అమరావతిలో రియల్ ఢమాల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమరావతిలో రియల్ ఢమాల్

విజయవాడ, మే 5, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల ధరలు ఢమాల్ అన్నాయి. నిన్న మొన్నటి వరకూ పరుగులు తీసిన రియల్ ఎస్టేట్ రంగం గత రెండు నెలల నుంచి పూర్తిగా తగ్గుముఖం పట్టిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. క్రయ, విక్రయాలు పూర్తిగా మందగించాయి. రిజిస్ట్రేషన్లు కూడా పెద్దగా జరగడం లేదు. దీనికంతటికీ కారణం ఎన్నికలేనని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు చెబుతున్నారు. దీంతో అమరావతిలో స్థిరాస్థి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. వెంచర్ల దగ్గరకు వచ్చి చూసిపోయే వారు కూడా లేరంటున్నారు.ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ రంగంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకు లబ్దిచేకూరుతుందన్న చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందన్న అంచనాల్లో వారున్నారు. ఎన్నికల ముందు వరకూ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగానే ఉంది. 


అమరావతిలో రియల్ ఢమాల్

అయితే ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటున్నారు. జగన్ తాను అధికారంలోకి వస్తే అవసరానికి మించి రాజధాని కోసం తీసుకున్న భూములను తిరిగి ఇస్తాననిచెప్పడంపై కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెద్దయెత్తునచర్చ జరుగుతోంది. ఇదే జరిగితే రాజధానిలో రియల్ ఎస్టేట్ పుంజుకోదన్న ఆందోళనలో వారున్నారు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి రాజధాని అమరావతిలో నిర్మాణ కార్యకలాపాలు స్పీడ్ పెరిగాయి. జ్యుడిషియల్ కాంప్లెక్స్ లో హైకోర్టు వచ్చింది. దీంతో సమీప గ్రామాల్లోని ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. అలాగే సచివాలయం టవర్లు, ఇబ్రహీంపట్నంనుంచి పవిత్ర సంగమం వరకూ కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయడంతో రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల శాశ్వాత నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. సచివాలయ సిబ్బంది, ఎమ్మెల్యలే గృహనిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. దీంతో పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దయెత్తున వెంచర్లు వేశాయి.అయితే నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిపోయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఐటీ దాడులు జరిగే అవకాశముండటంతో ప్లాట్ల కొనుగోళ్లకు ఎవరుముందుకు రాలేదు. పారిశ్రామికవేత్తలు సయితం స్థిరాస్థి కొనుగోళ్లను నిలిపేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ స్థిరాస్థి కొనుగోళ్లు, విక్రయాలు పూర్తిగా మందగించాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా బాగా తగ్గుముఖం పట్టింది. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు దీరితే ఒక క్లారిటీ వస్తుందని, అప్పుడే కొనుగోలుచేయవచ్చని అనేక మంది ఆగారని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు చెబుతున్నారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా రియల్ ఎస్టేట్ ఇక్కడ దెబ్బ తినే అవకాశం లేదని మరికొందరంటున్నారు. మొత్తం మీద ఎన్నికల దెబ్బకు అమరావతి ఢమాల్ అయిందన్నది వాస్తవం