నేతల మధ్య సర్జికల్ స్ట్రైక్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నేతల మధ్య సర్జికల్ స్ట్రైక్స్

న్యూఢిల్లీ, మే 5, (way2newstv.com)
రాజకీయ పార్టీల విషమ రాజకీయ క్రీడలో సైనిక దాడులూ ప్రధానాంశంగా మారాయి. ప్రధాని మోడీ సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రజలలోకి బాగా తీసుకెళ్లారు. కౌంటర్ గా కాంగ్రెసు బరిలోకి దిగింది. తమ హయాంలో రహస్యంగా అరడజను దాడులు పాకిస్తాన్ పై చేశామంటూ ప్రకటించింది. ఇదంతా పవర్ రేసులో ఫస్టు మార్కులు కొట్టేసేందుకే. అందలమెక్కేందుకు అన్నీ ముడిసరుకులే. తరతమ బేధాలు లేవు. భావోద్వేగాలు మొదలు ప్రాంతీయ విద్వేషాల వరకూ దేనికైనా సరే. మత ఘర్షణల నుంచి దేశభక్తి వరకూ దేన్నైనా వాడేసుకోవడమే. రెండు జాతీయ పార్టీలు ఈ విషయంలో పోటీలు పడుతున్నాయి. ఓటు వేసే ముందు పుల్వామాను గుర్తు చేసుకోమంటారు ఒక అగ్రనేత. మొదటి ఓటును సైనికుల తర్పణకు బదులివ్వమంటాడు. తద్వారా తాను ప్రాతినిధ్యం వహించే పార్టీ కి అడ్వాంటేజ్ కల్పించాలనేదే ఎత్తుగడ. సైనిక త్యాగాలను, యుద్ధవిజయాలను, రక్షణ అవసరాలను ఎన్నికలతో ముడిపెట్టకూడదన్న కనీస ఇంగితం గాలికెగిరి పోతుంది. కాదేదీ రాజకీయానికి అనర్హం అని నిరూపిస్తున్నారు మన నేతలు. పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు తమ ఘనతే అంటూ భారీ ప్రచారం చేసుకుని ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తోంది బీజేపీ.


