ఉప్పునీరే దిక్కు.. (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉప్పునీరే దిక్కు.. (కృష్ణాజిల్లా)

కలిదిండి, మే16 (way2newstv.com):
జిల్లాతో పాటు రాష్ట్రానికి మెరుగైన ఆదాయం ఇస్తోన్న కలిదిండి మండలం ఇప్పుడు తాగునీటి కొరతతో  కటకటలాడుతోంది. రొయ్యలు, చేపల చెరువులు విస్తారంగా పెరిగిపోవడంతో భూగర్భ జలాలు ఉప్పుమయంగా మారుతున్నాయి. కైకలూరు, కలిదిండి, కృత్తివెన్ను మండలాల్లోని ఉప్పుటేరును ఆనుకుని ఉన్న తీరవాసుల పరిస్థితి మరింత దయనీయం. గ్రామాల్లో తాగునీటి చెరువులు లేవు. చుట్టూ నీరున్నా తాగడానికి పనికి రావు. దీనికి ప్రత్యామ్నాయం చూపడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ఉప్పుటేరు వెంబడి కృష్ణా- పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 30 గ్రామాలకు పైగా ఉన్నాయి. 50 వేల వరకు జనాభా ఉన్నారు. ఏటికి ఆనుకుని కైకలూరు, కలిదిండి మండలాల్లో 15 వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. ఈ లెక్కలు అధికారంగా ఉన్నప్పటికీ అనధికారికంగా మరో నాలుగు వేల ఎకరాల్లో సాగవుతోంది. దీనికి తోడు మండలానికి ఒకవైపు ఉప్పుటేరు, మరోవైపు పెదలంక డ్రెయిన్‌ సముద్రంలో కలవడం, సముద్రపు నీరు ఆటుపోట్ల సమయంలో ఈ ఏరుల్లో కలవడం వల్ల ఈ ప్రాంతంలో ఉప్పుశాతం గణనీయంగా పెరిగిపోయింది. 


ఉప్పునీరే దిక్కు.. (కృష్ణాజిల్లా)

రాన్రాను భూగర్భ జలాలు ఉప్పుమయంగా మారాయి. స్వచ్ఛమైన కొల్లేటి నీటితో అలరారే ఈ ప్రాంతాన్ని ప్రభుత్వమే నేరుగా ఉప్పుతీరంగా పరిగణిస్తోందంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అంచనా వేయొచ్ఛుఐదేళ్ల క్రితం కలిదిండి మండలాన్ని ఉప్పుమండలంగా ప్రభుత్వం గుర్తించిందని ప్రకటించారు. ఇందులో భాగంగా 20 గ్రామాలకు తాగునీరు అందించే దిశగా రూ.80 కోట్లతో భారీ సామూహిక రక్షిత పథకాన్ని నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి చెరువు తవ్వకానికి అవసరమైన స్థలాన్ని కూడా పరిశీలించారు. ఇప్పటికీ ఆ ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు. అది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడంతో మండల వాసుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కలిదిండి మండలం తాడినాడలో రూ.13 కోట్ల అంచనాతో సామూహిక రక్షిత పథకం నిర్మాణాన్ని చేపట్టారు. దీనిద్వారా తాడినాడ, చినతాడినాడ, పోతుమర్రు పంచాయతీ పరిధిలోని 11 గ్రామాలకు తాగునీటిని అందించాలన్నది ప్రధాన లక్ష్యం. దీనికి 2017 అక్టోబరులో భూమిపూజ చేశారు. 40వేల లీటర్ల సామర్థ్యంతో 100 అడుగుల ఎత్తు ఓవర్‌హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారు. 6.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఐ.భీమవరంలోని వెంకయ్య వయ్యేరు కాల్వనుంచి పైపులైన్ల ద్వారా తాగునీటిని ఈ గ్రామాలకు అందించాలని ప్రతిపాదించారు. అది ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉంది.తాడినాడ మంచినీటి పథకం పూర్తికాకపోవడంతో ఏటితీరాన నివాసం ఉంటున్నవారికి ఈ ఏడాదీ పడవ ప్రయాణం తప్పడం లేదు. మండలంలోని తాడినాడ పంచాయతీ శివారు సున్నంపూడి, పోతుమర్రు పంచాయతీ పరిధిలోని దుంపలకోడుదిబ్బ, చినతాడినాడ, విభ్రాంపురం గ్రామాల్లోని మహిళలు నిత్యం ఉప్పుటేరులో నాటు పడవపై బిందెలతో వెళ్లి.. సరిహద్దులోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుపాడు, కమతావానిపాలెం, మందపాడు తదితర గ్రామాలనుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. 20 అడుగులకు పైగా లోతుగల ఉప్పుటేరులో ప్రయాణం ప్రమాదమని తెలిసినా.. గొంతు తడవాలంటే ఏరు దాటాల్సిందేనని ఆ గ్రామస్థులు దీనస్వరంతో చెబుతున్నారు. పొరుగు జిల్లావాసులు వేసవిలో నీరివ్వడానికి నిరాకరించే సందర్భాల్లో కాళ్లావేళ్లా పడి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారీ ఉప్పుటేరు తీరవాసులు.