మచిలీపట్నం, మే 3 (way2newstv.com):
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కాలువలు, మంచినీటి వనరులన్నీ ఎండిపోతున్నాయి. చేపల చెరువుల్లో నీళ్లు కనిష్ఠ స్థాయికి పడిపోయి చేపలు మృత్యువాత పడుతున్నాయి. నీరు లేక దేశానికి పోషకాహారాన్ని అందిస్తున్న కృష్ణా జిల్లా మంచినీటి చేపల సాగు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. గత ఏడాది అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదైనా.. పట్టిసీమ నుంచి పెద్దఎత్తున నీటిని తోడుకున్నా.. ఇతర రాష్ట్రాలనుంచి కృష్ణానది ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరినా చేపల రైతుల కష్టాలు మాత్రం గట్టెక్కడం లేదు. ఈసారి సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని నీటి నిల్వల గురించి యంత్రాంగం పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది.ప్రస్తుతం రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్న మత్స్యరంగానికి నీరు కీలకం. చేపల పెంపకానికి అధికారికంగా ఎటువంటి నీటి విడుదల లేకపోయినా డ్రెయిన్లలోని నీటితోనే సాగు చేపడుతున్నారు. ప్రస్తుతం మంచినీటి కాలువలతోపాటు డ్రెయిన్లు, కొల్లేరు సరస్సు కూడా ఎండిపోవడంతో ఆక్వారంగానికి ఎదురుదెబ్బ తగిలింది. రోజురోజుకూ విస్తరిస్తున్న ఉప్పునీటి రొయ్యల సాగుతో మంచినీటి చేపల పెంపకం మరింత దారుణంగా తయారైంది. చెరువుల్లో రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. నీరు చిక్కబడి ఉప్పుశాతం పెరిగి చేపపిల్లలు చనిపోతున్నాయి. రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టిన రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.
చేపకు వేసవి కష్టం (కృష్ణాజిల్లా)
రాష్ట్రానికి ఆక్వారంగాన్ని తలమానికంగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ రంగానికి ఆయువు పట్టు అయిన నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. చేపపిల్లలను బతికించుకుంటేనే వచ్చే ఏడాదిలో పెంపకానికి అనువైన పరిస్థితులు ఉంటాయి. లేకుంటే చేపల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రానికి ఆదాయం గడించిపెడుతున్న రంగాల్లో ఆక్వారంగానిదే కీలకపాత్ర. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలనుంచే అత్యధిక భాగం ఆదాయం సమకూరుతోంది.అధికారుల లెక్కల ప్రకారం.. కృష్ణా జిల్లాలో 55 వేల హెక్టారుల్లో ఆక్వాసాగు జరుగుతోంది. మరో 20 వేల హెక్టార్లుల్లో అనధికార సాగు ఉందని అంచనా. దీనివల్ల ఏటా 11.40 లక్షల టన్నుల ఉత్పత్తులు, రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాం. చేపల సక్రమ పెరుగుదలకు మంచినీరు ఎంతో అవసరం. కనీసం ప్రతి ఆర్నెల్లకు ఒకసారైయినా చెరువుల్లో నీటిని మార్చుకుంటే చేపల సాగులో నాణ్యమైన దిగుబడులకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఆక్వారంగంలో సాధిస్తున్న అద్భుతాలన్నీ కేవలం రైతుల స్వయంకృషి వల్లే సాధ్యపడ్డాయి. ప్రభుత్వం కొండంత ప్రోత్సాహం అందించడానికి బదులు గోరంత సాయంతో పరిపెడుతోంది. ఏటా నీటి లభ్యత లేకపోవడంతో సాగుదార్లకు నష్టాలు తప్పడం లేదు. వాడే మేతలు, మందులు, విస్తరిస్తున్న రొయ్యలసాగు, పెరుగుతున్న చెరువులతో ప్రభుత్వానికి ఈ వృద్ధి కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం దినదినగండంలా తయారైంది. ముఖ్యంగా కృష్ణా డెల్టాలోని చేపల రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.ఉప్పునీరు జిల్లాలో చేపల దిగుబడులపై ప్రభావాన్ని చూపుతోంది. వర్షాకాలం పంటలో రైతులకు కాస్త ఊరట లభించినా వేసవికాలంలో పంట పూర్తిగా నష్టాలకు గురిచేస్తోంది. చెరువుల్లో ఉప్పుశాతం పెరిగిపోవడంతో చేపల్లో పెరుగుదల నిలిచిపోతోంది. మేతలు, మందుల ఖర్చు తప్పదు. సాధారణంగా నెలకు చేపల పెరుగుదల 100 నుంచి 200 గ్రాముల మధ్యలో ఉండాలి. ఉప్పునీటి వల్ల కనీసం 50 గ్రాములు కూడా పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేప పిల్లల చెరువుల పరిస్థితి చెప్పనవసరం లేదు. పిల్లల చెరువులు ఉప్పునీటితో పూర్తిగా ఖాళీగా మారుతున్నాయి. ఉప్పుశాతం ఐదు కంటే ఎక్కువగా ఉంటే చేపపిల్లల కళ్లు పేలిపోయి మృత్యువాతపడతాయి. ప్రస్తుతం డెల్టా శివారు ప్రాంతంలో ఏ చెరువులో చూసినా 4 నుంచి 6 శాతం ఉప్పు ఉండటంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర చేపల పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడే ప్రమాదముంది. ఫలితంగా చేపల సాగును వదలి రొయ్యలసాగుపై మక్కువ చూపుతున్నారు.భారీస్థాయిలో ఆదాయాన్ని గడించిపెడుతున్న ఈ రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఇతర రాష్ట్రాలలో చేపల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు, రుణాలు, ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే ఇక్కడ మాత్రం కనీసం అటువైపు చూడటం లేదు. రైతులు నానా తంటాలు పడి సాగు చేస్తున్నా కనీసం చేపల వ్యాధుల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో అవసరమైన నీటిని సైతం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఇక్కడ మాత్రం ఆ ఆలోచనే లేదు. ఎన్నో సార్లు రాష్ట్ర చేపల సంఘం ఆక్వారంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం దీనిపై సరైన రీతిలో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.