద్దంగా రాష్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. 1994లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పాలవలస రాజశేఖరం గెలిస్తే రాష్ట్రంలో టిడిపి అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 26 సీట్లతో సరిపెట్టుకుంటే అందులో పాలవలస రాజశేఖర్ ఒకరు.2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వేచినా ఇక్కడ మాత్రం కళా వెంకటరావు గెలిచారు. ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఉణుకూరు నియోజకవర్గం రద్దయ్యింది. రాజాం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా అవతరించింది. ఈ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోండ్రు మురళీమోహన్ విజయం సాధించగా రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ నుంచి గెలిచిన కోండ్రు మంత్రి కూడా అయ్యారు. తాజా ఎన్నికల్లో మరోసారి కొండ్రు టిడిపి నుంచి పోటీ చేయగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు బరిలో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ సీనియర్ నేత ప్రతిభా భారతి ఓడిపోగా… రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కంబాల జోగులు కేవలం 420 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో రాజాం ఫలితం ఎలా ఉండబోతోంది అన్నది సహజంగానే ఆసక్తిగా మారింది. పాత సెంటిమెంట్ రిపీట్ అవుతూ ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదా ? లేదా పాత సెంటిమెంట్‌కు రాజాం ఓట‌రు చెక్ పెడుతూ రాష్ట్రంలో గెలిచిన పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిపిస్తారా ?అన్నది చూడాలి.