జెయింట్ కిల్లర్ గా అరవింద్

నిజామాబాద్, మే 28 (way2newstv.com)

దిగ్గజాలకు మారుపేరుగా నిలిచే నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ధర్మపురి అరవింద్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై నూతన ఒరవడిని సృష్టించారు. పక్కా ప్రణాళికను రూపొందించుకుని, అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో వాటిని అధిగమిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఢీకొని విజయబావుటాను ఎగురవేయడంతో ఆయన అనుచరుల అంచనాలు పతాకస్థాయికి చేరాయి. అరవింద్ ఘనతను బీజేపీ అధినాయకత్వం గుర్తించి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం లేకపోలేదని పలువురు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం నిజామాబాద్ సభకు హాజరైన సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని, అరవింద్‌ను ఎన్నికల్లో గెలిపిస్తే ప్రధాని మోదీకి లెఫ్టినెంట్‌గా ఉంటారని హామీ ఇచ్చారని అనుయాయులు ప్రస్తావిస్తున్నారు. అయితే బీజేపీ సీనియర్ నేతగా ఉన్న కిషన్‌రెడ్డి సైతం సికిందరాబాద్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికవడంతో అధిష్టానం తెలంగాణకు అవకాశం కల్పించాలని భావిస్తే, ముందుగా ఆయన వైపే మొగ్గు చూపుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 


జెయింట్ కిల్లర్ గా అరవింద్
ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ, అధికార తెరాస పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను 70వేల పైచిలుకు మెజారిటీతో ఓడించి పోటీ చేసిన తొలిసారే ఎంపీగా ఎన్నికైన ఘనతను అరవింద్ దక్కించుకోగలిగారు. నిజానికి బీజేపీలో ఆయన చేరి రెండు సంవత్సరాలు కూడా పూర్తికాక ముందే పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని దక్కించుకుని, అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తొలిసారి నిజామాబాద్ స్థానం నుండి పార్టీకి విజయాన్ని అందించడంలో కృతకృత్యులయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా చెలామణి అవుతున్న రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ, ఆయన తనయుడైన ధర్మపురి అరవింద్ మాత్రం అనూహ్యంగా 2017 సెప్టెంబర్ 17వ తేదీన రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో బీజేపీలో చేరడం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామం వల్లనే డీఎస్‌పై స్థానిక తెరాస వర్గాలు అసమ్మతి నేతగా ముద్రవేస్తూ ఆయనను పార్టీకి దూరం చేశాయి. బీజేపీలో చేరడానికి ముందే ప్రధాని నరేంద్రమోదీ పట్ల అరవింద్ అచంచల భక్తిప్రపత్తులను చాటుతూ భారీ ఎత్తున పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా బీజేపీ ముఖ్య నేతల దృష్టిని ఆకర్షించగలిగారు. అరవింద్ చేరికతో జిల్లాలో బీజేపీ మరింత బలపడగా, వలసలను ప్రోత్సహిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. మొదటి నుండే తాను నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీకి దిగుతున్నట్టు అనుచరుల ద్వారా విస్తృత ప్రచారం చేయించారు. అందుకు అనుగుణంగానే సిట్టింగ్ ఎంపీ కవిత వైఫల్యాలను ఎండగట్టేందుకు వినూత్న పద్ధతులను ఎంచుకుని ప్రజల దృష్టిని ఆకర్షించారు. నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకుంటామని 2014 ఎన్నికల్లో తెరాస చేసిన ప్రధాన హామీని నెరవేర్చని వైనాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ జగిత్యాల నుండి బోధన్ వరకు 11రోజుల పాటు పాదయాత్ర జరిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా కేవలం గుంతలు తవ్వి వదిలిపెట్టిన ప్రాంతంలో దాగుడుమూతల ఆటలు ఆడి వినూత్న రీతిలో నిరసన చాటారు. అలాగే మిషన్ భగీరథ పథకంలో అవినీతిని వెలికితీసేందుకు ‘పుంగీ బజావో’ పేరుతో పోటీని ఏర్పాటు చేసి, అవినీతిని వీడియోల రూపంలో వెలుగులోకి తెచ్చిన వారిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇలా స్థానికంగా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే, బీజేపీ ముఖ్య నేతలను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఈ పరిణామాలన్నీ అరవింద్‌ను అనతికాలంలోనే బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపునకు దోహదపడ్డాయని భావిస్తున్నారు.
Previous Post Next Post