నేతల మధ్య సర్జికల్ స్ట్రైక్స్

తాము ఎక్కడ వెనకబడిపోతామోనని కాంగ్రెసు కొత్త విషయాలను వెలికి తెచ్చింది. 2008 నుంచి 2013 మద్యకాలంలో కాంగ్రెసు ఆరుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగా హస్తం పార్టీ హడావిడి చేస్తోంది. సైనిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు చాలా సున్నితమైనవి. వాటిని చాలావరకూ రహస్యంగా ఉంచాలి. డబ్బా కొట్టుకోవడం అంటే మనం నడి బజారులో నిలుచోవడమే. ప్రత్యర్థి దేశంపై పైచేయిసాధించడమే లక్ష్యంగా ఉండాలి. భయపెట్టడమే టార్గెట్ గా పెట్టుకోవాలి. అంతేగానీ టాం టాం చేసుకోవడం కాదు. లేకపోతే విదేశాంగ విధానంలో ఎదురుదెబ్బ తింటాం. మరోవైపు మన రక్షణ రహస్యాలు లీకయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు వాటితో అవసరం లేదు. దేశ రక్షణ అన్నది వారికి ఒక రాజకీయాంశం. సైనికుల సాహసం వారికొక సమర్థ ఓటు యంత్రం. వారి ప్రాణత్యాగం పొలిటికల్ ఇన్ స్ట్రుమెంట్. గడచిన దశాబ్దకాలంగా ఈ మార్పు కనిపిస్తూనే ఉంది. ఇటీవల అది మరింత పెరిగి పెద్దదై పోయింది. ఏ విమానంతో ఎక్కడ దాడి చేసిందీ షూట్ చేసి మరీ టీవీలకు ఇస్తున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం. మన లక్ష్యం ప్రచారమా? ప్రత్యర్థిని కంట్రోల్ చేయడమా? అసలు ఉద్దేశం దెబ్బతింటోంది. అధికారవిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ దాడుల్లో పాల్గొన్న సైనికుల నైతిక స్థైర్యానికే దెబ్బతగులుతోంది.ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ ను విడగొట్టగలిగాం. దేశమంతా ఆమెకు హారతులు పట్టారు. వాజపేయి కాలంలో కార్గిల్ యుద్దం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఎన్డీఏకు ఘనవిజయం సాధించింది. ఏనాడూ అటల్ తన గొప్పతనాన్ని క్లెయిం చేసుకోలేదు. అయినా ప్రజలు జయహో వాజపేయి అంటూ ఆశీర్వదించారు. అధికారమనేది ఒక అదనపు ప్రయోజనమే తప్ప అసలు లక్ష్యం కాకూడదు. దేశ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకునే పార్టీలను ప్రజలు ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంటారు. అధికార పీఠంపై కూర్చోబెడుతూనే ఉంటారు. అయితే దానికోసం రాజకీయ పార్టీలు అర్రులు చాచాల్సిన అవసరం లేదు. పవర్ లో ఉన్నప్పుడు దేశరక్షణ కోసం సమర్థ చర్యలు తీసుకోవడం బాధ్యతగానే భావించాలి. బహిరంగంగా క్లెయిం చేసుకుని జబ్బలు చరచుకోవాల్సిన సంగతి కాదు. ఓట్ల కోసం, అధికారం కోసం యుద్ధానికైనా తెగిస్తారనే చెడు సంకేతం ఎవరికీ శ్రేయోదాయకం కాదు. ఇప్పటికే పొరుగున ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ భారత్ లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. ఉన్నవి లేనివి కలిపి దాడులను భూతద్దంలో చూపుతారులే అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రత్యర్థికి భారత నాయకులు ఎంతగా చులకనై పోతున్నారో అర్థమవుతుంది. నాయకులపై చిన్నచూపు ఉంటే ఫర్వాలేదు. సైనికులపైనా , మన దేశం చేసిన దాడులపైనా లేకి వ్యాఖ్యలు చేసేందుకు తెగిస్తున్నారు. ఇది సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. రాజకీయ పోరులో ఉచ్ననీచాలు మరిచిపోయి పై చేయిసాధించాలనుకుంటే నేతలకు ప్రజల చేతిలో పరాభవం తప్పదు. బీజేపీ, కాంగ్రెసు రెండు పార్టీలూ గ్రహించాల్సిన సత్యమిది.ఒకవైపు గడ్డకట్టే శీతల శిఖరాలపై… మండుటెండల ఎడారి ఇసుక పొరలపై …లోయలలో కటిక చీకటి చాయలలో ..ప్రాణాలు అరచేత పట్టుకుని దేశాన్ని రక్షిస్తారు సైనికులు. వారికి దేశమే కుటుంబం, తనతో కలిసి తుపాకి పట్టిన మరో సైనికుడే బంధువు,మిత్రుడు. ఏ క్షణాన అయినా ప్రాణాలు తీసేందుకు, అవసరమైతే ప్రాణాలు బలి ఇచ్చేందుకు సదా సిద్ధం. దేశమాత దాస్య శ్రుంఖలాలలో చిక్కుకోకుండా రక్త తర్పణతో కాపాడుతూ ఉంటారు. సదా పహరా కాస్తుంటారు. అందుకే జై జవాన్ అని నినదించిందీ గడ్డ. నీరాజనాలు అర్పించింది. ఆత్మత్యాగం, అనవరత సేవా నిరతి, క్రమశిక్షణ, దేశ భక్తి , మహనీయుల స్ఫూర్తి సైనిక శక్తిని నడుపుతూ ఉంటాయి. కుత్సిత రాజకీయ కుంపట్లోకి వారిని లాగకండి. కులమతాల రొచ్చులోకి దింపకండి. అదే జరిగితే మరోసారి దేశం బానిస గుప్పిళ్లలో చిక్కుకుంటుంది. జవానుల మనోభావాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకుండా సంయమనం పాటించడం రాజకీయ పార్టీల విహిత కర్తవ్యం. సైనిక విజయాలను బోర విరుచుకుని ప్రకటించుకుంటూ బొక్కసంలో ఓట్లు నింపుకోవాలనుకునేవారు దూరద్రుష్టితో యోచించాలి. రాజకీయ ప్రయోజనాలకు దూరంగా కొన్నిటినైనా వదిలేస్తేనే దేశానికి విశాల హితం సమకూరుతుంది.